ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పెళ్లి అయినప్పటి నుంచి కోప తాపాలు, అవమానాలు, చీవాట్లు ఎన్నో భరించింది. నువ్వు మాత్రం ఈ చిన్న పొరపాటును కూడా భరించలేవా? ఇంట్లోంచి ఒక వారసుడు వెళ్లిపోయాడు. మా ఇంటి మహా లక్ష్మి లాంటి కోడలు ఆస్పత్రి పాలయ్యింది. ఉన్న ఒక్క వారసుడు కూడా కాపురాన్ని ముక్కలు చేసుకోవాలి అనుకుంటుంది. తెలిసి తెలిసీ ఏ తప్పూ చేయని నా మనవరాలు పుట్టింట్లో ఉంది. ఇంకా ఏం చూడాలి. వెళ్లు.. నీ భార్యను తీసుకురా.. అని ఇందిరా దేవి అంటుంది. నేనేమన్నా ఇంట్లోంచి వెళ్లగొట్టానా.. నేను పంపించానా.. తన నిర్లక్ష్యానికి మా అమ్మ బలయ్యింది. దాన్ని తప్పు పట్టాను. అంతే కానీ నా నోటి నుంచి నేను వెళ్లిపొమ్మని అనలేదు. కాబట్టి తిరిగి రమ్మని నేను అడగను. తిరిగి రావాలని నేను ఎప్పటికీ ఎదురు చూడను అని రాజ్ అంటాడు. దీంతో ఇందిరా దేవి రాజ్‌పై సీరియస్ అవుతుంది. అందరి విషయం వేరు.. నా విషయం వేరు.. బలవంతంగా మమ్మల్ని ముడి పెట్టారు. అది ఎప్పటికీ నిలవదు. దాన్ని నేను జీవితంలో క్షమించను. కాబట్టి నేను తనను తీసుకురాను.. తనంతట తాను వచ్చినా ఊరుకోనని రాజ్ అని వెళ్తాడు.
ఆ తర్వాత కావ్య ఇంటి బయట బాధ పడుతూ ఉంటుంది. అప్పుడే అప్పూ బాధ పడుతూ వస్తుంది. నువ్వు ఏడవడం నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా.. నీకు ఏడుపు అస్సలు సూట్ కాలేదని కావ్య సరదాగా అంటుంది. నేను ఏడుస్తుంటే నీకు సరదాగా ఉందా.. ఎప్పుడూ ఎదుటి వాళ్ల గురించేనా.. నీ గురించి నువ్వు ఆలోచించవా? అని అప్పూ అడుగుతుంది. ఎంత మొదలు పెట్టినా.. మళ్లీ తిరిగి మొదలు పెట్టిన చోటికే వస్తే ఇక ప్రయత్నం చేసి లాభం ఏముందని కావ్య అంటుంది. ఈ గొడవలన్నింటికీ మేమే కారణం అక్కా. మా పెళ్లి కారణంగానే ఈ గొడవలు మొదలయ్యాయి. అందుకే నువ్వు ఇలా పుట్టింటికి రావాల్సి వచ్చిందని అప్పూ అంటే.. సమస్య మీ వల్ల కాదు. మా వారి ఆలోచన వల్ల. భార్య మీద భర్తకు ప్రేమ లేదంటే.. అది ఆ ఆడదాని అస్తిత్వానికి ప్రశ్నగా మారుతుంది. కన్నవాళ్లను వదిలేసి.. భర్తే ప్రాణం అనుకుని బతికాను. కానీ ఈ రోజు నా ప్రేమే ఆయనకు కనిపించ లేదు. ఆయన మనసులో నాకు స్థానం దొరకలేదు. అలాంటప్పుడు నేను అక్కడ ఉండి ప్రయోజనం ఏముంది? అందుకే ఇక నుంచి ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నా అని కావ్య అంటుంది. దీంతో అప్పూ చాలా బాధ పడుతుంది.
ఆ తర్వాత సుభాష్.. అపర్ణ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కావ్య వెళ్లిపోయిన విషయం గురించి చెబుతాడు. ఇంట్లో పరిస్థితులు అస్సలు బాలేదని చెప్తాడు. దీంతో అపర్ణలో కదలికలు మొదలవుతాయి. వెంటనే డాక్టర్‌ని పిలుస్తాడు సుభాష్. ఆ తర్వాత వెంటనే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రికి వస్తారు. అపర్ణ మెలకువ కోసం ఎదురు చూస్తారు. అంతలోనే అపర్ణ కళ్లు తెరుస్తుంది. ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ ఉంటారు. రాజ్ ఎంతో సంతోష పడతాడు. అవేమీ పట్టించుకోకుండా ‘కావ్య ఏది నా కోడలు ఎక్కడ’ అని అపర్ణ అడుగుతుంది. దీంతో రాజ్ ఆలోచనలో పడతాడు. ఇంతలో నర్స్ వచ్చి.. అందర్నీ బయటకు పంపిస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి ఆవిడ గండం నుంచి బయట పడింది. ఇక నుంచి ఆవిడను ఓ గాజు బొమ్మలా చూసుకోవాలి. ఎప్పుడూ ఆవిడ నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. షాకింగ్ న్యూస్‌లు ఏమీ ఆవిడతో చెప్పకూడదని అంటుంది. దీంతో అందరూ కంగారు పడతారు. ఏం చేద్దాం.. మీ అమ్మ కావ్యని అడుగుతుంది? ఏం చెప్తావు? అని ఇందిరా దేవి అంటే.. నాకు తెలీదని రాజ్ అంటాడు. అపర్ణా వాళ్లిద్దర్నీ కలపాలని సుభాష్ అంటాడు.
ఆ తర్వాత స్వప్నకి ఫోన్ చేసి అత్తయ్య గురించి అడిగి తెలుసుకుంటుంది. ఆవిడ కోమా నుంచి కోలుకుని కళ్లు తెరిచారని స్వప్న అంటుంది. దీంతో కావ్య సంతోష పడుతుంది. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిల దగ్గరకు వచ్చి అపర్ణ గురించి చెబుతుంది. దీంతో వాళ్లు కూడా సంతోష పడతారు. నేను ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేయాలి కదా.. అందుకే బయటకు వెళ్తున్నా అని కావ్య అంటుంది. ఏమ్మా నువ్వు మాకు భారం అవుతావని అనుకుంటున్నావా అని కృష్ణమూర్తి అంటే.. లేదు ఈ ఉద్యోగం నా కోసం.. నేను నేనుగా బ్రతకడం కోసమని కావ్య అంటుంది.
నెక్ట్స్ అపర్ణను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తారు. అప్పుడే స్వప్న వచ్చి హారతి ఇస్తుంది. అందేంటి నువ్వు ఇస్తున్నావ్? ఇలాంటి పనులు అన్నీ చేసేది నా కోడలు కదా.. కావ్య ఏది? అని అడుగుతుంది. ఎవరూ సమాధానం చెప్పరు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..