Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuk Tuk Movie Review : ‘టుక్ టుక్’ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా.. ఇదిగో రివ్యూ..

ఈ మధ్యే కోర్టు సినిమాతో మంచి విజయం అందుకున్న నటుడు హర్ష్ రోషన్. బాల నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. ఇప్పుడు హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా రోషన్ నటించిన టుక్ టుక్ సినిమా విడుదలైంది. మరి ఇది ఎలా ఉంది.. ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది తెలుసుకుందాం...

Tuk Tuk Movie Review : 'టుక్ టుక్' సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా.. ఇదిగో రివ్యూ..
Tuk Tuk Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 21, 2025 | 3:51 PM

మూవీ రివ్యూ: టుక్ టుక్ నటీనటులు: హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి, దయానంద్ రెడ్డి తదితరులు సినిమాటోగ్రఫి: కార్తీక్ సాయికుమార్ సంగీతం: సంతు ఓంకార్ ఎడిటింగ్: అశ్వత్ శివకుమార్ సమర్పణ: హిమబిందు రెడ్డి కథ, దర్శకత్వం: సీ సుప్రీత్ కృష్ణ నిర్మాతలు: రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ

కథ:

చిత్తూరు జిల్లా.. అందులో ఒక ఊరు.. ఆ ఊళ్లో జులాయిగా తిరుగే ముగ్గురు కుర్రాళ్లు (హర్ష రోషన్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధు). వాళ్లకు పనీపాటా అంటూ ఏమీ ఉండదు. పైగా బూతు వీడియోలు చూస్తూ జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. వాళ్ల బుద్ధి ఎంత వంకరగా ఉంటుంది అంటే ఊళ్లో ఆడవాళ్లు స్నానం చేస్తుంటే దొంగచాటుగా చూస్తుంటారు. ఒకరోజు ఆ ముగ్గురికి అలాంటి బూతు వీడియోలు తీసి డబ్బులు సంపాదించాలనుకొనే ఆలోచన వస్తుంది. కెమెరా కోసం తండ్రిని డబ్బు అడిగితే.. వినాయక చవితి చేసి వచ్చే డబ్బుతో కెమెరా కొనుక్కోమని సలహా ఇస్తాడు. దాంతో మూలన పడిన బజాజ్ చేతక్ స్కూటర్‌ను బయటకు తీసి రిపేర్ చేయిస్తారు. దాంతో వారి జాతకం ఉన్నట్టుండి మారిపోయి డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఆ స్కూటర్ మనిషిలా సైగల్ చేయడంతో ఓ విషయంలో ఇరుక్కొంటారు ముగ్గురు కుర్రాళ్ళు. వాళ్ల జీవితంలోకి ఆ స్కూటర్ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏమిటి..? స్కూటర్ మనిషిలా ఎందుకు తల ఊపుతుంది..? ముగ్గురు జీవితాలను ప్రభావితం చేసిన నవీన్ (నిహాల్ కోదాటి), శిల్ప (శాన్వీ మేఘన) ప్రేమ కథ ఏమిటి..? అందులో శిల్పకు ఎదురైనా చేదు అనుభవం ఏంటి..? ముగ్గురు కుర్రాళ్ల జీవితాలను స్కూటర్ ఏ విధంగా మార్చేసింది తెలియాలంటే సినిమా చూడాలి..

కథనం:

చిన్న సినిమాల్లోనే ఈ మధ్య కొత్త కథలు బాగా వస్తున్నాయి.. పైగా వాటిలోనే ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా టుక్ టుక్ కూడా సినిమా అలాంటిదే. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడి సంప్రదాయాలు సినిమాలో బాగా చూపించారు. ముందుగా లోకాలిటీ దెబ్బ తినకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఓ ముగ్గురు కుర్రాళ్లు, వాళ్ళ మధ్యలో ఒక లవ్‌ పెయిర్‌, ఒక డొక్కు స్కూటర్.. అది చేసే టుక్‌ టుక్‌ సౌండ్.. అది చేసే వింతలు.. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే సినిమా కథ. చిన్నగానే ఉన్న ఈ కథలో ఊళ్లలో ఉండే మహిళలను చూసే ధోరణి.. చదువుకున్నా స్వేచ్ఛ లేకుండా వాళ్లను వంటింటి కుందేళ్లుగా కట్టేసే విధానాన్ని కూడా ఇందులో ప్రశ్నించారు. చదువుకుని, తన హద్దుల్లోనే ఉంటూ నచ్చిన జీవితం బతికే హక్కు ఓ అమ్మాయికి లేదా..? అలా బతకాలనుకుంటే ఎన్ని తిప్పలు పడాలనేది కూడా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు మేకర్స్. అలాగే కాస్త ఫాంటసీగా ఓ స్కూటర్‌తో సైగలు చేయించడం.. దాని వల్ల కుర్రాళ్లు ఇబ్బందుల్లో పడటం ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే గతంలో కారు నేపథ్యంలో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా లాంటి సినిమాల్లో చూసాిం.. ఈసారి స్కూటర్‌ చేసింది.. ముందు సినిమాల స్థాయిలో కాకపోయిన కథ పరిమితిలో బాగానే అనిపిస్తుంది. ఆ స్కూటర్ సైగలు ఎలా చేస్తుంది.. ఆ కుర్రాళ్లకు ఏం చెప్పాలనుకుంటుంది.. అందులో దేవుడన్నాడా లేదంటే దెయ్యం ఉందా అనేది కథనం బాగానే రాసుకున్నాడు దర్శకుడు సుప్రీత్ కృష్ణ. బండిలో ఉన్నది ఆత్మ అని తెలిసాక ముగ్గురు కుర్రాళ్లు భయపడటం, వాళ్లను పరిగెత్తించడం లాంటివి చేసి కామెడీ కూడా బాగానే లాక్కొచ్చారు. అంతా బాగానే అనిపించినా.. ఆ బండిలో ఆత్మ ఎలా వచ్చిందనే విషయాన్నే కాస్త సాగదీసి చెప్పాడు దర్శకుడు సుప్రీత్. సెకెండాఫ్‌ బలంగా చెప్పడానికి ఫస్టాఫ్‌ను స్లోగా మార్చేసాడు దర్శకుడు. ఆయన దగ్గర మరో ఆప్షన్ కూడా లేనట్లే. నిహాల్‌ కోధాటి, శాన్వీ మేఘనల మధ్య లవ్‌ స్టోరీ క్యూట్‌గా కొత్తగా ఉంది. అది చెబితే కథలో సస్పెన్స్‌ రివీల్‌ అవుతుంది.. అలాగే ఆ అమ్మాయి కష్టాల్లో పడటం.. ఆ తర్వాత జరిగే కథ కూడా బాగానే అనిపిస్తుంది. ప్రేమికుడి చేతక్‌ బండితో సెకెండ్‌ పార్ట్‌కి లీడ్‌ ఇచ్చారు.

నటీనటులు:

ఇందులో కోర్ట్ సినిమా హీరో హర్ష్ రోషన్ ముగ్గురు కుర్రాళ్లలో ఒకడిగా నటించాడు. మనోడి క్యారెక్టర్ అల్లరి చిల్లరిగా బాగానే అనిపిస్తుంది. మిగిలిన ఇద్దరు కుర్రాళ్ళు కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు ఎనర్జీతో నటించారు. తెలుగమ్మాయి శాన్వీ అందంతో పాటు అభినయం కూడా బాగానే ఉంది. నిహాల్‌ పర్లేదు.. మిగతా నటీనటులు కూడా బాగానే నటించారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు సంతు ఓంకార్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్లు సరిపోయింది. కార్తీక్ సాయికుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరిని చాలా బాగా చూపించారు. అలాగే ఎడిటింగ్ కూడా పర్లేదు. కాకపోతే ఫస్టాఫ్‌‌లో ఇంకాస్త షార్ప్‌ చేయాల్సింది. దర్శకుడు ఎంచుకున్న కథ బావుంది.. అయితే అక్కడక్కడా అనుభవ రాహిత్యం కనిపించింది. కానీ తను చెప్పాలనుకున్న పాయింట్‌ను బాగానే చూపించారు. ఊళ్ళలో అమ్మాయిలు ఇలాగే ఉండాలన్న థాట్ ప్రాసెస్ బ్రేక్ చేసేలా సందేశం ఇచ్చాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా టుక్‌ టుక్‌.. కాస్త ఎమోషన్.. కాస్త కామెడీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..