AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పింఛన్ల డబ్బులు.. చేయూతకు దరఖాస్తు గడువు ఎప్పటివరకంటే..

తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులతో పాటు థలసీమియా, సికిల్‌సెల్, హిమోఫీలియా బాధితులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పింఛన్ల డబ్బులు.. చేయూతకు దరఖాస్తు గడువు ఎప్పటివరకంటే..
Cheyutha Pension Scheme
Prabhakar M
| Edited By: |

Updated on: Aug 08, 2026 | 9:33 AM

Share

హైదరాబాద్: తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.

వీరికి ప్రాధాన్యం

కొత్త పింఛన్ల మంజూరులో ప్రభుత్వం పలు వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో థలసీమియా, సికిల్‌సెల్, హిమోఫీలియా బాధితులు కూడా పింఛన్లకు ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి వస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ లేదు

చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులకు ఎలాంటి చివరి తేదీని నిర్ణయించలేదు. అర్హత ఉన్న వారు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆదాయ పరిమితి ఎంత?

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉన్నవారు అర్హులుగా పరిగణిస్తారు. ఈ పరిమితికి మించి ఆదాయం ఉన్న కుటుంబాలు పింఛన్‌కు అనర్హులు.

అలాగే మూడు ఎకరాలకు మించి మాగాణి భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్నవారిని కూడా అర్హులుగా పరిగణించరు.

వీరికి పింఛన్ వర్తించదు..

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనర్హులుగా ఉంటారు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు కూడా పింఛన్‌కు అర్హులు కారు.

ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్‌ల యజమానులు, వారి తల్లిదండ్రులకు కూడా చేయూత పింఛన్ వర్తించదు. ఇప్పటికే ప్రభుత్వ పింఛన్ లేదా స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ పొందుతున్నవారిని కూడా కొత్త పింఛన్‌కు అనర్హులుగా పరిగణిస్తారు. నాలుగు చక్రాల వాహనం లేదా భారీ వాహనం ఉన్నవారికీ పింఛన్ మంజూరు చేయరు.

ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు

గతంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ దరఖాస్తు రికార్డులో ఉందా లేదా అన్న విషయాన్ని పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డు అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది.

కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే..

కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేయూత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వివరాలను పూర్తిచేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి.

పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు లేదా పురపాలక కమిషనర్లకు దరఖాస్తులను అందజేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది.

Follow Us