Puri Musings: మనం ఇష్టపడే వారే అలా చేస్తారు.. పూరిజగన్నాథ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

పూరీ జగన్నాథ్ సినిమాలతో ఎంత పాపులరో పూరీ మ్యూజింగ్స్‌ పాడ్‌ కాస్ట్‌తో కూడా అంతే పాపులర్‌ అయ్యారు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందించే పూరీ తాజాగా ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా పూరీ ఏమన్నారంటే...

Puri Musings: మనం ఇష్టపడే వారే అలా చేస్తారు.. పూరిజగన్నాథ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
Puri Musings
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2024 | 6:46 AM

గెలుపోటములతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ వెళ్తుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఫ్లాప్‌ సినిమా వచ్చినా రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తుంటారు. ఇక జీవితాన్ని కూడా సరికొత్త కోణంలో చూడాలని సూచిస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రతీ అంశంపై స్పందిస్తూ ‘పూరీ మ్యూజింగ్స్‌’ పేరుతో పాడ్‌కాస్ట్‌ రూపంలో వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్‌మెయిల్‌ అనే అంశంపై మాట్లాడారు పూరీ.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. బ్లాక్‌మెయిల్‌ కంటే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్ చాలా ప్రమాదకరమని తెలిపారు. ఇతరులు బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. కానీ ఇంట్లో ఉండే వాళ్లు, నువ్వు బాగాప్రేమించేవాళ్లే నిన్ను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారన్నారు. దీనికి ఇంట్లో ఉండే అమ్మ, నాన్నతో పాటు పెద్దవాళ్లు ఎక్కువగా పాల్పడుతుంటారన్న పూరీ.. నీకోసం ఇంత చేశాం. మాకోసం నువ్వు ఇది చేయలేవా? అంటూ చదువు, పెళ్లి, పిల్లలు వంటి విషయాల్లో ఒత్తిడి చేస్తుంటారని చెప్పుకొచ్చారు.

మనల్ని కంట్రోల్‌ చేయడానికి ప్రేమ చూపించి ఒకరకమైన గిల్ట్‌ క్రియేట్‌ చేస్తారన్నారు. వాళ్లు అనుకున్నది జరగాలి? అంతేతప్ప నీ ఇష్టం ఏంటి అనేది ఎప్పుడూ అడగరు. వాళ్ల ఇష్టం ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటారు.. పిల్లలను కంటారు. వాళ్లదేంపోయింది. పిల్లలను జీవితాంతం పెంచాల్సింది మీరు. ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసేవారు అలుగుతారు. ఏడుస్తారు. మీతో మాట్లాడటం మానేస్తారు ఇలా చాలా డ్రామాలు చేస్తారు. ఇలాంటి వాటి వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు. కంగారుకు గురవుతారు. కుంగుబాటుకు లోనవుతారు. ఇంట్లో సమస్యలు కదా అని ఎవరితోనూ పంచుకోలేరు. మీలో మీరే మథనపడుతూ బతుకుతారు. గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో వాళ్లు అమాయకంగా కనిపించే క్రిమినల్స్‌. ఎవరి స్వార్థం వారిదే. వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటూ హెచ్చరించారు పూరీ.

ఇక వారి స్వార్థం కోసం మిమ్మల్ని ఏవేవో అడుగుతారని, అన్ని వింటే నీకు సరదా తీరిపోతుందన్నారు. ఎవరైనా ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తే వారిని పక్కన పెట్టేయాలని సూచించిన పూరీ.. మిగిలిన అన్ని విషయాలు వినండి. మీరు ఇబ్బందిపడే పనులు అస్సలు చేయొద్దని సూచించారు. వాళ్లు డ్రామాలు చేస్తే అంతకంటే ఎక్కువ మీరు చేయండి. వాళ్లు అలాంటి డైలాగ్స్‌ వాడితే మీరూ అవే వాడండి. నెల రోజుల తర్వాత మిమ్మల్ని అడిగే విషయాల కోసం ఇప్పటి నుంచే ప్రేమ చూపిస్తుంటారు. మీరు అలర్ట్‌గా ఉంటే ఈ లక్షణాలు గుర్తించగలుగుతారు. ఎవరైనా సరే బ్లాక్‌మెయిలర్స్‌కు మాత్రం విలువ ఇవ్వకండని తేల్చి చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..