Maha Samudram Review: ప్రేమ… స్నేహం… బంధం… బాధ్యతల కలయిక ‘మహా సముద్రం’
Maha Samudram Movie Review: కమర్షియల్ హంగులూ.. పక్కా సినీ ఫార్ములాలకు అతీతంగా మంచి నటులన్న ముద్ర కొందరికే ఉంటుంది. బరువైన పాత్రల్ని అంతే బాధ్యతగా..
Maha Samudram Movie Review: కమర్షియల్ హంగులూ.. పక్కా సినీ ఫార్ములాలకు అతీతంగా మంచి నటులన్న ముద్ర కొందరికే ఉంటుంది. బరువైన పాత్రల్ని అంతే బాధ్యతగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయగల నటులంటూ కొందరికే గుర్తింపు ఉంటుంది. అలాంటి నటుల్లో తప్పక వినిపించే పేర్లు శర్వానంద్, సిద్ధార్థ్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా మహా సముద్రం. ఆర్.ఎక్స్.100 లాంటి సినిమా తర్వాత అజయ్ భూపతి డీల్ చేసిన సబ్జెక్ట్. అందులోనూ అదితిరావు హైదరి హీరోయిన్. ట్రైలర్‌లో ఇద్దరు హీరోలతో అన్యోన్యంగా కనిపిస్తున్నట్టుంటుంది హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరికి సొంతం? మహా సముద్రంలో ఏముంది? మహా కేరక్టర్ చుట్టూ తిరిగిన కథేంటి? చదివేద్దాం రండి….
సినిమా: మహా సముద్రం నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, జగపతిబాబు, రావు రమేష్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, శరణ్య తదితరులు నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ రచన, దర్శకత్వం: అజయ్ భూపతి ప్రొడ్యూసర్: సుంకర్ రామబ్రహ్మం కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి మ్యూజిక్: చైతన్య భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్ యాక్షన్: వెంకట్
అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్ధార్థ్) ఇద్దరూ స్నేహితులు. ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని లాగేయాలనే మెంటాలిటీ అర్జున్‌ది. పోలీస్ కావాలనే లక్ష్యంతో ఉంటాడు విజయ్. వీళ్ల ఫ్రెండ్‌షిప్‌ని ఎంకరేజ్ చేస్తుంది అర్జున్ మదర్ (శరణ్య). విజయ్ పాములాంటి వాడు… అతనితో తిరగవద్దు అని అంటాడు అర్జున్ మామ చుంచు (జగపతిబాబు). ఈ విషయాలన్నీ విజయ్ లవర్ మహా (అదితిరావు హైదరి)కి కూడా తెలుసు. పిల్లలకు భరతనాట్యం నేర్పుతుంటుంది మహా. ఆ డబ్బుతోనే విజయ్ అవసరాలను తీరుస్తుంటుంది. విశాఖపట్టణంలో సముద్రానికి కింగులా ఉంటాడు ధనుంజయ్. అతనికి కండ బలం ఉంటుంది. అతని అన్న గూని బాబ్జీ (రావు రమేష్)కి బుద్ధి బలం ఉంటుంది. అనూహ్యంగా ధనుంజయ్ హత్యకు గురవుతాడు. దాంతో ఒక్కసారి సీన్ మారిపోతుంది. విజయ్ ఊరు వదిలి వెళ్లిపోతాడు. మహా… అర్జున్ ఇంటికి వచ్చేస్తుంది. చుంచు విశాఖపట్టణంలో సముద్రానికి అల్లుడిని కింగ్ చేస్తాడు. ఇన్ని పరిణామాల మధ్య జరిగే డ్రామా ఏంటి? అనేది అసలు కథ.
అర్జున్‌గా శర్వా, విజయ్‌గా సిద్ధార్థ్, మహా పాత్రలో అదితిరావు, చుంచుగా జగపతిబాబు, బాబ్జీగా రావు రమేష్ ఎవరి కేరక్టర్‌ని వాళ్లు పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. సినిమా స్టార్టింగ్‌లో వినిపించే డైలాగ్ నుంచి అక్కడక్కడా అజయ్ భూపతి పెన్ను పవరు వినిపిస్తూనే ఉంది. తప్పిపోయిన వాడిని వెతకవచ్చు. ఆచూకి తెలియకూడదని తప్పించుకుంటున్న వాడికి ఎక్కడని వెతుకుతావ్ అనే డైలాగ్, తను కోపంగా లేదు.. బాధలో ఉంది. మనమీద కాకుంటే ఇంకెవరి మీద చూపిస్తుంది… అనే డైలాగ్, నువ్వు సముద్రంలాంటివాడివి… నీలో కలవాలని అన్ని నదులకూ ఉంటుంది. కానీ కలిసే అదృష్టం ఎంత మందికి వస్తుంది? అనే డైలాగ్, బంధం విలువల తెలిసిన వాడే బాధ్యతను మోస్తాడు అనే డైలాగ్.. ఇలా అక్కడక్కడా మాటలు మనసును తాకుతాయి.
హీరోల ఇంట్రడక్షన్ సాంగ్, మధ్యలో అదితిరావు సోలో సాంగ్ బావున్నాయి. సీన్లకు తగ్గట్టు ఎలివేట్ చేస్తూ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చైతన్య మార్కును క్రియేట్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తావించాల్సింది రాజ్ తోట సినిమాటోగ్రఫీ. షాట్స్ క్రియేటివ్‌గా బావున్నాయి. ఆ సీన్ మీద ఇంట్రస్ట్ ని క్రియేట్ చేసేలా ఉంది సినిమాటోగ్రఫీ.
జగపతిబాబు ఇంట్రడక్షన్‌లో బోట్ సీన్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బావున్నాయి. సినిమా సీరియస్ మోడ్‌లో ఎక్కువగా సాగింది. కామెడీ ఇంకాస్త కలిపితే రిలీఫ్‌గా అనిపించేదేమో. బలమైన సీన్లు, పర్ఫెక్ట్ లాజిక్కులు కలిస్తే సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేది.
– డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9
Also Read..
శ్రియ ప్రెగ్నెన్సీ పై మంచు లక్ష్మి రియాక్షన్
పండగ సీజన్‌లో బిగ్ సి బంపర్ ఆఫర్లు..స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!