
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరకొచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 14 వారంలోకి అడుగుపెట్టింది. అంటే మరో రెండు వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్న మాట. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల కూడా ఒకరు. గతేడాది ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె తన ఆట, మాట తీరుతో బాగానే ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించిన తీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే చివరి వరకు హౌస్ లో ఉంటుందనుకుంటే అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయిందీ అందాల తార. హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సోనియా బయటకొచ్చిన వెంటనే ఎంటర్‌ప్రెన్యూర్ యష్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతేడాది సరిగ్గా ఇదే టైమ్ కు పెళ్లి కూడా చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ శుభవార్త చెప్పింది. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఓ పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సోనియా.
‘08.12. 2025.. మా జీవితం పరిపూర్ణమైంది. మా ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సోనియా, యష్ దంపతులు. ఇదే సందర్భంగా తమ కుమార్తెకు శిఖా వీరగోని అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు సోనియా దంపతులు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనియా- యష్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది సోనియా. ‘కరోనా వైరస్’, ‘ఆశా ఎన్‌కౌంటర్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె ‘జార్జ్ రెడ్డి’ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక యష్ విషయానికి వస్తే..అతనికి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.