AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ హీరో మాస్ ఎంట్రీ.. పవర్‌‌ఫుల్ క్యారెక్టర్‌‌తో కమ్‌బ్యాక్‌కు రెడీ అవుతున్న యాంగ్రీ యంగ్‌మ్యాన్‌

టాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు ఆయన పేరు చెబితే ఆవేశం, పౌరుషం గుర్తొచ్చేవి. పోలీస్ డ్రెస్ వేసినా, అన్యాయంపై ఎదిరించినా ఆయన చూపించే ఆ తీవ్రతకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. అందుకే ఆయనకు ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునేవారు కూడా.

సీనియర్ హీరో మాస్ ఎంట్రీ.. పవర్‌‌ఫుల్ క్యారెక్టర్‌‌తో కమ్‌బ్యాక్‌కు రెడీ అవుతున్న యాంగ్రీ యంగ్‌మ్యాన్‌
Sharwanand And Senior Hero
Nikhil
|

Updated on: Feb 06, 2026 | 7:51 AM

Share

దశాబ్దాల పాటు సోలో హీరోగా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఆయన, మధ్యలో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు. ఇతర కీలక పాత్రలు లేదా విలన్ రోల్స్ చేయనని భీష్మించుకుని కూర్చున్న ఈ సీనియర్ హీరో.. ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు. తనలోని అసలు నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఒక గ్లింప్స్ వీడియోలో ఆయన గెటప్, చెప్పిన డైలాగులు చూస్తుంటే పాత రాజశేఖర్ గుర్తొస్తున్నారని అభిమానులు సంబరపడుతున్నారు. ఇంతకీ ఆయన చేస్తున్న ఆ కొత్త ప్రయోగం ఏంటి? బుల్లెట్ సునీల్ గా ఆయన సృష్టించబోతున్న సంచలనం ఏంటో తెలుసుకుందాం..

ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఇలా ఏ జోనర్‌లో అయినా తనదైన ముద్ర వేసిన నటుడు రాజశేఖర్. కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా ఆవేశంతో కూడిన పాత్రల్లో నటించి మెప్పించారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా, పాత్రలో దమ్ముంటే కీలక పాత్రలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగానే గతంలో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’ చిత్రంలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, రాజశేఖర్ కొత్త ఇన్నింగ్స్ కు మాత్రం పునాది వేసింది.

బుల్లెట్ సునీల్ గా ఎంట్రీ..

శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైకర్’. ఈ సినిమాలో రాజశేఖర్ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. బుధవారం రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. ఇందులో రాజశేఖర్ “బుల్లెట్ సునీల్” అనే మాజీ మోటోక్రాస్ రేసర్‌గా కనిపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Rajashekar In Byker

Rajashekar In Byker

గ్లింప్స్ వీడియోలో రాజశేఖర్ చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. “మాజీ మోటోక్రాస్ రేసర్.. అప్పట్లో నన్ను బుల్లెట్ సునీల్ అనేవారు. 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కు పైగా రేసులు గెలిచాను” అంటూ ఆయన తన గతాన్ని వివరించే తీరు ఆకట్టుకుంటోంది. యాంగ్రీ యంగ్‌మ్యాన్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శర్వానంద్ లాంటి యంగ్ హీరోతో కలిసి రాజశేఖర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి ఉద్దండ నటులు కూడా ఇందులో భాగమయ్యారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ ‘బైకర్’ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రాజశేఖర్ పోషిస్తున్న ఈ బుల్లెట్ సునీల్ పాత్ర సినిమాకు ఆయువుపట్టులా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాజశేఖర్ లాంటి సీనియర్ స్టార్స్ కొత్త తరహా పాత్రలు ఎంచుకోవడం టాలీవుడ్‌లో మంచి పరిణామం. ‘బైకర్’ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.