దళపతి విజయ్.. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఈ హీరోకు తెలుగుతోపాటు, హిందీలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాల కోసం సౌత్, నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చూస్తుంటారు. బాలనటుడిగా అడుగుపెట్టి.. స్టార్ డమ్ సంపాదించుకుని… అభిమానులచేత ముద్దుగా దళపతి అని పిలుచుకుంటున్న విజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే విజయ్ గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా.
1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు విజయ్. ఆయనను సినీ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం అతని తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్. 1984లో బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించారు విజయ్. 1984 నుంచి 1988 వరకు విజయ్ ఆరు సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. ముఖ్యంగా తన తండ్రి నిర్మించిన చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. 1992లో ‘నాలయ గడ్డి’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. విజయ్ దళపతికి మాస్ హీరోగా అభిమానులలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాగే సొంతంగా ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ అనే సామాజిక సంక్షేమ సంస్థను కూడా ప్రారంభించారు. ఆయన అభిమానులు ప్రతి సంవత్సరం రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నటుడు రజనీకాంత్ లేకపోతే తాను సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టేవాడినని విజయ్ ఎప్పుడూ అంటుంటారు. ఎందుకంటే అతను రజనీకి వీరాభిమాని. అలాగే విజయ్ కి తన చెల్లెలు విద్య అంటే చాలా ఇష్టం. విజయ్‌కి తొమ్మిదేళ్ల వయసులోనే చెల్లెలు చనిపోవడం అతడిపై తీవ్ర ప్రభావం చూపింది. తన చెల్లెలు గౌరవార్థం, విజయ్ తన నిర్మాణ సంస్థకు చెల్లి పేరు పెట్టుకున్నారు. విజయ్ నిర్మాణ సంస్థ పేరు.. ‘వివి ప్రొడక్షన్స్ విద్యా-విజయ్ ప్రొడక్షన్స్’. తమిళ్ స్టార్ హీరో అయినా.. బాలీవుడ్ చిత్రాలలో అతిధి పాత్రలు చేశారు విజయ్. అక్షయ్ కుమార్ ‘రౌడీ రాథోర్’లో, ‘చిందా దా దా’ పాట చివరలో అక్షయ్‌తో చిన్న డ్యాన్స్ చేశాడుఅల్లు అర్జున్ కాకుండా కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తమిళ్ నటుడు విజయ్ మాత్రమే.
విజయ్ నటించిన ‘తేరి’ కేరళలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అప్పట్లో చాలా మలయాళ చిత్రాల కంటే ఎక్కువ రోజులు నడిచింది. ఇటీవలే వారసుడు సినిమాతో నేరుగా తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్నారు.