
మూడో వర్థంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను అతని ఫ్యాన్స్ స్మరించుకుంటున్నారు. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేనాటికి అతను రియా చక్రవర్తితో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. సుశాంత్ మరణవార్త అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మూడో వర్థంతి సందర్భంగా సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఓ అరుదైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో సుశాంత్, రియా చక్రవర్తి ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారు. ఎక్కడో వెకేషన్‌లో వారిద్దరూ పర్యటించినప్పుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
రియా చక్రవర్తి షేర్ చేసిన అరుదైన వీడియో..
సుశాంత్ ఆత్మహత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు జరిపారు. ముంబై పోలీసులు, ఈడీ, సీబీఐ, ఎన్సీబీ అధికారులు ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకున్నారు. సుశాంత్ సింగ్‌కు డ్రగ్స్ సమకూర్చారన్న ఆరోపణలపై 2020 సెప్టెంబర్‌లో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైలోని బైకుల్లా జైల్లో నెల రోజుల కారాగారవాసం తర్వాత రియా.. జైలు నుంచి విడుదలయ్యారు. రియా చక్రవర్తి దూరం జరిగినందునే మానసిక ఒత్తిడితో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.