అద్భుతమైన నటి.. స్టార్ హీరోయిన్ అయినా కొంచం కూడా గర్వం ఉండేది కాదు..
దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ తన సినీ కెరీర్, విజయాలు, ఎదురైన సవాళ్లు, ముఖ్యంగా ఓ స్టార్ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ఇద్దరు ప్రముఖ తారలు, సౌందర్య, రమ్యకృష్ణల గురించి అనేక తెలియని, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గ్యాంగ్ వార్ అనే చిత్రం కోసం పామ్ గ్రూవ్ హోటల్‌లో కథా చర్చలు జరుగుతున్న సమయంలో.. రచయిత శ్రీనివాస్ చక్రవర్తి, పాటల రచయిత రాజశ్రీలతో పాటు దర్శకుడు, ఇతర చిత్ర బృందం సభ్యులు ఉన్నారు. దర్శకుడు ఒక సాధారణ నేపథ్యం నుంచి, సినీ పరిశ్రమతో సంబంధం లేని ఒక అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని చెప్పారట. గతంలో రేవతి, అమల వంటి తారలు ఇలాగే వచ్చారని గుర్తు చేశారు. అదే హోటల్‌లో ఒక పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా, దేవి ప్రసాద్ అక్కడ కూర్చున్న సౌందర్యను చూశారట.
తెల్ల చుడీదార్‌లో చాలా అమాయకంగా కనిపించిన ఆమె, తమ సినిమాలోని పాత్రకు సరిపోతుందని ఆయనకు అనిపించిందట. మొదట్లో ఆమెను అడగడానికి సంకోచించినా, తరువాత దర్శకుడికి ఈ విషయాన్ని చెప్పారట. చిత్ర బృందం ఆమెను చూడటానికి వెళ్ళినప్పుడు, ఆమె అక్కడ లేరట. కొద్దిసేపటి తర్వాత, శ్రీనివాస్ చక్రవర్తి ఒక పెద్దాయనతో మాట్లాడుతుండగా, ఆయన సౌందర్య తన కూతురే అని చెప్పడం వారికి ఆశ్చర్యం కలిగించింది. అప్పటికే సౌందర్య కన్నడలో ఒక సినిమా చేసి, తెలుగులో మనవరాలి పెళ్లి (హరీష్ హీరోగా) సినిమా కోసం అగ్రిమెంట్ చేయడానికి అక్కడికి వచ్చారని తెలిసిందట. ఆ విధంగా, అనుకోకుండా, సౌందర్య తెలుగు తెరకు పరిచయమయ్యారని తెలిపారు.
చిలకపచ్చ కాపురం సినిమా షూటింగ్ సమయంలో, ఒక పాట చిత్రీకరణ తర్వాత రంగులు కడుక్కోవడానికి సరైన వసతులు లేనప్పుడు, ఆమె ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా, కేవలం ఒక రేకు అడ్డంపెట్టిన చిన్న బాత్రూంలో స్నానం చేసి, తిరిగి వచ్చి మేకప్ వేసుకుని తదుపరి సన్నివేశంలో నటించారని గుర్తు చేసుకున్నారు. అప్పటికే ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదని ఆయన అన్నారు. సౌందర్య తండ్రి మరణించినప్పుడు, బెంగళూరులో జరిగిన అంత్యక్రియలకు వెళ్లినప్పుడు, ఆమె ఒక అగ్రతార అయినప్పటికీ, సామాన్య మధ్యతరగతి ఇంట్లో ఆడపిల్లలాగే బంధువులందరినీ ఆప్యాయంగా పలకరించి, పనులలో సహాయం చేశారని దేవి ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా, ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగడానికి బదులుగా, ప్రశాంత్ కుటీర్ అనే చిన్న గెస్ట్ హౌస్‌లో ఉండటానికే ఆమె ఇష్టపడేదని, ఆ ప్రదేశం ఆమెకు ఇల్లు లాగా మారిందని తెలిపారు దేవి ప్రసాద్. సౌందర్య చివరి వరకు మధ్యతరగతి మనస్తత్వాన్నే కలిగి ఉన్నారని, ఎప్పుడూ అహంకారం చూపించలేదని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన అన్నారు. సౌందర్య అకాల మరణ తనను, తన దర్శకుడిని చాలా బాధించిందని, ఆమె హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే బాగుండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
