
పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ శ్రీలీల. తొలి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ మాహారాజా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధమాకా చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాను డైరెక్టర్ త్రినాథరావు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. “రాఘవేంద్ర రావు గారి సినిమాతో లాంచ్ కావడం తర్వాత రవితేజ గారితో ధమాకా లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజ గారు లాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. మొదట్లో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. రవితేజ గారు చాలా మోటివేట్ చేస్తారు.
ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ వుంటుంది. సెట్ లో చాలా సపోర్ట్ చేస్తారు. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను. ‘విక్రమార్కుడు’ డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు. ” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే తాను బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రంలో నటిస్తున్నాని.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని తెలిపింది. ఇక బోయపాటి శ్రీను, రామ్ పోతినేని ప్రాజెక్ట్… యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన మరో సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే… వారాహి ప్రొడక్షన్ లో ఒక సినిమా .. నితిన్ తో ఒక సినిమా చేస్తున్నానని తెలిపారు. మరికొన్ని సినిమాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.