Aha: గేమ్ షోలు మనకి చాలా సాధారణం. ఎదో కాలక్షేపం కోసమే ఇవి ఉంటాయనేది నిజం. ఎంటర్టైన్ మెంట్ బేస్ చేసుకునే టీవీల్లో అయినా.. ఓటీటీలలో అయినా గేమ్ షోలు నడిపిస్తారు. ఇప్పటివరకూ తెలుగులో ఎన్నో గేమ్ షోలు వచ్చాయి.. వస్తున్నాయి.. తాజాగా ఆహా ఓటీటీలో ప్రదీప్ హోస్ట్ గా ఓ గేమ్ షో వస్తోంది. ప్రదీప్ హోస్ట్ అంటేనే ఫుల్ ఎనర్జీ.. దానికి తోడు.. సెలబ్రిటీలు ఆడే గేమ్ షో అంటే ఇక అది ఆహా అనిపించాల్సిందే. అదే చేసింది ఈ గేమ్ షో. సర్కార్ పేరుతో దీపావళి సందర్భంగా రెండో ఎపిసోడ్ వచ్చేసింది.
ఈ గేమ్ షో మైండ్ గేమ్ లాంటిది. హోస్ట్ మొత్తం పది ప్రశ్నలు అడుగుతాడు. ఇది నాలుగు లెవెల్స్ లో ఉంటుంది. నలుగురు సెలబ్రిటీలు ఈ ఆట ఆడతారు. మొదటి రౌండ్ లో హోస్ట్ అడిగే ప్రశ్నకు 60 సెకన్లలో జవాబు చెప్పాలి. సెలబ్రిటీలు ఒక్కోరూ రెండు లక్షల రూపాయలతో ఆట మొదలు పెడతారు. హోస్ట్ ప్రశ్న అడిగే ముందు ఆ ప్రశ్నకు సంబంధించిన క్లూలు ఇస్తాడు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ప్రతి ప్రశ్నకు సర్కారు వారి పాట మొత్తం ఉంటుంది. దానిపైన సెలబ్రిటీలు బిడ్డింగ్ వేయాలి. మూడు నుంచి నాలుగు సార్లు బిడ్ మొత్తం పెంచుకునే అవకాశం ఉంటుంది. బిడ్ పెంచినపుడల్లా ఒక్కో క్లూ హోస్ట్ ఇస్తాడు. ఇక చివరిగా ఎవరైతే ఎక్కువ పాట పాడతారో అక్కడ బిడ్డింగ్ ఆగిపోతుంది. ప్రశ్న రివీల్ అవుతుంది. ఆ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఇచ్చిన వారికి మొదటి రౌండ్ లో ఎంత మొత్తం అయితే దానికి సమాన మొత్తం ఇస్తారు. ఇది పూర్తయ్యేసరికి తక్కువ మొత్తం ఉన్నవారు ఎలిమినేట్ అయిపోతారు. తరువాత రెండో రౌండ్ ముగ్గురు ఆడతారు. ఇందులో ప్రశ్నకు జవాబు చెప్పడానికి 30 సెకన్లు మాత్రమె సమయం ఇస్తారు. ప్రైజ్ మనీ బిడ్ మనీ కంటె రెట్టింపు ఇస్తారు. ఇందులో తక్కువ మొత్తం ఉన్నవారు ఎలిమినేట్ అవుతారు. తరువాత మూడో రౌండ్ ఇద్దరి మధ్యలో జరుగుతుంది. ఇందులో క్లూలతో పాటు కొన్ని ప్రత్యెక అవకాశాలూ ఇస్తారు. ఇందులో కూడా వెనుకబడిన వారు ఎలిమినేట్ అవుతారు. ఇక చివరి రౌండ్ ఒక్క ప్రశ్న మాత్రేమే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెబితే 50 లక్షల ప్రైజ్ మనీ వారి సొంతం అవుతుంది. ఇదీ గేమ్.
సర్కార్ మొదటి ఎపిసోడ్ లో 50 లక్షల కోసం అడిగిన ప్రశ్నకి సమాధానం చాలామందికి తెలియలేదు. ”రాముని సోదరి పేరు ఏమిటి?” అనేది ఆ ప్రశ్న.. రామునికి సోదరి ఉండనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమె తెలుసు. ఎందుకంటే సాధారణంగా ఎక్కడ రామకథ చెప్పినా.. రామలక్ష్మణభరతశత్రుఘ్నుల పేర్లు మాత్రమే చెబుతారు. దశరధుడికి నలుగురు కొడుకులు అనే ఫోకస్ అవుతుంది. అందుకే రామునికి సోదరి ఉన్న విషయం పెద్దగా ఎవరికీ తెలీదు. ఇంతకీ రాముని సోదరి పేరు శాంత. ఈమె కౌసల్య కుమార్తె. సరే కథ వదిలేద్దాం. ఇటువంటి ప్రశ్నతో ఎవరికీ రూపాయి కూడా ఇవ్వకుండా సర్కార్ ఎపిసోడ్ 1 ముగిసింది.
తాజాగా స్ట్రీమింగ్ మొదలైన ఎపిసోడ్ 2 లో ఫైనల్ ప్రశ్న అంతకు మించిన ట్విస్ట్ ఇచ్చింది. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరేమో ప్రయత్నించండి. ఇదీ ప్రశ్న.. ”మహాభారత యుద్ధం జోరుగా 18 రోజుల పాటు జరిగింది. ఆయుద్ధంలో పెద్ద ఎత్తున సైన్యం పాల్గొంది. కౌరవ సైన్యం.. పాండవ సైన్యం హోరాహోరీ తలపడ్డాయి. అయితే, ఈ 18 రోజుల యుద్ధంలో సైనికులందరికీ ఒక మహారాజు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.” ఎవరా మహారాజు? మీకు తెలుసా? అన్నట్టు ప్రదీప్ దీనికి ఓ క్లూ కూడా ఇచ్చాడండోయ్.. అదేమిటంటే..”ఇప్పుడు అదే మహారాజు పేరుమీద దేశవ్యాప్తంగా హోటళ్లు బోలెడు నడుస్తున్నాయి.” సింపుల్ చెప్పుకోండి చూద్దాం..
ఇంతకూ జవాబు తెలిసిందా?… లేదా.. అయితే, ఆ ప్రశ్నకు జవాబు ఇదే! ”మహాభారత యుద్ధంలో కౌరవ పాండవ సేనలకు భోజనాలను సమకూర్చిన మహారాజు ‘ఉడిపి’ మహారాజు. అందుకే దేశవ్యాప్తంగా చాలా హోటళ్లకు ఉడిపి పేరు పెట్టుకుంటారు.
మరిన్ని ఇక్కడ చదవండి :