AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuck Jagadish: ఫాస్ట్ ఫుడ్‌ యుగంలో పల్లెటూరి నుంచి వచ్చే ఫోన్‌కాల్‌ లాంటి సినిమా టక్‌ జగదీష్‌..

Tuck Jagadish Movie Review: కొందరు డైరక్టర్లు ఎమోషన్స్‌ని బాగా డీల్‌ చేస్తారు. మరికొందరు ఫ్యామిలీ బాండింగ్స్‌ని బాగా చెప్తారు. ఇంకొందరు లవ్‌స్టోరీల స్పెషలిస్టులుంటారు.

Tuck Jagadish: ఫాస్ట్ ఫుడ్‌ యుగంలో పల్లెటూరి నుంచి వచ్చే ఫోన్‌కాల్‌ లాంటి సినిమా టక్‌ జగదీష్‌..
Tuck Jagadish
Ravi Kiran
|

Updated on: Sep 10, 2021 | 4:25 PM

Share

కొందరు డైరక్టర్లు ఎమోషన్స్‌ని బాగా డీల్‌ చేస్తారు. మరికొందరు ఫ్యామిలీ బాండింగ్స్‌ని బాగా చెప్తారు. ఇంకొందరు లవ్‌స్టోరీల స్పెషలిస్టులుంటారు. యూత్‌ఫుల్‌ డ్రామాలను క్రియేట్‌ చేయడంలో సూపర్‌ కెప్టెన్లు ఇంకొందరు. నిన్ను కోరి, మజిలీ లాంటి సబ్జెక్టులను సెన్సిటివ్‌గా డీల్‌ చేసిన శివ నిర్వాణ తీసిన మూడో సినిమా టక్‌ జగదీష్‌

కథ:

జగదీష్‌కి చిన్నతనంలో ఓ గవర్నమెంట్‌ ఆఫీసర్‌ కారులో లిఫ్ట్ ఇస్తాడు. ఆ ఆఫీసర్‌కి అందరూ ఇచ్చే మర్యాద చూసి అప్పటి నుంచీ అతనిలాగా టక్‌ చేసుకుంటాడు జగదీష్‌. ఎవరైనా అతని టక్‌ జోలికొస్తే చిర్రెత్తిపోతాడు. జగదీష్‌ తండ్రి ఆదిశేషులు నాయుడుకి ఆ ఊళ్లో మంచి పరపతి ఉంటుంది. తనకున్న పొలాన్ని పేదా సాదలకు కూడా పంచి ఇస్తాడు. ఆయన వెంటే ఉంటూ వీటన్నింటినీ చూసుకుంటుంటాడు జగదీష్‌ అన్నయ్య బోసుబాబు. అనుబంధాలు, ఆప్యాయతలు ఉన్న కుటుంబంగా ఊళ్లో మంచి గౌరవం ఉంటుంది. హఠాత్తుగా ఆదిశేషులు నాయుడు కన్నుమూయడంతో బోసుబాబులో మార్పు వస్తుంది. అతని ప్రవర్తన కారణంగా కుటుంబం ఛిన్నాభిన్నం అయిపోతుంది. అప్పటిదాకా కలిసున్న వారు కయ్యానికి కాలు దువ్వుకుంటారు. ఇదంతా గమనించిన జగదీష్‌, అప్పటిదాకా ఉన్న తన అమెరికా ఆశల్ని వదిలేస్తాడు. ఎంఆర్‌ఓగా అదే ఊరికి వస్తాడు. అక్కడ వీఆర్వోగా పనిచేస్తున్న గుమ్మడి వెంకటలక్ష్మితో ప్రేమలో పడతాడు. ఆ కుటుంబంలో ఉన్న కాన్‌ఫ్లిక్స్ట్ ఏంటి? మేనకోడలికి బోసుబాసు చేసిన అన్యాయం ఏంటి? దాన్ని జగదీష్‌ ఎలా కవర్‌ చేశాడు? ఇదంతా సెకండాఫ్‌.

విశ్లేషణ:

మంచి ఫ్యామిలీ డ్రామాలు ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తాయి. కాకపోతే బలమైన కాన్‌ఫ్లిక్స్ట్ ఉండాలి. ఎంత ఆస్తి తగాదాలు ఉన్నా, వాటిని ఎలివేట్‌ చేసే తీరు కూడా ఇంట్రస్టింగ్‌గా ఉండాలి. ఎలాంటి మలుపులూ లేకుండా సాగిపోయింది టక్‌ జగదీష్‌. నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగలిగేలా ఉంది స్క్రీన్‌ప్లే. నాని డైలాగులు చెప్పిన తీరు చాలా సందర్భాల్లో వి సినిమాను గుర్తుచేశాయి. ఆ మధ్య కార్తీ నటించిన చినబాబు సినిమా కూడా అక్కడక్కడా గుర్తుకొస్తుంది. ఉన్న ఊరు, అక్కడివారితో అనుబంధాలు, సొంత ఊళ్లో పోస్టింగ్‌.. వీటన్నిటితో కథను అల్లు కున్న తీరు సింగం సినిమాను గుర్తుచేస్తుంది. నటీనటులు వాళ్ల కేరక్టర్లలో బాగా యాక్ట్ చేశారు. బోసు బాబుగా జగపతిబాబు, దేవుడు బావగా రావు రమేష్‌, సత్తిబాబుగా నరేష్‌, అక్కలుగా దేవదర్శిని, రోహిణి, మేనకోడలుగా ఐశ్వర్య రాజేష్‌, వీఆర్వోగా రీతు వర్మ, ఎంఆర్వోగా నాని… ఇలా అందరూ వాళ్ల వాళ్ల కేరక్టర్లకు న్యాయం చేశారు. ఇంకో సారి ఇంకో సారి పాట మళ్లీ మళ్లీ వినేలా ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి అనుబంధాలను ఎలివేట్‌ చేసే విధానం కూడా బావుంది.

హీరో ఎంఆర్వో, హీరోయిన్‌ వీఆర్వో… ఈ థాట్‌ మాత్రం తెలుగు స్క్రీన్‌ మీద ఈ మధ్యకాలంలో కనిపించనిది. కాకపోతే సొంత ఊళ్లోకి ఓ ఎంఆర్వోగా పోస్టింగ్‌ అయి వస్తున్నట్టు అక్కడి వారికి తెలియకపోవడం ఎందుకో అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. ఆపదలో ఉంటే ఇంటి మీద లైటు వేయడం…లాంటి సీన్స్ మీద ట్రోల్స్ బాగానే జరుగుతున్నాయి. స్లోగా సాగే సన్నివేశాలు, ఆల్రెడీ చూసేసిన సన్నివేశాలు, ఆస్తుల కోసం గొడవలు, మలుపులు లేకుండా సాగే కథనం… ప్రేక్షకుడిని అంతగా మెప్పించవు.

ఫైనల్ మాట:

కుటుంబం, కుటుంబ సభ్యుల విలువను చెప్పడానికి నాని, జగపతిబాబు, శివనిర్వాణ అండ్‌ టీమ్‌ చేసిన టక్‌ జగదీష్‌ ప్రయత్నాన్ని ఓ సారి చూడొచ్చు.

– డా. చల్లా భాగ్యలక్ష్మి