Pawan Kalyan:పవర్‌స్టార్‌పై కమెడియన్ అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. త్వరలోనే పవన్‌ను అక్కడకు పిలుస్తానంటూ..
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాల్లో అలీ నటించలేదు. తాజాగా ఈ విషయంపై అలీ నోరు విప్పారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రముఖ కమెడియన్ అలీ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే పవన్ నటించిన ప్రతి సినిమాలోనూ కచ్చితంగా అలీ కనిపిస్తారు. తమ స్నేహం గురించి వారిద్దరూ పలుసార్లు బహిరంగంగా మాట్లాడారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాలు వీరిద్దరి స్నేహాన్ని దెబ్బతీశాయి. ఆతర్వాత ఇద్దరూ కొన్ని సందర్భాల్లో కలిశారు. అదీకాక పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాల్లో అలీ నటించలేదు. తాజాగా ఈ విషయంపై అలీ నోరు విప్పారు. ‘వకీల్ సాబ్, భీమ్లానాయక్ రెండూ సీరియస్ సినిమాలు. అందులో కామెడీకి పెద్దగా అవకాశం లేదు. నేనే కాదు. అసలు ఏ హాస్యనటుడు కూడా ఆ రెండు సినిమాల్లో నటించలేదు. ఆయన ఏదైనా కామెడీ సినిమా చేస్తే కచ్చితంగా నన్ను పిలుస్తారనుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు అలీ. అలాగే తాను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి పవన్‌ను ఎప్పుడు పిలుస్తారన్న ప్రశ్నకు కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నారని, ఆయనకు సమయం దొరికినప్పుడు కచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తారని పేర్కొన్నాడు.
కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలక్ర్టానిక్ మీడియా సలహాదారుగా నియమితులుయ్యారు కమెడియన్ అలీ. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ పలు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇందుకు కృతజ్ఞతగానే ఈ పదవిని కట్టబెట్టారు సీఎం జగన్. మరోవైపు జనసేన పార్టీ నాయకుడిగా అధికార వైఎస్సారీపై పోరాటం చేస్తున్నారు పవన్. కాగా 2019 ఎన్నికలకు ముందు అలీ జనసేనలో చేరతారని భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ వైసీపీలో చేరారు. ఆతర్వాత ప్రచారంలో భాగంగా పవన్, అలీల మధ్య కొన్ని మాటల తూటాలు పేలాయి. అప్పటి నుంచే పవన్, అలీ మధ్య దూరం పెరిగింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.