
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ బెజవాడ బేబక్క కొత్తిల్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుక్కుంది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఇంటి గృహప్రవేశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ‘నేను ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సొంతింటి కల సాకారం అయింది. నా ఇంటి గృహప్రవేశానికి అమ్మ ముఖ్య అతిథి’ అంటూ బేబక్క షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అభిమానులు బేబక్కకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బెజవాడ బేబక్క గృహప్రవేశ వేడుకకు హీరో శ్రీకాంత్, నటి జ్యోతి సహా పలువురు వెండితెర, బుల్లితెర ప్రముఖులు హాజరయ్యారు. కాగా అపార్ట్‌మెంట్‌లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్‌నే తన ఇంటిగా ఎంపిక చేసుకుంది బేబక్క. ఇందులో మూడు బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లి ఆడుకోవడం కోసం ఒక గోడను డిఫరెంట్‌గా డిజైన్ చేయించింది. అలాగే పూజ గదిని కూడా నీట్‌గా, అందంగా కట్టించుకుంది.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకున్న బేబక్క యూఎస్‌లోనే పుట్టి పెరిగారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి.. సహాయక నటిగా స్థిర పడింది. మీలో ఎవరు కోటీశ్వరుడు, 24 కిస్సెస్, ఏబీసీడీ, అందరు బాగుండాలి అందులో నేనుండాలి తదితర చిత్రాల్లో నటించింది. ఇక కరోనా సమయంలో బెజవాడ బేబక్క యూట్యూబ్ వీడియోలు, రీల్స్ నెట్టింట బాగా వైరలయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. అయితే మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో పాల్గొంటోంది.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే బేబక్కకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.