AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra King Taluka Review: ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ.. రామ్ పోతినేని సినిమా ఎలా ఉందంటే

డబుల్ ఇస్మార్ట్, స్కంద లాంటి పరాజ్యాల తర్వాత రామ్ పోతినేని నుంచి వచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

Andhra King Taluka Review: ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ.. రామ్ పోతినేని సినిమా ఎలా ఉందంటే
Andhra King Taluka
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Nov 27, 2025 | 1:42 PM

Share

మూవీ రివ్యూ: ఆంధ్ర కింగ్ తాలూకా

నటీనటులు: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, మురళీ శర్మ, రావు రమేష్, తులసి, సత్య, రావుల రామకృష్ణ తదితరులు

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

సంగీతం: వివేక్ మార్విన్

సినిమాటోగ్రఫీ:

నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్ బాబు పి

కథ:

ఈ సినిమా కథ గోదావరి జిల్లాలో 2002 ప్రాంతంలో మొదలవుతుంది. ఆంధ్ర కింగ్ సూర్య (ఉపేంద్ర) తెలుగు రాష్ట్రాల్లో దేవుడు ఇలాంటి హీరో. చాలా పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకుడు. అలాంటి హీరో 100వ సినిమాకు రెడీ అవుతున్న తరుణంలో అనుకోకుండా అది ఆగిపోతుంది. ఆర్థిక సమస్యల కారణంగా 100 సినిమా ఆగిపోవడంతో సూర్య బాగా కృంగిపోతాడు. మరోవైపు అదే గోదావరి జిల్లాలో సూర్యకు అతిపెద్ద అభిమాని సాగర్ (రామ్ పోతినేని). అదే ఊర్లో ఉన్న మహాలక్ష్మి థియేటర్ ఓనర్ పురుషోత్తం (మురళీ శర్మ) కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ) నీ తొలిచూపులోనే ప్రేమిస్తాడు సాగర్. కానీ వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి పురుషోత్తంతో ఒక ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అది హీరో సూర్య కెరీర్ కు ముడిపడి ఉంటుంది. అది ఏంటి అనేది అసలు కథ..

స్క్రీన్ ప్లే:

కొన్ని సినిమాలు మనసుకు చాలా దగ్గరవుతూ ఉంటాయి. ముఖ్యంగా అభిమాని కోణంలో చూసినప్పుడు ఆ సినిమాలు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రా కింగ్ తాలుక కూడా అలాంటి సినిమానే. ఇందులో అభిమానులకు కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. లేకపోతే అంత మంచి కథ రాసుకున్నప్పుడు దానికి సరిపోయే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మహేష్ బాబు తడిబడినట్టు అనిపిస్తుంది. తొలి 20 నిమిషాల సినిమా అద్భుతంగా ఉంటుంది. ఉపేంద్రతో మొదలు పెట్టిన సీక్వెన్స్ సినిమా మీద అంచనాలు అలా పెంచేస్తుంది. హీరో రామ్ ఎంట్రీ వరకు కూడా కథ అంతే స్పీడ్ తో పరిగెడుతుంది. కానీ ఆ తర్వాత ఎందుకు కాస్త స్లో అయిన ఫీలింగ్ వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్లీ ఇంటర్వెల్ వచ్చేసరికి కథ గాడిన పడింది. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకున్నాడు దర్శకుడు మహేష్. క్లైమాక్స్ అయితే అద్భుతంగా డిజైన్ చేశాడు. హీరోల కోసం అభిమానులు రావడం కామన్ కానీ.. అభిమాని కోసం హీరో తరలి రావడం అనేది ఎమోషనల్ ఫీలింగ్. దాన్ని క్యాష్ చేసుకోవాలని చూశాడు దర్శకుడు మహేష్ బాబు. ఈ సినిమాలో మెయిన్ యుఎస్పి పాయింట్ కూడా అదే. అభిమాని కోసం హీరో కోట దిగి రావడం అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. దాని చుట్టూ ఇంకాస్త ఎమోషనల్ సన్నివేశాలు ఉండుంటే ఇంకా బాగుండేది. అయినా కూడా రామ్ గత సినిమాలతో పోలిస్తే ఆంధ్ర కింగ్ తాలూకా చాలా బెటర్ సినిమా. తన ఇమేజ్ కు ఏది సెట్ అవుతుందో ఇప్పటికైనా రామ్ అర్థం చేసుకుంటే మంచిది.

నటీనటులు:

సాగర్ పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా చేశాడు. భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ బాగుంది. ఉపేంద్ర ఉన్నంత సేపు సినిమా అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ లో ఆయన జీవించాడు. మిగిలిన పాత్రలలో మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

వివేక్ మార్విన్ సంగీతం కొత్తగా ఉంది. నువ్వుంటే చాలు పాట స్క్రీన్ మీద కూడా అద్భుతంగా ఉంది. మిగిలిన పాటలు కూడా ఓకే. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయిన సన్నివేశాలు కనిపించాయి. దర్శకుడు ఛాయిస్ కాబట్టి శ్రీకర ప్రసాద్ ని ఇక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మహేష్ బాబు టేకింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా రాసి ఉంటే బాగుండేది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా ఆంధ్ర కింగ్ తాలూకా.. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్.. ఎమోషనల్ రైడ్..!