తిరువనంతపురం, సెప్టెంబర్ 2: ప్రముఖ మలయాళ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో గురువారం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అపర్ణ మృతి మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆమె మరణం వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తాయి. అపర్ణ మృతికి గల అసలు కారణాన్ని తాజాగా పోలీసులు వెల్లడించారు. కుటుంబ సమస్యల కారణంగానే అపర్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆమె ఆగష్టు 31 రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలోని కరమణ తలియాల్‌లోని తన నివాసంలో మృతిచెందింది. అపర్ణకు ఆమె భర్తతో తరచూ గొడవలు జరిగేవి. మద్యానికి బానిసైన ఆమె భర్త వల్లనే ప్రాణాలు తీసుకుంది. దీనితో పాటు ఇతర కుటుంబ సంబంధిత సమస్యలు కూడా ఆమెను బాగా కుంగదీశాయి. అపర్ణ సోదరి ఐశ్వర్య వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను సిద్ధం చేశారు. అందువల్లనే అపర్ణ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అపర్ణ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన తల్లి బీనాతో వీడియో కాల్ చేసి భర్త సంజిత్ తో గొడవల గురించి మాట్లాడింది. భర్త తాగుడుతో విసిగి పోయానని, చనిపోవాలనుకుంటున్నట్లు ఫోన్‌లో తల్లితో మాట్లాడుతూ ఏడ్చింది. అనంతరం గురువారం రాత్రి 7 గంటలకు ఆమె ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 7:30 గంటల ప్రాంతంలో కరమన కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అపర్ణా నాయర్ 2005లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి దాదాపు 50కిపైగా సినిమాల్లో నటించింది. మెగాతీర్థం, ముద్దుగౌవ్, అచ్చయాన్స్, కోదాటి సమక్షం బాలన్ వకీల్, కల్కి వంటి పలు చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. కరమనలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న అపర్ణ రెండు వారాల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇంతలో ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడింది. అపర్ణకు త్రయ, కృతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా అపర్ణకు సంజిత్‌తో రెండో పెళ్లి జరిగింది. ఆమె మొదటి భర్తతో ఓ కుమార్తె ఉండగా, రెండో భర్త సంజిత్‌కు జన్మించిన మూడేళ్లు కుమార్తె ఉంది. కొన్నాళ్లు వీరి దాంపత్యం సవ్యంగానే సాగినా సంజత్ అతి తాగుతు వల్ల తరచూ గొడవలు జరిగేవి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.