
జగపతి బాబు.. ఒకప్పుడు స్టార్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పట్లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో. ఫ్యామిలీ సినిమాల హీరోగా అడియన్స్కు దగ్గరయ్యారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. ఆ తర్వాత చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‍గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అప్పటివరకు ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా తన సహజ నటనతో అలరించిన జగపతి బాబు.. ఒక్కసారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. ఈసినిమాలో ఆయన నటనకు అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగులో ఆయనకు ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా అవకాశాలు క్యూ కట్టాయి. కేవలం హీరోగానే కాకుండా.. ఇప్పుడు సరికొత్త పాత్రలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అటు తండ్రి పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు జగ్గూభాయ్.
అటు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న జగ్గూభాయ్.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్, లేటేస్ట్ పోస్టులతో జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న జగపతిబాబుకు ఇప్పుడు హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. అంతేకాదు.. ఇప్పుడు సరికొత్తగా స్టైలీష్ లుక్లో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. బ్లాక్ జాకెట్, బ్లాక్ క్యాప్, బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని.. సిగరెట్ కాలుస్తూ అచ్చం హాలీవుడ్ నటుడిగా కనిపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు ?.. ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం జగ్గూభాయ్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జగపతి బాబు సలార్ చిత్రంలో నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జగ్గూభాయ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమాలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇవే కాకుండా జగపతి బాబు చేతిలో మరిన్ని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.