Vishal: ఆస్తుల వివరాలను సమర్పించాలని హీరో విశాల్‌కు కోర్టు ఆదేశం.. అసలు ఏం జరిగిందంటే..
రుణం తిరిగి చెల్లించాలన్న ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి, సెప్టెంబర్ 9 లోపు ఆస్తుల వివరాలను వెల్లడించాలని విశాల్‌ను ఆదేశించారు.
తమిళ్ స్టార్ హీరో విశాల్ (Vishal) తన ఆస్తుల వివరాలను దాఖలు చేయాలని చెన్నై హైకోర్టు ఆదేశించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాకు చెల్లించాల్సిన రూ. 21 కోట్లు చెల్లించని పక్షంలో తన ఆస్తుల వివారలను సమర్పించేందుకు మరో రెండు వారాల గడువు ఇచ్చింది . హీరో విశాల్.. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాల నిర్మాణం కోసం గోపురం ఫిల్మ్స్ నుంచి రూ. 21 కోట్ల 29 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే విశాల్‌కు.. నిర్మాణ సంస్థ లైకాకు మధ్య జరిగిన ఒప్పందంతో గోపురం ఫిల్మ్స్‌కు మొత్తం అప్పును లైకా చెల్లించింది.
విశాల్ తమకు ఇవ్వాల్సిన మొత్తం నగదు చెల్లించేవరకు విశాల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించే అన్ని సినిమాల హక్కులను లైకాకు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే విశాల్ అప్పు చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. వీరమే వాగై చూడుమ్ సినిమా విడుదలపై నిషేధం విధించాలంటూ లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. విశాల్ తరపున రూ. 15 కోట్లు లైకా సంస్థకు డిపాజిట్ చేయాలని కోరింది. దీంతో ఈ కేసుపై విచారణ జరపగా. ఇటీవల తన చిత్రనిర్మాణ సంస్థ.. విశాల్ ఒకేరోజు రూ. 18 కోట్లు నష్టపోవడంతో లైకా సంస్థకు అప్పు చెల్లించలేకపోయినట్లుగా హీరో తెలిపారు. రుణం తిరిగి చెల్లించాలన్న ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి, సెప్టెంబర్ 9 లోపు ఆస్తుల వివరాలను వెల్లడించాలని విశాల్‌ను ఆదేశించారు.
ఇక తాజాగా మరోసారి న్యాయమూర్తి ఎం సుందర్ విచారణ జరిపగా.. విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసేందుకు అదనపు సమయం కావాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీంతో అఫిడవిట్ దాఖలు చేయడానికి నటుడు విశాల్‌కు మరో రెండు వారాల గడువు ఇచ్చిన న్యాయమూర్తి కేసు విచారణను సెప్టెంబర్ 23కి వాయిదా వేశారు.