RGV: వివాదాలతో సావాసాలు.. సినిమాలతో సాహసాలు.. కొటేషన్లలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆలోచనలు..
Ram Gopal Varma: అప్పటి వరకు నత్త నడకన సాగుతోన్న తెలుగు సినిమాకు తనదైన వేగాన్ని జోడించారు, సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయి..
Happy BirthDay Ram Gopal Varma: అప్పటి వరకు నత్త నడకన సాగుతోన్న తెలుగు సినిమాకు (Tollywood) తనదైన వేగాన్ని జోడించారు, సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు, తనకి నచ్చిందే చేస్తా.. నచ్చనిది చేయనని చెప్పే ముక్కుసూటి తనం. నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే చూడకండి అని కుండ బద్దలు కొట్టే నైజం… ఈ ఇంట్రడక్షన్ అంతా రామ్ గోపాల్ వర్మదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదూ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేసే వర్మ ఏది మాట్లాడినా సంచలనమే, ఏం మాట్లాడకపోయినా సంచలనమే. సమాజంలో జరిగే ప్రతీ సంఘటనపై తనదైన దృష్టిలో ఆలోచించే వర్మ ఐడియాలజీని అభిమానించే వారు ఎందరో.
ఈ తరం యువత కూడా వర్మ ఆలోచనలను అభిమానిస్తురాన్నంటే అతిశయోక్తి కాదు. వర్మను ఎంత తిట్టుకున్నా, అతను చేసే పనులు బాగా లేవని విమర్శించినా.. ‘రామూయిజాన్ని’ ఎక్కడో ఒక చోట అన్వయించుకునే వారు చాలా మంది ఉన్నారు. వర్మ చెప్పిన సత్యాలు నిజమే కాదా అనే భావన కలగక మానదు. శివ సినిమాతో మొదలైన వర్మ ప్రస్థానం సత్య, కంపెనీ, సర్కార్‌లాంటి ఎన్నో అద్భుత చిత్రాలతో బాలీవుడ్‌లోనూ కొనసాగింది. ఇక తెలుగులో చాలా రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన వర్మ మళ్లీ ‘రక్త చరిత్ర’ టాలీవుడ్ బాట పట్టాడు. ప్రస్తుతం అత్యంత వివాదాస్పదమైన కథాంశలను ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోన్న వర్మ పుట్టిన రోజు నేడు. 60 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టినా వర్మ ఆలోచనలు మాత్రం నిత్య యవ్వనంగా ఉంటాయనడానికి ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించిన కొటేషన్లే సాక్ష్యంగా చెప్పవచ్చు. వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ కొటేషన్లపై ఓ లుక్కేయండి..
- నా జీవితంలో నాకొచ్చిన బెస్ట్ బర్త్‌డే మెసేజ్.. రామూ! నీ జీవితం నుంచి ఇంకో ఇయర్ పోయింది. ఇలాగే చస్తూ ఉండురా.!
- అన్నింటినీ దేవుడు సృష్టించి ఉంటే దెయ్యాన్ని ఎందుకు సృష్టించినట్లు.? దేవుడు సృష్టించకపోయింటే మరి ఎవరు సృష్టించినట్లు.?
- కఠోర పరిశ్రమే సక్సెస్‌ని ఇచ్చేట్లయితే.. చాలా మంది కూలీలు ఈపాటికి అంబానీకంటే డబ్బున్న వాళ్లు అయ్యేవారు.
- భారతీయులు భారతదేశాన్ని ప్రేమిస్తారు, కానీ భారతీయుల్ని ప్రేమించరు.
- నేను నాస్తికుడిని, ఎందుకంటే నేను దైవాన్ని అర్థం చేసుకున్నాను.
- నా నిశ్శబ్ధాన్ని అర్తం చేసుకోలేని వాళ్లకి, నా మాటలు అర్థం కావు.
- జీవితంలో సమస్యలు లేకపోతే బోర్ కొట్టి చచ్చిపోవడం ఖాయం.
- మీరు ఇతరులను ఇరిటేట్ చేయాలనుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి.. చాలా మంది మరొకరు సంతోషంగా ఉంటే భరించలేరు.
- చావు ఏ క్షణంలోనైనా రావొచ్చని తెలుసుకున్న వాడే ప్రతి నిమిషం ఆనందంగా బతకగలడు.
- గుంపు నుంచి వేరుగా నిలబడలేని ధైర్యం లేకపోతే ఎప్పటికీ గుంపులో ఒకడిగానే మిగులుతాం.
- నాకు తెలిసిన ప్రపంచాన్ని నాకు నచ్చేట్లు చూసే అవకాశం ఒక్క నాకు మాత్రమే ఉంది.
- సమస్యలు, బాధలు అనేవి ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే ఉండవు.
- నేను చెప్పేది నిజం కాదు, మీరు నమ్మితే అది నిజం.
- నా సక్సెస్‌లన్నీ అనుకోకుండా వచ్చాయి కానీ, నా ఫెయిల్యూర్స్ మాత్రం నేను అనుకోని తీసినవే.
- జీవితం ట్రాజిక్‌గా కనిపించే కామిడీయే.