కంటెంట్ నచ్చితే చాలు బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తున్నారు అడియన్స్. స్టార్ హీరో ఉన్నాడా ?.. భారీ బడ్జెట్ మూవీనా ?.. కాదు.. అసలు కథ, కథనం కొత్తగా ఉందా ?.. అనేది ముఖ్యమంటున్నారు. గత రెండేళ్లుగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాయి చిన్న చిత్రాలు. ఇంకేముంది ఎప్పటికప్పుడు కొత్త జానర్లను ప్రయత్నిస్తూ హిట్స్ అందుకుంటున్నారు మేకర్స్. కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో సైతం అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలుగులో ఇప్పటివరకు అతడు చేసిన చిత్రాలు ప్రత్యేకమైనే చెప్పాలి. యంగ్ హీరో కార్తీక్ రాజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘అథర్వ’ అంటూ ప్రేక్షకులను పలకరించనున్నారు. త్వరలోనే ‘ఐ హేట్ యు’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ రాజు సరసన మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజి రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. స్నేహం, ప్రేమ బంధాల చుట్టూ సాగే కథలా కనిపిస్తోంది. ఇక అంతకు మించిన థ్రిల్లింగ్ పాయింట్, క్రైమ్ సస్సెన్స్ డ్రామాను కూడా ఇందులో చూపించబోతోన్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి.
‘నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్లను’ అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ప్రాణ స్నేహితులైన ఇద్దరు అమ్మాయిల జీవితాల్లో జరిగిన ఘటనలే ఐ హేట్ యు కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘దేవుడు కాదు.. ఈ మనుషులే మనకు అన్యాయం చేస్తున్నారు’.. అనే ఎమోషనల్ డైలాగ్ సైతం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ఇది వరకు మేకర్లు చెప్పిన మాటలు నిజమని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కొత్త ప్రేమ కథను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.