Bunny Vasu: సంధ్య థియేటర్ తొక్కిసలాటకు ఏడాది.. శ్రీతేజ్ ఆరోగ్యంపై బన్నీవాసు ఏమన్నారంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 విడుదలై (డిసెంబర్ 05) నేటికీ ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే రెండో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ లో అనుకోని విషాదం చోటు చేసుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 విడుదలై నేటికీ ఏడాది గడిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా రికార్డుల కెక్కింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే అనుకోని విషాదం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటన కారణంగానే అల్లు అర్జున్ జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. కాగా ఈ దుర్ఘటన జరిగి ఏడాది గడిచినా చిన్నారి శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు. తాజాగా పిల్లాడి ఆరోగ్య పరిస్థితి, అతనికి అందుతన్న సహాయంపై నిర్మాత బన్నీ వాస్ మాట్లాడారు. ఓ సినిమా ఈ వెంట్ కు హాజరైన ఆయన శ్రీతేజ్ గురించి ఇలా చెప్పుకొచ్చారు.
‘బాబు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దిల్రాజు వంటి సినీ పెద్దలు ఆ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఎంత డబ్బు ఇవ్వాలి? ఆస్పత్రి ఖర్చుల కోసం ఎంత ఉపయోగించాలి..? వారి కుటుంబం నెలవారీ ఖర్చులకు ఎంత అవసరం వంటి వాటిపై వ్యవస్థీకృతంగా ఒక విధానం నడుస్తోంది. ఇరు వైపుల నుంచి ఎలాంటి సమస్య వచ్చినా మాట్లాడుకుని ముందుకు వెళ్తున్నాం. బాధిత కుటుంబం దానిపట్ల సంతృప్తిగా ఉన్నారా.. లేదా అనేదానికి కొన్ని మార్గదర్శకాలను ఫాలో అవుతున్నాము. ఈ విషయంలో ఏవైనా సరిచేసుకోవాలంటే మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీతేజ్ విషయం చర్చించడానికి మధ్యలో పెద్దలు ఉన్నారు. వారి సమక్షంలోనే మంచి చేస్తాం’ అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
శ్రీ తేజ్ కు అండగా అల్లు అర్జున్.. ఇప్పటివరకు..
మరోవైపు అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. పిల్లాడి చికిత్స కోసం ఇప్పటివరకు రూ.3.20 కోట్లు ఇచ్చారు. అలాగే శ్రీతేజ్ భవిష్యత్ అవసరాల కోసం రూ. 1.5 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు.ఇక శ్రీతేజ్ తండ్రి ఇటీవల అదనపు ఆర్థిక సహాయం కోసం సంప్రదించగా అల్లు అర్జున్ తో పాటు దిల్ రాజు కూడా శ్రీతేజ్ కు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








