ప్రభుత్వశాఖలో పందికొక్కులు.. ఒకే ఆధార్.. రెండు ఉద్యోగాలు.. రెండు జీతాలు!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పేరోల్ వ్యవస్థలో వెలుగుచూస్తున్న డూప్లికేట్ వివరాలు ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఒకే ఆధార్ నంబర్‌తో వేర్వేరు ఉద్యోగ ఐడీలపై ఇద్దరు ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు ఆర్థికశాఖ పరిశీలనలో బట్టబయలైంది. మరికొన్ని కేసుల్లో ఒక శాఖలో ఆధార్ వివరాలతో జీతం చెల్లిస్తుండగా.. మరో శాఖలో ఆధార్ లేకుండానే వేతనం డ్రా అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పేరోల్ వ్యవస్థలో వెలుగుచూస్తున్న డూప్లికేట్ వివరాలు ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఒకే ఆధార్ నంబర్‌తో వేర్వేరు ఉద్యోగ ఐడీలపై ఇద్దరు ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు ఆర్థికశాఖ పరిశీలనలో బట్టబయలైంది. మరికొన్ని కేసుల్లో ఒక శాఖలో ఆధార్ వివరాలతో జీతం చెల్లిస్తుండగా.. మరో శాఖలో ఆధార్ లేకుండానే వేతనం డ్రా అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఒక వ్యక్తి రెండు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగిగా ఎలా కొనసాగగలిగారు? ఒకే గుర్తింపు వివరాలతో రెండు చోట్లా జీతాలు ఎలా డ్రా అయ్యాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
40 ఆధార్‌లు.. 80 మంది ఉద్యోగులు..!
ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పేరోల్ డేటాను ఆర్థికశాఖ ప్రత్యేకంగా పరిశీలించింది. ఈ పరిశీలనలో 40 అనుమానాస్పద ఆధార్ నంబర్లతో సుమారు 80 మంది ఉద్యోగుల వివరాలు గుర్తించినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ఉద్యోగికి నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వేతనాలు చెల్లించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విద్యాశాఖలోనూ ఒకే ఆధార్ నంబర్‌తో ఇద్దరు ఉద్యోగులకు వేతనాలు చెల్లించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని కేసుల్లో ఉద్యోగుల పేర్లు వేర్వేరుగా ఉండటం, మరికొన్ని సందర్భాల్లో వేర్వేరు వివరాలతో వేతనాలు ప్రాసెస్ కావడం అనుమానాలకు తావిస్తోంది. అయితే వీటిలో ఎన్ని కేసులు వాస్తవంగా అక్రమ డబుల్ ఎంప్లాయ్‌మెంట్‌కు సంబంధించినవి? ఎన్ని సాంకేతిక లేదా డేటా ఎంట్రీ లోపాలు? అనేది పూర్తిస్థాయి విచారణ తర్వాతే తేలనుంది.
IFMISలో డూప్లికేట్ డేటా ఎందుకు పట్టుబడలేదు?
ఒకే ఆధార్ నంబర్‌పై రెండు వేర్వేరు ఉద్యోగ ఐడీలతో 010 పద్దు కింద వేతనాలు ఎలా డ్రా అయ్యాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉద్యోగి నియామకం సమయంలోనే గుర్తింపు, సర్వీస్ వివరాలు, గత ఉద్యోగ రికార్డులను క్రాస్‌చెక్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఒకే వ్యక్తి రెండు శాఖల్లో ఉద్యోగిగా నమోదైతే.. ఆ సమాచారాన్ని సంబంధిత వ్యవస్థలు ఎందుకు గుర్తించలేకపోయాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక ఉద్యోగి వివరాలు ఒక శాఖలో ఆధార్‌తో అనుసంధానమై ఉండగా.. మరో శాఖలో ఆధార్ లేకుండానే జీతం ఎలా చెల్లించారు? ఉద్యోగి పేరు మారితే ఆధార్, PAN, సర్వీస్ రికార్డులు, ఇతర గుర్తింపు వివరాలను అనుసంధానం చేసి డూప్లికేషన్‌ను గుర్తించే ఆటోమేటెడ్ మెకానిజం ఉందా? పేరోల్ బిల్లులు ఆమోదించే ముందు సంబంధిత డ్రాయింగ్ అధికారుల స్థాయిలో ఎలాంటి వెరిఫికేషన్ జరుగుతోంది? అన్న అంశాలు ఇప్పుడు విచారణలో కీలకంగా మారాయి.
సాంకేతిక తప్పిదమా.. ఉద్దేశపూర్వక మోసమా?
ఈ వ్యవహారంలో మరో కీలక కోణం కూడా బయటపడింది. ఇది కేవలం డేటా ఎంట్రీ లేదా పేరోల్ సిస్టమ్‌లోని సాంకేతిక లోపం మాత్రమేనా? లేక వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల వేతనాలు పొందారా? అన్నదీ తేలాల్సి ఉంది. ఉద్యోగులు కావాలనే తప్పుడు వివరాలతో రెండు వేతనాలు పొందినట్లు తేలితే.. అక్రమంగా డ్రా చేసిన మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
సీఎస్ సీరియస్.. వారం రోజుల్లో నివేదిక
ఈ పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. వ్యవహారంపై అత్యవసరంగా విచారణ చేపట్టి ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. రెండు శాఖల్లోనూ వేతనాలు పొందుతున్నట్లు తేలిన ఉద్యోగులు ఎవరు? వారి నియామక ప్రక్రియ ఎలా జరిగింది? డూప్లికేట్ వివరాలు ఎలా నమోదయ్యాయి? జీతాల బిల్లులను ఎవరు ప్రాసెస్ చేశారు? ఎవరి స్థాయిలో వెరిఫికేషన్ విఫలమైంది? వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు.
ఇదే సమయంలో.. రెండు చోట్ల జీతాల చెల్లింపులకు అధికారులు తెలిసీ సహకరించారా? లేక వ్యవస్థలోని లోపాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందా? అన్నదీ విచారణలో తేలనుంది. రెగ్యులర్ ఉద్యోగుల వివరాలను సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదేశాలు రావడంతో మరిన్ని డూప్లికేట్ కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలపై అనుమానాలు, బోగస్ ఉద్యోగుల అంశాలు చర్చకు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగుల పేరోల్‌లోనూ ఇలాంటి డూప్లికేషన్లు బయటపడటం ప్రభుత్వ ఉద్యోగుల డేటా వెరిఫికేషన్, పేరోల్ నియంత్రణ వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. పూర్తి స్థాయి విచారణ నివేదిక వెలువడిన తర్వాతే ఈ వ్యవహారంలో అసలు అక్రమం ఎంత? బాధ్యులు ఎవరు? ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లింది? అన్నదానిపై స్పష్టత రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
