బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తుది దశకు చేరుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే 12 వారాలు కంప్లీట్ అయ్యాయి. పదమూడో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో కేవలం 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. నబీల్, అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, రోహిణి, విష్ణుప్రియ, టేస్టీ తేజ టికెట్ టు ఫినాలే రేసులో ఉన్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ఎండింగ్ కు రావడంతో కంటెస్టెంట్ల అభిమానులు ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. తమ అభిమాన హౌస్ మేట్ ను ఓటేయాలంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అలా తాజాగా జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ కు బిగ్ బాస్ లో ఓటేయాలంటూ ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని పలు కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా ఇదే మండలంలోని రాఘవపట్నం గ్రామమే జబర్దస్త్ అవినాష్ సొంతూరు. గతంలో జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట, మాటతీరుతో అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు. ఫిజికల్ టాస్కుల్లోనూ ట్యాలెంట్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అవినాష్ ను బిగ్ బాస్ 8లో విజేతగా నిలిపేందుకు తన అభిమానులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ 8లో అవినాష్ విజేతగా నిలపాలంటూ జగిత్యాల జిల్లా లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అవినాష్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే జగిత్యాల జిల్లా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి అవినాష్ కు ఓటువేయాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కాగా పదమూడో వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో గౌతమ్, విష్ణుప్రియ, అవినాష్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, టేస్టీ తేజ, నబీల్ ఉన్నారు. కాగా టికెట్ టు ఫినాలే రేస్‌లో వరుసగా టాస్క్‌లు గెలిచి మొదటి ఫైనలిస్ట్‌గా మొన్న రోహిణి సత్తా చాటింది. ఇక నిన్న వరుసగా సుడోకు, క్రికెట్ బోర్డ్ రెండు టాస్క్‌ల్లో విజయం సాధించి అవినాష్ రెండో టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్‌గా నిలిచాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.