సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని జంటలకు కెమెస్ట్రీ భలే వర్క్ అవుతుంది. ఆ జోడీలను మళ్లీ కలిసి నటిస్తే అభిమానుల్లో సినిమాపై ఆసక్తి రెట్టింపు అవుతుంది. అందుకే దర్శకనిర్మాతలు కూడా వారిని కొనసాగించేందుకు ఇష్టపడుతుంటారు. చిరంజీవి – రాధ, వెంకటేష్ – సౌందర్య, వెంకటేష్ – మీనా, శ్రీకాంత్ – రాశి, బాలకృష్ణ – విజయశాంతి, నాగార్జున – రమ్యకృష్ణ.. ఇక ఇప్పటి జనరేషన్‌లో ప్రభాస్-అనుష్క వంటివారు హిట్ పెయిర్స్ అని పేరు తెచ్చుకున్నారు. అలానే నటుడు జగపతిబాబు, నటి ఆమనిలది కూడా సూపర్ హిట్ పెయిర్. వారు కలిసి చేసిన ‘శుభ లగ్నం’ ‘మావిచిగురు’ ‘తీర్పు’ లాంటి చిత్రాలు విజయవంతంగా నడిచాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సిల్వర్ స్క్రీన్ జంటకు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ క్యారక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. సెకండ్ ఇన్సింగ్స్‌లో ‘పటేల్ సార్’ అనే సినిమాలో కలిసి నటించారు. తాజాగా మరోసారి ఇద్దరూ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నట్లు తాజా వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమా సెట్స్‌లో తీసిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
తాజాగా జగపతిబాబు తన ఇన్ స్టాలో ఆమనితో ఉన్న ఓ వీడియో షేర్ చేసాడు. ఇందులో జగపతి బాబు ఆమని టచ్ అప్ బాయ్‌గా మారడం మీరు చూడవచ్చు. ఆమని దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చీలో కూర్చొని, మొబైల్ చూస్తుంటే.. జగపతిబాబు పక్కనే నిలబడి ఆమెకు గొడుగు పట్టి.. టచ్ అప్ చేస్తున్నాడు. ఆమని.. ”ముందు గొడుగు సరిగా పట్టు.., టచప్ సరిగా చెయ్యి.., ఏంటి.. ఇంత దగ్గరకు వస్తున్నావ్?” అంటూ జగపతిబాబును సరదగా ఆట పట్టించింది.
”పార్ట్-1: కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు” అంటూ జగపతిబాబు ఈ ఫన్నీ వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ‘శుభ లగ్నం’ సినిమాలో.. డబ్బుపై వ్యామోహంతో ఓ మధ్యతరగతి ఇల్లాలు తన మొగుడిని కోటి రూపాయలకు అమ్మేసే కాన్సెప్టు గుర్తుంది కదా. ఆ సన్నివేశాన్ని రిఫర్ చేస్తూ జగపతి బాబు ఆ క్యాప్షన్ పెట్టారు. త్వరలో పార్ట్ 2 వీడియో కూడా వచ్చే చాన్సుంది.