చెన్నయ్ కోడంబాక్కంలోని ప్రసాద్ స్టూడియోస్ నుంచి స్వరరాజా ఇళయరాజా ఎన్నో అద్భుతాలను సృష్టించిన విషయం తెలిసిందే. సుదీర్గకాలంగా ఈ స్టూడియోస్ లో సంగీతం చేస్తూ వచ్చిన ఇళయరాజాను ఉన్నట్టుండి ఖాళీ చేయమని ప్రసాద్ స్టూడియోస్ నివేదించింది. దాంతో ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. తన రికార్డింగ్ గదిలోకి తనను అనుమతించేందుకు పరిష్కారం కావాలని కోర్టుకు అప్పీల్ చేసారు ఇళయరాజా. ఈ నేపథ్యంలో ఇళయరాజా టీమ్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రసాద్ స్టూడియోలో టైటిల్ లేదా శాశ్వత స్థానం కోసం తాను క్లెయిమ్ చేయలేదని.. అయితే తన గదిలోకి మాత్రమే ప్రవేశించాలనుకుంటున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తన వ్యక్తిగత గదిలో వస్తువుల్ని చట్టవిరుద్ధంగా బయాటపడేయడం .. తనను చట్టవిరుద్ధంగా తిరస్కరించడం పై ఆయన గతఏడాది డిసెంబర్ లో కోర్టును ఆశ్రయించారు. ఇళయరాజా ప్రాంగణాన్ని ఖాళీ చేయమని స్టూడియో వాళ్లు కోరినప్పుడు అదే ప్రాంగణంలో కొనసాగడానికి అనుమతించాలని కోరుతూ స్టూడియో యజమానులపై ఇళయరాజా కేసు పెట్టారు. ఈ క్రమంలో ఇళయరాజా కొత్త స్టూడియోను ఏర్పాటుచేయాలని భావించారు. చెన్నై కోడంబకంలో ఒక థియేటర్ కొన్నారు. స్టూడియో నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ స్టూడియోను సెప్టెంబర్ 2020లో ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక త్వరలోనే ఇళయరాజా కొత్త స్టూడియో ప్రారంభంకానుందని తెలుస్తుంది.