AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటి.. అత్తవారింటి వేధింపులు,ఆర్థిక ఇబ్బందులతో జీవితం అతలాకుతలం

నటి, గాయని ఎస్. వరలక్ష్మి సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం ఎంతో వైవిధ్యభరితం. బాలనటిగా అరంగేట్రం చేసి అగ్రతారగా ఎదిగారు. స్వంత నిర్మాణంతో ఆర్థికంగా నష్టపోయారు. మానసిక వికలాంగుడైన కుమారుడి ఆలనా పాలన, భర్త మరణం, అత్తవారింటి వేధింపులతో ఆమె జీవితం నరకప్రాయమైంది.

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటి.. అత్తవారింటి వేధింపులు,ఆర్థిక ఇబ్బందులతో జీవితం అతలాకుతలం
Actress Pic
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2026 | 11:08 AM

Share

తెలుగు సినీ చరిత్రలో తన బహుముఖ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి ఎస్. వరలక్ష్మి. ఆమె జీవితం తెర వెనుక విషాద గాథ. నటిగా, గాయనిగా, సంగీత విద్వాంసురాలిగా అపారమైన కీర్తిని సంపాదించిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, పోరాటాలు ఎందరినో కదిలిస్తాయి. 1927లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నీలాచలం దంపతులకు జన్మించిన వరలక్ష్మి బాల్యం నుంచే కష్టాలను చూశారు. ఆడపిల్లలంటే అసహ్యించుకునే తండ్రి వేధింపుల నుంచి ఆమెను పెద్దమ్మ, రంగయ్య నాయుడు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ రంగయ్య నాయుడు దగ్గర సంగీతం నేర్చుకుంటూ పెరిగారు. ఒకరోజు కర్నూలుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆమె పాట విని బాలయోగిని (1937) చిత్రంలో అవకాశం కల్పించారు. అక్కడి నుంచి ఆమె సినీ ప్రయాణం మొదలైంది. కే. సుబ్రహ్మణ్యం తీసిన సేవా సదనం (1938)లో చిన్ననాటి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత రైతుబిడ్డ, ఇల్లాలు వంటి చిత్రాలలో చిన్న పాత్రలు చేశారు.

కమలా కోట్నిస్ నిరాకరించిన పాత్రలో కే. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మాయాలోకం చిత్రంలో మూడవ కథానాయికగా నటించే అవకాశం వరలక్ష్మికి వచ్చింది. అప్పటికే ఆమె రేడియోలో పాటలు పాడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. మాయాలోకం చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన బాలరాజు (1948) చిత్రం సంచలనం సృష్టించి రికార్డు విజయం సాధించింది. అక్కడి నుంచి ఆమె కెరీర్ వెనుదిరిగి చూడలేదు. వెంకటేశ్వర మహాత్మ్యం, శ్రీకృష్ణ తులాభారం, సత్య హరిశ్చంద్ర వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అగ్ర కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. తమిళంలో కే. బాలచందర్ తీసిన బొమ్మ బొరుసా వంటివి ఆమెకు గొప్ప పేరు తెచ్చాయి. ఆమె గొప్ప గాయని మాత్రమే కాదు, ప్రముఖ సంగీత విద్వాంసురాలు కూడా. ఎస్. వరలక్ష్మి వ్యక్తిగత జీవితం అనేక ఆటుపోట్లతో నిండింది. తొలుత అక్కినేని నాగేశ్వరరావును ప్రేమించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.ఎల్. శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. దురదృష్టవశాత్తు, వారి కుమారుడు మానసిక వికలాంగుడు. అతని ఆలనా పాలన వరలక్ష్మికి ఒక పెద్ద సవాలుగా మారింది. స్వంత నిర్మాణ సంస్థ స్థాపించి సతీ సావిత్రి, మరో చిత్రం నిర్మించి భారీ ఆర్థిక నష్టాలను చవిచూశారు.

1977లో భర్త ఏ.ఎల్. శ్రీనివాస్ మరణం తర్వాత వరలక్ష్మి జీవితం మరింత దుర్భరమైంది. అత్తవారింటి వేధింపులు, చిత్రహింసలు ఆమెను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేశాయి. తెలుగు ఆవిడ కావడంతో అత్తవారు ఆమెను సరిగా గౌరవించలేదు. ఆర్థిక ఇబ్బందులు పెరిగి, చివరికి గీతాంజలి వంటి సహచర నటీమణుల నుంచి సహాయం కోరే పరిస్థితికి చేరారు. ఈ పరిస్థితి గురించి జెమినీ గణేషన్, గీతాంజలి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వివరించారు. బాల్యంలో వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆడుకున్న జయలలిత, ఆమె పరిస్థితికి చలించి, వరలక్ష్మి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందించారు.మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడి బాగోగులు చూసుకుంటూ, అత్తవారింటి వేధింపులు, ఆర్థిక ఇబ్బందుల నడుమ 2009లో ఎస్. వరలక్ష్మి మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us