నయనతార, విఘ్నేశ్ దంపతులు సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారన్న వార్త ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహమైన నాలుగు నెలలకే ఈ జంట పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు ఈ జంట నిబంధనలు పాటించారా.? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడం ఈ ఏడాది జనవరి నుంచి భారత్‌లో నిషేధించారన్న వార్తల నేపథ్యంలో నయన్ దంపతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారా.? అన్న కోణంలో కూడా చర్చలు మొదలయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం సైతం దీనిపై వివరణ కోరింది.
అయితే తాజాగా తెలుస్తోన్న సమచారం ప్రకారం ప్రభుత్వానికి ఈ జంట ఇచ్చిన వివరణలో విస్తుపోయే నిజం బయటపడినట్లు తెలుస్తోంది. ఈ జంట తాము 6 ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్నట్లు తెలిపినట్లు సమాచారం. రిజిష్టర్ వివాహం చేసుకున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని తెలిపారని తెలుస్తోంది. వివాహానికి సంబంధించిన పత్రాలన్నింటినీ అఫిడవిట్‌తో పాటు అధికారులకు సమర్పించినట్లు సమాచారం అయితే దీనిపై నయన్ కానీ, అధికారులు కానీ ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు.
ఇదిలా ఉంటే సరోగసీ నియంత్రణ చట్టం 2021 ప్రకారం పెళ్లైన జంట ఐదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన తర్వాతే సరోగసీ విధానాన్ని ఆశ్రయించడానికి అనుమతులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నయన్ దంపతులు ఇచ్చిన వివరణ చట్ట ఉల్లంఘన కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ సరోగసి వ్యవహారం తిరిగి తిరిగి ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..