AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్‏లతో కలిసి సినిమా ఎంట్రీ.. కానీ ఆ ఒక్క పాత్రతోనే క్రేజ్.. ఈ నటుడి గురించి తెలుసా..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అందులో విలక్షణ నటుడు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఒకరు. మాయాబజార్ శకునిగా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితులు. హీరోగా కెరీర్ ప్రారంభించి, కామెడీ, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ దిగ్గజం అనేక చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించి, తన వాచికం, అభినయంతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు.

Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్‏లతో కలిసి సినిమా ఎంట్రీ.. కానీ ఆ ఒక్క పాత్రతోనే క్రేజ్.. ఈ నటుడి గురించి తెలుసా..
Csr Anjaneyulu
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2026 | 10:04 PM

Share

తెలుగు సినీ చరిత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, విలక్షణ నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన సి.ఎస్.ఆర్. ఆంజనేయులు (చిలకలపూడి సీతారామాంజనేయులు) తన వాచికం, అభినయంతో తరతరాల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన పేరు వినగానే చాలామందికి మాయాబజార్ చిత్రంలోని శకుని పాత్ర గుర్తుకు వస్తుంది. అయితే, సి.ఎస్.ఆర్. ప్రస్థానం కేవలం శకుని పాత్రకు మాత్రమే పరిమితం కాదు. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక విభిన్న పాత్రలకు ప్రాణం పోశారు.

1907 జూలై 11న నరసరావుపేటలో జన్మించిన సి.ఎస్.ఆర్. తండ్రి లక్ష్మీనరసింహమూర్తికి నాటకాలపై ఉన్న ఆసక్తి వల్ల చిన్నతనం నుంచే ఆయనకు పాటలు పాడటం అలవడింది. 11వ ఏట షేక్స్‌పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో షైలాక్ పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టారు. ఒంగోలులో నాటకరంగం కళాపీఠంగా వెలుగొందుతున్న రోజుల్లో, హిందూ నాటక సమాజం, కృష్ణ విలాస సభ, శృంగార విలాస సభ వంటి వాటిలో ఆయన తన ప్రతిభను చాటారు. 15 ఏళ్ల వయసులోనే నారద, శ్రీకృష్ణ పాత్రలు పోషించి స్థానం నరసింహారావు వంటి ప్రముఖుల దృష్టిలో పడ్డారు. తండ్రికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో చదువును మధ్యలోనే వదిలేసి, నాటకాలను కెరీర్‌గా ఎంచుకున్నారు. 1927లో రామదాసు నాటకంలో టైటిల్ రోల్ పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు.

1936లో ద్రౌపదీ వస్త్రాపహరణం చిత్రంతో శ్రీకృష్ణుడిగా సినీరంగ ప్రవేశం చేసినా, తొలి దశలో నాటకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కోయంబత్తూరులోని సెంట్రల్ స్టూడియో వారు నిర్మించిన తుకారాం చిత్రంలో టైటిల్ రోల్ పోషించి నటుడిగా నిరూపించుకున్నారు. 1939లో విడుదలైన బాలాజీ చిత్రంలో హీరోగా నటించి, తెలుగునాట తొలి తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మెప్పించారు. ఆ తర్వాత చూడామణి, తల్లి ప్రేమ, సుమతి, పాదుకా పట్టాభిషేకం వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. భీష్మ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన పద్యాలు థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

అయితే, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి యువ హీరోల ప్రవేశంతో సి.ఎస్.ఆర్. హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాల్సి వచ్చింది. మాయాబజార్లో శకుని, అప్పుచేసి పప్పుకూడులో రావుబహదూర్ రామదాసు, పాతాళభైరవిలో మహారాజు, కన్యాశుల్కంలో రామప్ప పంతులు, జగదేకవీరుని కథలో బాదరాయణ ప్రగడ వంటి ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. ఆయన విలక్షణ వాచికాన్ని తరువాతి తరం హాస్యనటులు, మిమిక్రీ కళాకారులు అనుకరించారు. మలయాళ చిత్రంలో కుచేలుడిగా నటించి కేరళ ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నప్పుడు “తెలుగుదేశంలో పుట్టి తెలుగు చిత్రాల్లో నటిస్తున్న నన్ను ఈ చిత్రం ఉత్తమ మలయాళ నటుడిగా నిలబెట్టింది. నా జీవితం ధన్యమైంది” అని ఆయన అన్న మాటలు ఆయన నిబద్ధతను చాటిచెబుతాయి.

సి.ఎస్.ఆర్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా శివగంగ, రిక్షావాలా చిత్రాలను రూపొందించే ప్రయత్నం చేశారు, కానీ ఆర్థిక కారణాల వల్ల అవి పూర్తి కాలేదు. తన తోటి నటీనటులకు ఇంటి నుంచి తెచ్చిన పచ్చళ్ళు, పొడులు వడ్డించే ఆయన మంచి మనసును సూర్యకాంతమ్మ వంటి నటీమణులు కూడా ఆదర్శంగా తీసుకున్నారు. చివరి రోజుల్లో అవకాశాలు తగ్గినా, ప్రతిరోజు పది రూపాయలు పాండీ బజార్‌లో పేదలకు దానం చేసేవారు. 1963 అక్టోబర్ 8న ఆయన కన్నుమూసే వరకు దాదాపు 175 చిత్రాల్లో నటించి, తెలుగు సినీ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన సినీ వారసత్వం నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉంది.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us