చిన్నారి రేవతి మరణం తనను తీవ్రంగా కలచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నాలుగేళ్ల కిందట తాను విశాఖలో పర్యటించిన సందర్భంలో ఓ నిరుపేద తల్లి తన చిన్నారిని ఒడిలో పెట్టుకుని పవన్ దగ్గరకు తీసుకువచ్చింది. పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన రేవతి.. అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేదని. అంతటి అనారోగ్య సమస్యతో పోరాడుతున్న ఆ చిన్నారికి పవన్ ను చూడాలనే కోరిక ఉందని తెలిసి బాలికను దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చొబెట్టుకుని కాసేపు మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని స్వయంగా చూసి చలించిపోయారు. ఆమెకు ఆర్థిక సాయం కూడా అందించారు. వ్యాధి కారణంగా నరాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ జీవచ్ఛవంలా మారుతున్న ఆ పాపకు ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా అందించారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో ఇటీవల ఆ చిన్నారి మరణించింది. ఆ పాప మరణం తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగ ట్వీట్ చేశారు.
” నాలుగేళ్ల కిందట ఎస్. రేవతి అనే చిన్నారి నన్ను కలిసింది. మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన ఈ చిన్నారి అనారోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ చూపిన ధైర్యం నన్ను అబ్బురపరచింది. భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించాను. అయితే తనకున్న వ్యాధి కారణంగా ఈ చిన్నారి మూడు రోజుల కిందట 12 ఏళ్లకే శివైక్యం చెందడం చాలా బాధాకరం. ఈ విషయం నా మనసును తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
తుదిశ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్న వీడియో తన మనసును కలచివేసిందని..పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టమని డాక్టర్లు చెప్పినా.. 12 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పవన్.
నాలుగేళ్ల కిందట ఎస్. రేవతి అనే చిన్నారి నన్ను కలిసింది. మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన ఈ చిన్నారి అనారోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ చూపిన ధైర్యం నన్ను అబ్బురపరచింది. భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించాను. (1/2) pic.twitter.com/l4v38ZJxTh
— JanaSena Party (@JanaSenaParty) February 19, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.