AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై అభ్యంతరం.. నిర్మాతలకు హైకోర్టు నోటీసులు

వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎరుకల సామాజిక వర్గాన్ని, అలాగే స్టువర్ట్ పురం ప్రాంత ప్రజలను అవమానించేలా ఉందంటూ..చుక్కా పాల్‌రాజ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. సెంట్రల్ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే టీజర్‌ రిలీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు ధర్మాసనం.. చిత్రంపై అభ్యంతరం తెలిపింది. టైగర్ నాగేశ్వర రావు మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్‌ అగర్వాల్‌కు నోటీసులు జారీచేసింది.

Ravi Teja: టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై అభ్యంతరం.. నిర్మాతలకు  హైకోర్టు నోటీసులు
Tiger Nageswara Rao
Ram Naramaneni
|

Updated on: Aug 31, 2023 | 6:21 PM

Share

రవితేజ హీరోగా వస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా వివాదాస్పదమయింది. సినిమా ట్రైలర్‌లో కొన్ని సంభాషణలపై అభ్యంతరాలు కోర్టు వరకూ వెళ్లాయి. స్టువర్టుపురంలో ఒకప్పుడు పేరుమోసిన దొంగలున్నంత మాత్రాన.. ఇప్పటికీ ఆ ప్రాంతం ఆ నిందను మోయాలా? ఓ సామాజికవర్గాన్ని అవమానించాలా? అంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం..నిర్మాతలకు నోటీసులు పంపింది.

సినిమాలో ఓ సామాజికవర్గాన్ని అవమానించారా? స్టువర్టుపురం ప్రజల మనోభావాలను దెబ్బతీశారా? స్టువర్టుపురం.. దొంగల ఊరు అనే ముద్రను మోయాలి? ఈ సినిమా ఇస్తున్న సందేశం ఏమిటి? ఇలా టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఓ సామాజిక వర్గం మనోభావాలను కించపరిచేదిగా ఉందని..స్టువర్టుపురం వాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని చుక్కా పాల్‌రాజ్‌ అనే హైకోర్టులో పిల్‌ వేశారు. సినిమా విడుదలను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం..చిత్ర నిర్మాతకు నోటీసులు జారీచేసింది. ముంబైలోని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ చైర్‌పర్సన్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ లేకుండా టీజర్‌ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది.

ఎరుకల సెటిల్మెంట్ గా బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన స్టువర్టుపురంలో.. 40 ఏళ్ళ నుంచి జనమంతా గౌరవంగా జీవిస్తున్నారు. అలాంటి ఊరును.. క్రైం రాజధాని అంటూ సినిమా ట్రైలర్ లో చూపించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్టువర్టుపురంలో పుట్టి..రామానగర్‌ లో నేరజీవితం గడిపి.. అక్కడే చనిపోయిన టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురానికి చెందిన వాడుకాదనే వాదన కూడా తెరపైకి తెస్తున్నారు.

హేమలతా లవణం వంటి సంఘసేవకుల కృషితో స్టువర్టుపురంలో ఏనాడో మార్పు వచ్చింది. పిల్లలు విద్యావంతులయ్యారు. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవంగా జీవిస్తున్న తమ పిల్లలు.. ఈవిధమైన ప్రచారంతో మానసిక వేదనకుగురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టువర్టుపురంవాసులు!. కాగా విజయవాడ-చెన‍్నై దారిల బాపట్లకు దగ్గర్లో స్టువర్టుపురం అనే ఈ ఊరు. ఇకపోతే అక్టోబరు 20న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని ఇప్పటికే  అనౌన్స్ చేశారు. మరి ఈ కోర్టు గొడవల వల్ల అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా? లేదా పోస్ట్‌పోన్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.