వంటకు ఏ నూనె మంచిది..? ఆరోగ్యానికి హాని చేసే నూనెలు ఇవే! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో మనం ఉపయోగించే వంటనూనె అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. రుచికరమైన వంటకాల కోసం చాలామంది రకరకాల నూనెలను వాడుతుంటారు. కానీ, తప్పుడు నూనెను ఎంచుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ప్రమాదం ప్రమాదకరంగా పెరుగుతుంది. మన ఆరోగ్యానికి హాని కలిగించే వంటనూనెలు ఏవి, వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

మనం రోజువారీ వంటల్లో ఉపయోగించే వంటనూనె మన ఆరోగ్యంపై, ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. మార్కెట్‌లో లభించే అనేక రకాల నూనెల్లో కొన్ని రకాలు ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఎలాంటి నూనెలను ఎంచుకోవడం శ్రేయస్కరం. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్యానికి హాని చేసే నూనెలు:
పదే పదే వేడి చేసిన నూనె:
బాండీలో మిగిలిపోయిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం అత్యంత ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల నూనెలో ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి. ఇవి శరీరంలో మంట ను పెంచి, కాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
వనస్పతి, డాల్డా :
హైడ్రోజనేషన్ పద్ధతి ద్వారా తయారుచేసే డాల్డా లేదా వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి రక్తప్రసరణను అడ్డుకుంటాయి.
పామ్ ఆయిల్:
పామ్ ఆయిల్‌లో సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
అధికంగా రిఫైన్ చేసిన నూనెలు:
కెమికల్స్, అధిక ఉష్ణోగ్రత వద్ద రిఫైన్ చేసిన నూనెల వల్ల వాటిలోని సహజ పోషకాలు నశిస్తాయి. ఇవి శరీర బరువు పెరగడానికి, డయాబెటిస్‌కు కారణమవుతాయి.
ఏ నూనెలు ఆరోగ్యానికి మంచివి?:
ఆరోగ్యంగా ఉండటానికి గానుగ ద్వారా తీసిన సహజ సిద్ధమైన నూనెలు వాడటం ఉత్తమం.
వేరుశెనగ నూనె, నువ్వుల నూనె: వీటిలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉండి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆవనూనె : దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
ఆలివ్ ఆయిల్: తక్కువ మంటపై వండే వంటలకు లేదా సలాడ్స్‌కు ఆలివ్ ఆయిల్ చాలా మంచిది.




