Pushpa 2 The Rule Review: పుష్ప గాడి పాన్ ఇండియన్ రూల్ షురూ..! సినిమా ఎలా ఉందంటే

| Edited By: Rajeev Rayala

Dec 05, 2024 | 6:42 AM

పుష్ప 1 సినిమా సంచలన విజయం సాధించింది. అంతే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Pushpa 2 The Rule Review: పుష్ప గాడి పాన్ ఇండియన్ రూల్ షురూ..! సినిమా ఎలా ఉందంటే
విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు.. కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వీకెండ్ అయ్యేలోపే 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Follow us on

మూవీ రివ్యూ: పుష్ప 2

నటీనటులు: నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, శ్రీ తేజ్ తదితరులు

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్

సంగీతం: దేవీశ్రీ ప్రసాద్,

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచలి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్

పుష్ప 2 గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సుకుమార్ కూడా పుష్ప 2 కోసం మూడేళ్లు కష్టపడ్డాడు. మరి వాళ్ళ కష్టం ఫలించిందా..? పుష్ప 2 ఎలా ఉంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

సిండికేట్ కింగ్ అయిన తర్వాత పుష్ప రాజ్ (అల్లు అర్జున్) దూకుడు మరింత పెరిగిపోతుంది. సిఎం, పిఎం లను కూడా లెక్క చేయడు. తాను అనుకుంటే శాసనం అంతే.. ఏదైనా జరిగిపోవాలి అనుకుంటాడు. మరోవైపు బిజినెస్ పరంగానూ ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటాడు పుష్ప. పోలీసులు మాత్రమే కాదు.. పొలిటిషియన్స్‌ను కూడా తన వేళ్ల మీద ఆడిస్తుంటాడు. ఆ రేంజ్‌కు చేరుకున్న తర్వాత.. పుష్పను ఎలాగైనా పడగొట్టాలని తనపై పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంటాడు షెకావత్ (ఫహాద్ ఫాజిల్). ఇదే సమయంలో పుష్ప భార్య శ్రీవల్లి (రష్మిక మందన్న) ఓసారి ముఖ్యమంత్రితో ఫోటో దిగిరా అంటూ భర్తను కోరుతుంది. కానీ సిఎం మాత్రం స్మగ్లర్‌తో ఫోటో ఏందని పక్కనబెట్టేస్తాడు. అక్కడ్నుంచి తన గేమ్ మొదలు పెడతాడు పుష్ప రాజ్. రాష్ట్ర రాజకీయాలను కూడా గజగజ వణికిస్తాడు. దానికోసం కొన్ని వేల టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి పూనుకుంటాడు. అప్పుడే పుష్పపై పగ తీర్చుకోడానికి ఎదురు చూస్తున్న ద్రాక్షాయణి (అనసూయ), మంగళం శ్రీను (సునీల్), షెకావత్ ఒక్కటవుతారు. అప్పుడేం జరిగింది..? పుష్పను అడ్డుకున్నారా లేదా..? అసలు పుష్ప ఎందుకు అంత పవర్ మోజులో పడిపోయాడు అనేది మిగిలిన కథ..

కథనం:

కొన్ని సినిమాలను నడిపించడానికి కథతో అస్సలు పనిలేదు.. బ్రాండ్‌తోనే పని.. పుష్ప 2 విషయంలోనూ ఇదే జరిగింది. పుష్ప రాజ్ కారెక్టర్‌ను గంజాయిలా ఆడియన్స్‌కు ఎక్కించేసాడు సుకుమార్. గాంజా కొట్టడం తప్పే కానీ కిక్ ఇస్తుంది కదా.. అలాగే పుష్ప కారెక్టర్ కూడా. పుష్ప వేసే ప్రతీ అడుగు.. చేసే ప్రతీ పనీ తప్పే.. కానీ చూసే ఆడియన్‌కు అది రైటే.. అలా ఉంది సుకుమార్ రైటింగ్ ఈ సినిమాలో. ప్రతీ 10-15 నిమిషాలకు ఓసారి హై ఇచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు లెక్కల మాస్టారు. కథ నెమ్మదిస్తున్న ప్రతీసారి అల్లు అర్జున్ డ్యూటీ ఎక్కేసాడు. కేవలం హై మూవెంట్స్ ఇవ్వడంపైనే ఫోకస్ చేసాడు సుక్కు.. ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ చేసాడు. యాక్షన్ సీక్వెన్సులు అయితే నెక్ట్స్ లెవల్. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్ పూనకాలు పుట్టించాడు. ఫస్టాఫ్ అంతా బన్నీ, ఫహాద్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తుంది. సెకండాఫ్ ఎక్కువగా హై ఎమోషన్స్‌పై ఫోకస్ చేసాడు సుకుమార్. జాతరలో వచ్చే రష్మిక మందన్న ఎపిసోడ్‌లో సుక్కు రైటింగ్ చాలా బాగుంది. ఒక్కటైతే నిజం.. పుష్పలో ఉన్నంత కథ ఇందులో లేదు. హై ఇవ్వడమే పనిగా సీన్స్ రాసుకుంటూ వెళ్లిపోయాడు సుకుమార్. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. వీక్ సీన్స్‌ను కూడా తన రైటింగ్స్‌తో పీక్స్‌కు తీసుకెళ్లాడు సుకుమార్. అయితే అంతా బాగానే ఉన్నా.. ఒక్క మైనస్ మాత్రం అలాగే ఉండిపోయింది. సినిమాలో అల్లు అర్జున్ కారెక్టర్ తప్ప అందరూ డమ్మీనే. బన్నీ కోసం మిగిలిన కారెక్టర్స్‌ను తక్కువ చేసారేమో అనిపించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫహాద్ ఫాజిల్ పాత్రను చాలా నీరసంగా ముగించారు. క్లైమాక్స్ కూడా అసంపూర్తిగానే ముగించారు.. మూడో పార్ట్‌కు లీడ్ ఇచ్చినా ఫస్ట్ పార్ట్ ముగించినంత కిక్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ అయితే పూనకాలతో బయటికి వస్తారు.. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. మామూలు ఆడియన్స్‌కు కూడా పైసా వసూల్ సినిమా ఇచ్చాడు సుకుమార్.

నటీనటులు:

అల్లు అర్జున్ ప్రాణం పెట్టేసాడు.. ఈ సినిమా లేకపోతే కెరీర్ లేదేమో అన్నట్లే నటించాడు. ఇదే నా మొదటి, చివరి సినిమా అనే స్థాయిలో నటించాడు.. కాదు కాదు పుష్ప రాజ్ పాత్రలో జీవించాడు. రష్మిక మందన్న కూడా చాలా బాగా నటించింది. సెకండాఫ్‌లో ఆమె కారెక్టర్ మరింత ఎలివేట్ అయింది. హీరో స్నేహితుడిగా జగదీష్ నటన బాగుంది. రావు రమేష్, జగపతిబాబు, తారక్ పొన్నప్ప, అజయ్ ఇలా మిగిలిన వాళ్లు కూడా బాగా నటించారు.

టెక్నికల్ టీం:

పుష్ప 2 సినిమాకు ప్రాణం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం. ఆయన పాటలు చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. కూబా సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ప్రతీ ఫ్రేమ్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఒక్కటే కాస్త మైనస్ అనిపిస్తుంది.. కానీ దర్శకుడు సుకుమార్ ఛాయిస్ కాబట్టి ఏం చేయలేం. సుకుమార్ రైటింగ్ అదిరిపోయింది.. ప్రతీ సీన్‌లో ఆయన కష్టం కనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి నీళ్ళ కంటే దారుణంగా ఖర్చు పెట్టారు వాళ్లు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా పుష్ప 2.. పుష్ప గాడి పాన్ ఇండియన్ రూల్ షురూ..!

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ పబ్లిక్ టాక్