Cinema : ఆ ఒక్క ప్రమోషన్ చేయకపోతే సినిమా ప్లాప్ అయ్యేది.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసింది..
దర్శకుడు కె. అజయ్ కుమార్ తన సినిమా ప్రమోషన్ గురించి వివరించారు. ప్రారంభంలో అంతగా ఆడకపోయినా, థియేటర్లలో టికెట్‌తో పాటు కర్చీఫ్‌లు ఇవ్వడం ద్వారా సినిమా ఊహించని విజయం సాధించిందని, ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేసి, గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించి, ఒక సాధారణ రిక్షా కార్మికుడికి సైతం చేరువయ్యిందని ఆయన వెల్లడించారు.

దర్శకుడు కె. అజయ్ కుమార్ మాతృదేవోభవ చిత్ర ప్రమోషన్ల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం థియేటర్లలోకి కర్చీఫ్‌లు తీసుకొచ్చిన అసాధారణ మార్కెటింగ్ వ్యూహాన్ని వివరించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది మద్యపానం మానేసినట్లు, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఎందరో లేడీస్ తమ భర్తలు సినిమా చూసి తాగడం మానేశారని చెబుతూ లేఖలు రాశారని. ఈ సినిమా ప్రభావం ఎంతగా ఉందంటే, “ఈ సినిమా ఏడవకుండా ఎవరైనా చూడగలిగితే వెయ్యి రూపాయలు బెట్టింగ్” అని పేపర్లలో వార్తలు కూడా వచ్చాయని, అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తమని అన్నారు. ఈ సినిమా ప్రభావానికి ఉదాహరణగా, కె. అజయ్ కుమార్ కావలిలో జరిగిన శ్రీరామనవమి వేడుకలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో రాత్రిపూట ఓపెన్ ప్లేసెస్‌లో వీసీడీ క్యాసెట్‌లు ప్లే చేసి, టీవీలు పెట్టి సినిమాలు చూపించేవారు. ఒకే వీధిలో మాతృదేవోభవను ఒకచోట, చిరంజీవి ముఠామేస్త్రిని మరొకచోట ప్రదర్శిస్తుంటే, ముఠామేస్త్రి దగ్గర జనం లేకపోయినా, మాతృదేవోభవ దగ్గర జనాలు గుంపులు గుంపులుగా చేరి, రోడ్డు మీద కూర్చుని బోరున ఏడ్చారని, ఏడవని వారు ఒక్కరూ కూడా లేరని ఆయన వివరించారు. చాలా మంది థియేటర్లో చూస్తేనే కళ్ళ నీళ్ళు వస్తాయని, టీవీలో రావు అని చెప్పేవారు కూడా, రోడ్డు మీద టీవీలో ఈ సినిమా చూసి ఇన్వాల్వ్ అయ్యారని ఆయన గుర్తుచేసుకున్నారు.
సినిమా విడుదలైన తొలి రోజుల్లో, దేవి థియేటర్‌లో శుక్రవారం 10% మంది ప్రేక్షకులు కూడా లేరు. శని, ఆదివారాలకు అది 11-12%కు మాత్రమే పెరిగింది. పక్క థియేటర్లలో పాత సినిమాలు కూడా ఫుల్ అవుతుంటే, మాతృదేవోభవ పరిస్థితి దారుణంగా ఉందని కె. అజయ్ కుమార్ ఆశ్చర్యపోయారు. ఒక ప్రేక్షకుడు సినిమా చూసి బయటకు వస్తూ, “ఇదేం సినిమా అండి? అద్భుతమైన సినిమా, కానీ ఈ జనాలందరికీ బట్టలు ఊడదీసే సినిమా అయితేనే నచ్చుతుంది” అని ప్రస్టేషన్‌తో తిడుతూ, గొప్పగా పొగిడాడని ఆయన తెలిపారు. ఈ పరిస్థితి చూసి, నిర్మాత కె.ఎస్. రామారావు “సినిమా చూసినోళ్ళు బాగుంది అంటున్నారు, రావటం లేదు. దీనికి మనం ఏదో పబ్లిసిటీ చేయాలి” అని అన్నారు. సోమవారం ఉదయం నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రమోషనల్ స్ట్రాటజీ గురించి చర్చించారు. థియేటర్లలో టికెట్‌తో పాటు కర్చీఫ్‌లు ఇవ్వాలని మంగళవారం నిర్ణయించారు. తొలుత కర్చీఫ్‌లపై మాధవి బొమ్మను ప్రింట్ చేయాలని అనుకున్నా, సమయం లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అదే మంగళవారం రాత్రి కె.ఎస్. రామారావు డిస్ట్రిబ్యూటర్‌లకు ఫోన్ చేసి, ఒక రూపాయి లోపు ఖరీదు చేసే లేడీస్ కర్చీఫ్‌లను కొని, టికెట్‌తో పాటు ఇవ్వమని సూచించారు. బుధవారం ఉదయం నుండి ఈ వ్యూహం అమలులోకి వచ్చింది.
ఆశ్చర్యకరంగా, గురువారం సాయంత్రం నాటికి, వైజాగ్, రాజమండ్రి వంటి ప్రాంతాల నుండి రెండు మూడు థియేటర్లలో సినిమా ఫుల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. తొలుత నమ్మలేకపోయినా, నిర్ధారించుకున్న తర్వాత, శుక్రవారం నాటికి చాలా థియేటర్లు “జనాల కోరిక మీద” అని బోర్డులు పెట్టి మాతృదేవోభవను కొనసాగించాయి. ఒకే ఒక్క రోజు ఆలస్యం అయ్యి ఉంటే మాతృదేవోభవ పరాజయం పాలయ్యేదని కె. అజయ్ కుమార్ చెప్పారు. ఈ ప్రమోషన్ ప్రభావం ఎంతగా ఉందంటే, ఆ తర్వాత విజయవాడలో ఒక రిక్షా కార్మికుడు కె. అజయ్ కుమార్‌తో, తన భార్య సినిమా చూసి చాలా నచ్చిందని, పది మందిని తీసుకెళ్ళిందని, కర్చీఫ్‌లు ఇస్తున్నారని, పెద్ద సినిమా కాకుండా ఆ చిన్న సినిమా చూడమని సలహా ఇచ్చాడని ఆయన వివరించారు. ఒక రిక్షా కార్మికుడికి కూడా ఈ సినిమా చేరింది అంటే, దాని విజయం అసాధారణం అని కె. అజయ్ కుమార్ ముగించారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
