AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈవీపి స్టూడియో మూతపడునుందా..?

 'భారతీయుడు-2' చిత్ర షూటింగ్ సమయంలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని క్రేన్ ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర కథానాయకుడు కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.

ఈవీపి స్టూడియో మూతపడునుందా..?
Ram Naramaneni
|

Updated on: Feb 24, 2020 | 9:45 PM

Share

‘భారతీయుడు-2’ చిత్ర షూటింగ్ సమయంలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని క్రేన్ ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర కథానాయకుడు కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. తాను ముగ్గురు స్నేహితులను కొల్పోయానని, ఒక్కో కుటుంబానికి కోటి చొప్పున సాయం చేస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కమల్ పేర్కొన్నాడు.

చెన్నైలోని ఈవీపి స్టూడియో సెట్‌లో గత బుధవారం రాత్రి లైటింగ్ ఏర్పాటు చేస్తోన్న సమయంలో..150 అడుగుల ఎత్తులో ఉన్న క్రేన్ తెగి మూవీ యూనిట్ ఉన్న టెంట్‌పై పడింది.ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు(29), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34) స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై కోలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు స్పందించి.. తమ సానుభూతిని ప్రకటించారు.

అయితే ఈవీపి స్టూడియో సెట్‌లో గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ అక్కడే జరగగా.. ఆ సమయంలో విద్యుత్ షాక్ కొట్టి మైఖేష్ అనే ఓ టెక్నీషియన్ మృతి చెందారు. ఇక విజయ్ నటించిన బిగిల్ మూవీ షూటింగ్ కూడా కొంత భాగం అక్కడే జరగ్గా.. 100 అడుగుల క్రేన్ నుంచి ఫోకస్ లైట్ పడటంతో సెల్వరాజ్ అనే ఓ ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మరణించారు. అంతేకాదు తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఆ సమయంలో ఏసీ మెకానిక్ కన్నుమూశారు. ఇలా వరుసగా ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతుండటం.. కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో  ఆ స్టూడియోని మూసివేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. పదే, పదే సినిమా టెక్నిషియన్లు ప్రాణాలు తీస్తోన్న స్టూడియోను మూసివేయాలని కోరుతూ వాయిస్ ఆఫ్ తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సి రాజశేఖరన్ అనే న్యాయవాది చెన్నై పోలీసులను ఆశ్రయించారు. ఆ స్టూడియోలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. అందులో భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవని,  ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేయరాదని, కేంద్ర నేర శాఖ దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.