వదంతులు, కట్టుకథలను నమ్మొద్దు.. 22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..
22ఏ భూముల వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రైవేటు భూముల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని స్పష్టం చేశారు. 22ఏ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నా.. రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి, ప్రైవేటు భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

22ఏ భూముల వ్యవహారంలో యజమానులకు ఇబ్బందులు రానివ్వమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రైవేటు భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. వదంతులు, కట్టుకథలను నమ్మొద్దని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి.. దళారులను ఆశ్రయించొద్దన్నారు.
రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారని చెప్పారు రేవంత్‌రెడ్డి. జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారని చెప్పారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రేవంత్‌రెడ్డి.. 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దని సూచించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని భరోసా ఇచ్చారు.
