Dasari Narayana Rao: దాసరికి దాసరే సరిసాటి! నో వన్‌ ఈజ్‌ కంపేరబుల్‌ టు హిమ్‌!

తెలుగు చలన చిత్ర సీమలో ఆయనది ఇంచుమించు అయిదు దశాబ్దాల అలుపెరుగని సుదీర్ఘ ప్రయాణం. నూట యాభై ఒకటి చిత్రాలను అన్ని తానై నడిపించిన సారథ్యం. మరెన్నింటికో మాటలను అందించిన నేర్పరితనం. మరికొన్నింటికి పాటలు సమకూర్చిన ప్రజ్ఞాపాటవం. ఆయనది

Dasari Narayana Rao: దాసరికి దాసరే సరిసాటి! నో వన్‌ ఈజ్‌ కంపేరబుల్‌ టు హిమ్‌!
Dasari Narayana Rao
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 5:07 PM

Dasari Narayana Rao Birth Anniversary: తెలుగు చలన చిత్ర సీమలో ఆయనది ఇంచుమించు అయిదు దశాబ్దాల అలుపెరుగని సుదీర్ఘ ప్రయాణం. నూట యాభై ఒకటి చిత్రాలను అన్ని తానై నడిపించిన సారథ్యం. మరెన్నింటికో మాటలను అందించిన నేర్పరితనం. మరికొన్నింటికి పాటలు సమకూర్చిన ప్రజ్ఞాపాటవం. ఆయనది బహుముఖం. సినీ పరిశ్రమకు ఓ ఐకాన్‌. అనితర సాధ్యుడు. దిశా నిర్దేశకుడు. చెరిగిపోని రికార్డులను సొంతం చేసుకున్న ఘనుడు. చెదిరిపోని మబ్బు తునక మీద తన పేరును సుస్థిరం చేసుకున్న దర్శకుడు. సినిమాను కొత్త పంథాన నడిపించినవాడు. కొత్త పుంతలు తొక్కించిన వాడు. ఆయనే దాసరి నారాయణరావు. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన బహుముఖ ప్రజ్ఞత్వాన్ని వివరించే చిన్ని ప్రయత్నం ఇది.

సినిమా చాలా మందికి ప్యాషన్‌ కావొచ్చు. చాలా మందికి అదో వ్యాపారం కావొచ్చు. చాలా మందికి అదో వ్యాపకం కావొచ్చు. కానీ దాసరికి అదే పంచ ప్రాణాలు. అదే ఆయన ధ్యాస-శ్వాస. తారా బలంతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాను దరి చేర్చి దర్శకుడి ప్రాముఖ్యాన్ని చాటిన మేధావి. దర్శకుడికి ప్రేక్షకులుంటారని, దర్శకుడి కారణంగానే ప్రేక్షకులు థియేటర్లకొస్తారని నిరూపించిన గొప్ప సాంకేతిక నిపుణుడు. అటు రాజకీయాల్లో ఇటు మీడియాలో ప్రత్యేకమైన మార్క్‌ వున్న ప్రతిభాశాలి దాసరి. అందులో సందేహమే లేదు. అయితే ఆయన తొలి అడుగు సినిమాయే! దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డు స్థాపించినా, నటుడిగా నంది అవార్డులు సాధించినా, సినిమా తీసినా, పాటలు రాసినా, తెర మీదయినా తెర వెనుక అయినా దాసరి దాసరే. నో వన్‌ ఈజ్‌ కంపేరబుల్‌ టు హిమ్‌….

దాసరి నారాయణరావు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. చెప్పడానికి మిగిలింది కూడా ఏమీ లేదు. అయిదు దశాబ్దాలుగా ఎంతో మంది ఆయన విశేషాణాలన్నీ చెప్పేశారు. ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజంగా ఆయన తళుకులీనే దర్శకరత్నే. దర్శకులకు గౌరవ మర్యాదలను, విలువను తెచ్చిన ఘనుడు. ట్వంటీఫోర్‌ క్రాఫ్ట్‌లోనూ ఆయనకు ప్రవేశం వుంది. ప్రావీణ్యమూ వుంది. అదే ఆయనకు అన్నీ తానై సినిమాను నడిపించగల శక్తిని ప్రసాదించింది. పాతికేళ్ల వయసులోనే మెగాఫోన్‌ చేతపట్టి మొదటి చిత్రంతోనే పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకోగలిగిన ద్రష్ట దాసరి. అప్పట్నుంచి ఆయన ప్రస్థానం అనంతంగా సాగుతూ వస్తోంది. ఆయన తొలి సినిమా తాతా మనమడు. అంతకు మునుపే ఆయన చాలా సినిమాలకు మాటలు రాశాడు. సహాయ దర్శకత్వం వహించాడు. కొన్ని సార్లు తెరపై కనిపించాడు. తొలి సినిమాకే నంది అవార్డు రావడం కూడా విశేషమే. చాలాసార్లు ఆయన్ను విజయాలు పలకరించాయి. కొన్ని సార్లు పరాజయాలు కలవరపెట్టాయి. దేనికి చలించలేదు. విక్టరీ కొట్టినప్పుడు పొంగిపోలేదు. అలాగని అపజయం ఎదురైతే కుంగిపోలేదు. స్థితప్రజ్ఞుడాయన. అందుకే ఉత్థాన పతనాలను సమంగా చూడగలిగాడు. ఆటుపోట్లకు జడవలేదు. నిరంతర కృషితో సాగిపోయారు.

దాసరి అంటే సంచలనం. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయం నిజంగా ఓ సంధికాలం. స్వర్ణయుగపు ఆఖరి దశ అది. తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో, వారు ఏం కోరుతున్నారో తెలియని అయోమయ సమయం. ఆ సమయంలో దాసరి ఓ వెలుగు రేఖ అయ్యారు. తెలుగు సినిమా గమ్యాన్ని పూర్తిగా మార్చివేశారు. అప్పటి వరకు హీరోకే ఇమేజ్‌. హీరోకే గుర్తింపు. హీరోకే గౌరవం. దాసరి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టాడు. దర్శకుడే సినిమాకు ప్రాణమని రుజువు చేశాడు. ఆయనొచ్చాకే దర్శకుడికి ఇమేజ్‌ వచ్చింది. దర్శకుడి కోసమే ప్రేక్షకులు థియేటర్లకొచ్చే రోజులొచ్చాయి. సినిమాలో హీరో ఎవరైనా దర్శకుడే అసలైన హీరో అని ప్రూవ్‌ చేసింది ఆయనే! డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టన్‌ ఆఫ్‌ ది షిప్‌ అని సగర్వంగా చెప్పుకున్న ధీశాలి ఆయన. టెక్నీషియన్‌ షుడ్‌ బీ ఎప్రిషియేటెడ్‌ ఫస్ట్‌ అని చాటిచెప్పిన సాహసి ఆయన. దాసరి పడి లేచే కడలి తరంగం. దర్శకుల్లో మేరు శిఖరం. పరిశ్రమకు ఆయనో వరం. తన శిష్యులను ఎందరినో దగ్గరుండి మరీ దర్శకులను చేశాడు. వారితోనూ సెంచరీలు కొట్టించాడు. చిన్న సినిమాలకు ఆయన ప్రాణం. పరిశ్రమకు అవే ఆధారమని బలంగా నమ్మే వ్యక్తి ఆయన. అగ్రనటులతో ఎన్ని సినిమాలు తీసినా ఆయన మనసంతా చిన్న సినిమాలపైనే వుండేది. ఆయన తీసిన ఒకటి తక్కువ నూటయాభై సినిమాల్లో ఎక్కువ శాతం చిన్న సినిమాలే. అందులో ఎక్కువ శాతం హిట్లే. మహానటులకే కాదు, మహానటుల వారసులకి కూడా సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన మహాదర్శకుడు దాసరి. కానీ ఆయనకి ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఆర్థిక స్తోమత లేదు. ఎలాంటి సపోర్టూ లేదు. కానీ దాసరి ఇంతింతై ఎదడగానికి కారణాలు మూడే .సినిమా మీద ప్రేమ, తిరుగులేని ప్రతిభ, వెనుదీయని పట్టుదల…

దాసరి కష్టాలు పడి పైకొచ్చారు. కష్టపడిపైకొచ్చారు. నోట్లో బంగారుచెంచాతో పుట్టలేదాయన. మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉండే జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. తండ్రి చేసే పొగాకు వ్యాపారం దెబ్బ తినడంతో పుట్టెడు కష్టాలు మొదలయ్యాయి. స్కూలు ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. సెవెంత్‌ క్లాస్‌లో స్టడీస్‌కు బ్రేక్‌ పడింది. ఓ కార్పెంటర్‌ దగ్గర నెలకు రూపాయి జీతానికి పనిలో చేరారు దాసరి. అది చూసిన క్లాస్‌ టీచరొకరు స్కూలుకు తీసుకెళ్లారు. తోటి విద్యార్థులకు దాసరి ఆర్ధిక పరిస్థితి గురించి వివరించారు. వారంతా తలో చేయి వేశారు. అలా దాసరి చదువు మళ్లీ మొదలైంది. పుస్తకాలు కొనలేక ఫ్రెండ్స్‌ దగ్గర తీసుకుని చదువుకున్నారు. సాయంత్రం స్కూల్‌ అయ్యాక హిందీ క్లాస్‌లో చేరారు. హిందీ నేర్చుకుందామని కాదు. హిందీ నేర్చుకునేవారికి ప్రోత్సాహకరంగా రోజు తినడానికి టిఫిన్‌ పెట్టేవారు. ఆకలి తీర్చుకోవడం కోసమే దాసరి హిందీ క్లాస్‌కి అటెండ్‌ అయ్యారు. తర్వాత ఇంటికొచ్చాక అరటిపళ్లు అమ్మేవారు. దాంతో వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవారు. అలా చదువుకున్నారు. ఇంత కష్టాల్లో కూడా కళ అతన్ని వదిలిపెట్టలేదు. కళని ఆయనా వదిలిపెట్టలేదు. రాత్రి భోజనం అయ్యాక నాటకాలు వేసేవారు. తన భవిష్యత్తుకి పునాదులు వేసుకునేవారు.

దాసరి నటుడిగా స్కూల్‌ స్థాయిలోనే మాంచి పేరు తెచ్చేసుకున్నారు. పరిషత్తు నాటకాలూ వేశారు. అలా నాటకాలు వేస్తూనే ఇంటర్‌ డిగ్రీ పూర్తి చేశారు. టైప్‌లో లోయర్‌ హయ్యర్‌ కంప్లీట్‌ చేశారు. డిగ్రీ అయ్యాక హైదరాబాద్‌లో ఒకటి రెండు చిన్న ఉద్యోగాలు చేశారు. తర్వాత ఏరోనాటిక్స్‌ లిమిడెట్‌లో చేరారు. మార్నింగ్‌ షిప్ట్‌ కావడంతో సాయంత్రాలన్నీ నాటకాలతో గడిచిపోయాయి. అలా ఓ సారి వై.వి. కృష్ణయ్య అనే నిర్మాతకు దాసరి నాటకం తెగ నచ్చింది. ఆయన హృషికేశ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద ‘అందం కోసం పందెం’ అనే సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా కోసం దాసరిని అడిగాడు. అప్పటికే నాటకరంగంలో కాస్త స్థిరపడి ఓ వెలుగు వెలుగుతున్న దాసరికి ఎందుకో మద్రాస్‌కెళ్లడం ఇష్టం లేకపోయింది. అందుకే ఆయన అడగ్గానే నో చెప్పేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కృష్ణయ్య దగ్గర్నుంచి ఓ ఉత్తరం వచ్చింది. తన సినిమాలో ప్రధాన హాస్యనటుడి వేషం ఇస్తాం. వెంటనే మద్రాస్‌ రమ్మని ఆ ఉత్తరం సారాంశం. ఉత్తరాన్ని చూసిన ఫ్రెండ్స్‌ దాసరిని ఎంకరేజ్‌ చేశారు. ఇంత మంచి ఛాన్స్‌ మళ్లీ రాదని, వెంటనే వెళ్లమని దగ్గరుండి మరీ మద్రాస్‌ రైలెక్కించారు. అలా అందం కోసం పందెంలో చిన్న రోల్‌ వేయడంతో దాసరి సినీ కెరీర్‌ మొదలైంది. ఆ సినిమా పూర్తయ్యాక పాలగుమ్మి పద్మరాజు దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ఆయనే నిర్మాత భావనారాయణకు దాసరిని పరిచయం చేశారు. ఆ టైమ్‌లో ప్రేమకు పర్మిట్‌ అనే కన్నడ సినిమాను భావనారాయణ తెలుగులో పానకాలు పర్వతాలుగా రీమేక్‌ చేస్తున్నారు. దానికి రచయితగా దాసరిని తీసుకుని మూడొందల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. అందులో రెండు వందలు పెట్టి ఓ ఉంగరం కొనుక్కున్నారు దాసరి. ఆ ఉంగరం చనిపోయే వరకు దాసరి వేలికే ఉండింది. అలా రచయితగా దాసరి ప్రస్థానం మొదలైంది.

తర్వాత గౌరి ప్రొడక్షన్‌లోనే ‘మా నాన్న నిర్దోషి’ సినిమాకు తొలిసారిగా సహకార దర్శకుడిగా పని చేశారు. ఆ పైన నందనరావు, లక్ష్మీ దీపక్‌ల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. దర్శకుడు భీమ్‌సింగ్‌ దగ్గర పని చేస్తున్న సమయంలోనే తొలిసారిగా తాత మనవడు చిత్రానికి దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయం సాధించడంతో దాసరి నారాయణరావు పరిశ్రమలో స్థిరపడ్డారు. అప్పుడు దాసరి వయసు జస్ట్‌ పాతికేళ్లే! తాత మనవడు హిట్‌ కొట్టాక వరసపెట్టి సినిమాలొచ్చి పడ్డాయి. వరుసగా పన్నెండు హిట్లిచ్చి రికార్డు కొట్టారు దాసరి. ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబులతోనే కాకుండా కొత్తవాళ్లతో కూడా సినిమాలు చేస్తూ పోయారు. షాట్‌ గ్యాప్‌లో నిద్రపోతూ వరుసగా మూడు నాలుగు రోజులు ఏకధాటిగా షూటింగ్స్‌ చేసిన రోజులు కూడా వున్నాయి. దర్శకత్వ బాధ్యతనే కాదు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా అందించారు దాసరి. తర్వాత పాటలూ రాయడం మొదలు పెట్టారు. ఇక నటుడిగా దాసరి ఘనమైన కీర్తినే సంపాదించారు. ఉత్తమ నటుడి అవార్డులను అందుకున్నారు.

మహానటుడు ఎన్టీయార్‌తో సూపర్‌ డూపర్‌ హిట్లను తీశారు దాసరి. మనుషులంతా ఒక్కటే తో మొదలైన వీరిద్దరి అనుబంధం సర్దార్‌ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి వరకు వెళ్లింది. వీరిద్దరి కాంబినేషన్‌లో బొబ్బిలిపులి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అలాగే నాగేశ్వరరావుకు ప్రేమాభిషేకం అనే ఎవర్‌గ్రీన్‌ సినిమానిచ్చారు. ఇదొక్కటే కాదు. దేవదాసు మళ్లీ పుట్టాడు, బుచ్చిబాబు, శ్రీవారిముచ్చట్లు, ఏడంతస్తుల మేడ, రాగదీపం, రావణుడే రాముడైతే, రాముడు కాదు కృష్ణుడు, మేఘసందేశం లాంటి ఎన్నో హిట్లను అందించారు. సూపర్‌స్టార్‌ కృష్ణతో రాధమ్మ పెళ్లి, బండోడు గుండమ్మ, విశ్వనాథ నాయకుడు వంటి సినిమాలు రూపొందించారు. శోభన్‌బాబుతో బలిపీఠం, గోరింటాకు, స్వయంవరం, దీపారాధన, ధర్మపీఠం దద్దరిల్లింది, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, రంగూన్‌ రౌడి .ఇలా ప్రతీ ఒక్క హీరోకు హిట్లిచ్చారు. తర్వాతి తరం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున, రమేశ్‌బాబులతోనూ దాసరి సినిమాలు తీశారు.. చిరంజీవితో దాసరి తీసిన లంకేశ్వరుడు, బాలకృష్ణతో తీసిన పరమవీరచక్ర సినిమాలు అంత బాగా ఆడలేదు. ఆయన తీసిన బ్రహ్మపుత్రుడు, మజ్ను సినిమాలు వెంకటేష్‌, నాగార్జున కెరీర్స్‌లో పెద్ద హిట్స్‌గా మిగిలిపోతాయి. సినిమా దాసరి సిరి. అదే ఆయన తొలి ఊపిరి.

నాటకాల్లోంచి నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి, దిగ్దర్శకుడిగా ఎదిగిన ఆల్‌ఇన్‌వన్‌ జీనియస్‌ దాసరి. పాట రాసినా, సినిమా తీసినా, నటించినా, డైరెక్ట్‌ చేసినా అన్నిటిలో ఆయన స్టయిల్‌ కనిపిస్తుంది. అయితే దాసరి ప్రతిభ సినిమాకే పరిమితం కాలేదు. అటు మీడియాకీ ఇటు రాజకీయాలకీ కూడా విస్తరించింది. అయితే తానున్నది ఎక్కడైనా సినీ నేపథ్యం అన్నది దాసరి కెరీర్లో అడుగడుగునా కనిపిస్తుంది. రాజీవ్‌గాంధీ టైమ్‌లో, దాసరికాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. రాజీవ్ హత్య తరవాత కొంతకాలం రాజకీయాలకి కాస్త దూరంగా ఉన్నారు. పార్టీ కి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో తెలుగుతల్లి పేరుతో ఓ పార్టీ కూడా పెట్టారు. ఆ తరవాత కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్య సభ కు ఎన్నిక అయ్యారు. బొగ్గు గనుల శాఖకి కేంద్రమంత్రి అయ్యారు. అయితే రాజకీయాల్లో తన టోన్‌ వినిపించదలచుకున్నప్పుడల్లా ఆయన తన సినీ ప్రతిభమీద ఆధారపడ్డారు. రాజకీయాల్ని విమర్శిస్తూ పిచ్చోడి చేతిలో రాయి లాంటి సినిమాలు తీశారు. బడుగు జనానికి సపోర్టింగ్‌గా ఒసేయ్‌ రాములమ్మా, ఒరేయ్‌ రిక్షా లాంటి హిట్స్‌ అందించారు.

మీడియాలోనూ దాసరి తనదైన మార్క్‌ వేశారు. అప్పట్లో మీడియాలో నంబర్‌వన్‌గా ఉన్న ఈనాడుకి పోటీగా ఉదయం న్యూస్‌పేపర్‌ ప్రారంభించారు. సక్సెస్‌తో సంచలనాలు సృష్టించారు. పబ్లిషింగ్‌ రంగంలో దాసరికి ఉన్న ఆసక్తి ఆయనతో ఎన్నో ప్రయోగాలు చేయించింది. శివరంజని సినిమా పత్రిక నించి బొబ్బిలిపులి వరకూ అనేక పత్రికలు దాసరి ఆలోచనలనుంచి వెలువడ్డవే! సినీరంగం పైకి కనిపించేంత కలర్‌ఫుల్‌గా ఉండదు.అక్కడ లైమ్‌లైట్‌లో ఉన్నంత సేపే గౌరవం, డబ్బూ లభిస్తాయి. కాస్త వెనకబడితే ఎవరూ మొహం చూడరు. సెంటిమెంట్‌తో కాసులు పండించుకునే ఆ తెర వెనక ఎలాంటి సెంటిమెంట్లూ ఉండవు. సినీజీవితపు ఈ కఠిన సత్యాల్ని, కఠోరవాస్తవాల్ని స్వయంగా తెలుసుకున్న దాసరి ఎందరికో బాసటగా నిలిచారు. మహానటి సావిత్రినుంచి ఆంధ్రా దిలీప్‌ చలం వరకూ ఎందరికో చివరిదశలో వేషాలిచ్చి ఆదుకున్నారు. ఆర్థికంగా వెనకబడ్డ మహానటులకి తనకి తోచినంత సాయం చేశారు, చేయించారు. దాసరి నారాయణరావు లేని లోటు ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయారు. దాసరి వంటి జీనియస్‌లు నూటికో కోటికో పుడతారు!

Read Also…  Mahesh babu-sarkaru vaari paata: సర్కారు వారి పాట ట్రెండ్ అవుతున్న పోస్టర్స్.. మహేష్ పై కామెంట్స్..