జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో రచ్చ రవి ఒకరు. చమ్మక్ చంద్ర- రచ్చ రవి కాంబినేషన్‌లో వచ్చిన స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వదిలివెళ్లిపోయిన తర్వాత టీం లీడర్‌గా కూడా మారాడు. అయితే ఎప్పుడైతే నాగబాబు బయటకు వెళ్లిపోయాడో రవి కూడా జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆతర్వాత దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ (2013) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. తొలిరోజుల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించినప్పటికీ ఆ తర్వాత ప్రాధాన్యమున్న పాత్రలతో అలరించాడు. కల్యాణ వైభోగమే, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, ఒక్కక్షణం, ఎంసీఏ, గద్దలకొండ గణేష్, రెడ్, క్రాక్, గాలి సంపత్, నారప్ప, పాగల్, కోతల రాయుడు బటర్ ఫ్లై సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించాడీ కమెడియన్. ముఖ్యంగా గద్దలకొండ గణేష్‌లో తెలంగాణ యాస, శతమానంభవతి సినిమాలో ఆంధ్రా యాసలో రవి పేల్చిన డైలాగులు బాగా ఫేమస్ అయ్యాయి. ఇలా సినిమాలతో బిజీగా ఉంటోన్న రచ్చ రవికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలయ్యింది. సూర్యాపేట – మునగాల వద్ద అతనికి యాక్సిడెంట్ అయ్యిందని.. పరిస్థితి విషమంగా ఉందని నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. అలాగే కొన్ని వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. ఇవి అతని ఫ్యాన్స్‌ను ఆందోళన, గందరగోళానికి గురిచేశాయి.
ఈనేపథ్యంలో సామాజికి మాధ్యమాల్లో తనపై వస్తోన్న వదంతులపై స్పందించాడీ కమెడియన్. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, క్షేమంగా ఉన్నానంటూ యాక్సిడెంట్ రూమర్లను కొట్టిపారేశాడు. ‘ నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు. నేను పుణెలో షూటింగ్ ముగించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైగా నేను హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వచ్చా.. అందువల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. శనివారం జరగబోయే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌కి కూడా హాజరవుతున్నా. కాగా రచ్చ రవి చివరగా అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడీ కమెడియన్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..