AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..?

70లలో తెలుగు చిత్రసీమను ఏలిన గ్లామర్ క్వీన్ దీప జీవిత విశేషాలు. ఉన్ని మేరీగా బాలనటిగా ప్రస్థానం ప్రారంభించి, ఆనాటి యువతరాన్ని అలరించిన ఆమె నటనా జీవితం, వివాహం, ఎదురైన సవాళ్లు, సినీ నిర్మాణ ప్రయోగాలు, ప్రస్తుత కొచ్చి జీవితం గురించి సమగ్ర వివరాలు.

ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..?
Unni Mary
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2026 | 4:34 PM

Share

తెలుగు చిత్రసీమలో గ్లామర్ తారలకు కొదువ లేదు. తమ అందచందాలతో ప్రేక్షకుల్ని అల్లరించిన కథానాయికలు ఎంతో మంది. అయితే, 1970వ దశకంలో గ్లామర్ హీరోయిన్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు దీప. 16 ఏళ్ల లేత వయసులోనే తన అందాలతో ఆనాటి యువతరాన్ని ఉర్రూతలూగించి, వెర్రెక్కించిన దీప అసలు పేరు ఉన్ని మేరీ. ఆమె సినిమా ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలు ఎంతో ఆసక్తికరం.

బాల్యం, సినీ రంగ ప్రవేశం

1962 మార్చి 12న కొచ్చిలో అగస్టిన్, విక్టోరియా దంపతులకు ఉన్ని మేరీగా జన్మించారు. ఆమె తండ్రి ఆభరణాల వ్యాపారి కాగా, తల్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లో పనిచేసేవారు. ముద్దుగా పెరిగిన మేరీకి డ్యాన్స్ అంటే ఎంతో ఆసక్తి ఉండటంతో, తల్లి ప్రోత్సాహంతో నాట్యం నేర్చుకుంది. తొమ్మిదవ ఏట నవవధు అనే మలయాళ చిత్రంలో బాలనటిగా పరిచయమై, ఆ తర్వాత గురువాయూరప్ప చిత్రంలో బాలకృష్ణుడిగానూ నటించింది. చిన్నతనంలోనే లిటిల్ మిస్ కొచ్చిన్ టైటిల్ గెలుచుకుంది. ఐదు మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత, తమిళ దర్శకుడు శ్రీధర్ ఓ మంజు చిత్రంతో ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్నారు. అయితే, చిన్నపిల్లలా ఉందనే కారణంతో ఆ అవకాశం కోల్పోయింది. కూతుర్ని ఎలాగైనా హీరోయిన్ చేయాలనే తపనతో తల్లి విక్టోరియా, ఆమెకు హార్మోన్ ఇంజక్షన్లు ఇప్పించిందని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. దీని కారణంగానే వయసుకన్నా ఎక్కువ అందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిందని ప్రచారంలో ఉంది. ఉన్ని మేరీ పేరును దీపగా మార్చారు. 13వ ఏట 1975లో అష్టమిరోహిణి మలయాళ చిత్రంలో ప్రేమ్ నజీర్ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. 1976లో కమల్ హాసన్ తో అంతరంగం (తెలుగులో అందాల రాజాగా డబ్ అయింది) చిత్రంలో నటించి యువతరాన్ని ఆకర్షించింది.

తెలుగులో బిజీ హీరోయిన్‌గా

ఛాయాగ్రాహకుడు బాలు మహేంద్ర సూచనతో దీపకు తెలుగులో తొలి అవకాశం అమెరికా అమ్మాయి చిత్రంలో వచ్చింది. ఈ సినిమా రష్ చూసిన దుక్కిపాటి మధుసూదనరావు తన ప్రేమలేఖలు సినిమాలో అవకాశం ఇచ్చారు. కృష్ణ సరసన చల్ మోహనరంగా, శోభన్ బాబు పక్కన ఖైదీ కాళిదాసు, మురళీమోహన్ తో ఖైదీ నెం. 777 వంటి చిత్రాలతో దీప తెలుగులో బిజీ అయ్యింది. నటరత్న ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించడంతో దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. బొద్దుగా ఉన్న దీపకు ఎన్టీఆర్ రోజుకు గంటసేపు వ్యాయామం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమని, చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు మానేయమని సలహా ఇచ్చారు. అవి పాటించడంతో దీప సన్నబడింది. అక్బర్ సలీం అనార్కలి చిత్రంలోని సిపాయీ ఓ సిపాయీ పాటలో ఆమె నృత్యం, అందం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో బాలచందర్ మరో చరిత్రలో హీరోయిన్ గా అవకాశం వచ్చినా, ఎన్టీఆర్ సినిమా డేట్స్ క్లాష్ కావడంతో కోల్పోయింది.

వ్యక్తిగత జీవితం, సవాళ్లు

సుమారు ఐదేళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన దీప 1981, మే 10న కొచ్చిలోని సెయింట్ జార్జ్ చర్చిలో ఇంగ్లీష్ లెక్చరర్ రిజాయ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని రిజాయ్ షరతు విధించగా, దీప అంగీకరించారు. అయితే, కొడుకు నిర్మల్ పుట్టిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక దీప మళ్లీ నటించడం ప్రారంభించారు. భర్త దీనిని వ్యతిరేకించి, మలయాళ చిత్ర నిర్మాతల సంఘానికి, దక్షిణ భారత సినీ నిర్మాతల గిల్డ్ కు నోటీసులు పంపి, భార్యకు అవకాశాలు ఇస్తే కేసులు పెడతానని హెచ్చరించారు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం ముదిరి విడాకుల వరకు వెళ్లింది. పెద్దల జోక్యంతో రాజీ కుదిరి, కొడుకు నిర్మల్ పెరిగి పెద్దయ్యే వరకు సినిమాల్లో నటించకూడదని దంపతులు ఒప్పందానికి వచ్చారు.

రీఎంట్రీ, నిర్మాణ రంగ ప్రవేశం, ప్రస్తుత జీవితం

కొడుకు నిర్మల్ పెద్దయ్యాక బాలకృష్ణ రాము చిత్రంతో దీప తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. మద్రాసులో ఉంటూ సినిమాలు చేస్తూ, నెలకు ఒకసారి కొచ్చిలోని భర్త దగ్గరకు వెళ్లేవారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తన తండ్రి అగస్టిన్ ఫెర్నాండెజ్ పేరు మీద కల్యాణ పరువగళ్ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో పెళ్లి పక్షులు పేరుతో అనువదించారు. తెలుగులో హిట్ అయిన లేడీస్ టైలర్ చిత్రాన్ని మలయాళంలోకి అనువదించారు. ప్రస్తుతం దీప కుమారుడు నిర్మల్ రిలయన్స్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనను నటుడిగా పరిచయం చేయాలని దీప ప్రయత్నించినా కుదరలేదు. అలనాటి గ్లామర్ క్వీన్ దీప ఇప్పుడు కొచ్చిలో మనవళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. ఆమె సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది, అయినా ఆమె తనదైన ముద్ర వేసి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.

Follow Us