Ram Gopal Varma: ‘నన్నే మోసం చేస్తారా.. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’: రామ్ గోపాల్ వర్మ
ఆ సంతకం నాది కాదు.. ఆ అడ్రస్ నాది కాదు.. అన్నీ ఫేకే అంటూ కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని వర్మ ఫైరయ్యారు. వాళ్లను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
రామ్‌గోపాల్‌వర్మకు కోపమొచ్చింది. ఎప్పుడూ నా మీద కేసులు పెట్టడమేనా… నేను మరొకరి మీద కేసు పెడితే ఎలా వుంటుందో చూడండి.. అంటూ పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ కంప్లయింట్ ఇచ్చారు.
తన ‘డేంజరస్’ సినిమా రిలీజ్ టైమ్‌లో తనను డిస్టర్బ్ చేసిన నట్టి బ్యాచ్‌పై న్యాయపోరాటం షురూ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 50 లక్షలు ఇస్తానని తాను హామీ పత్రం ఇచ్చినట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని ఆయన ఆరోపించారు.
ఆ సంతకం నాది కాదు.. ఆ అడ్రస్ నాది కాదు.. అన్నీ ఫేకే అంటూ కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని వర్మ ఫైరయ్యారు. వాళ్లను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరి.. వాళ్లు మీ మీద వేసిన కేసు విషయం ఏమిటని నిలదీస్తే.. అది అదే, ఇది ఇదే అంటూ తనదైన స్టయిల్‌లో రిప్లయ్ ఇచ్చారు.
కాగా, ఆర్జీవీపై నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈమేరకు ఓ సవాల్ కూడా విసిరారు. హైదరాబాద్ పాత ఆఫీస్, ముంబై ఆఫిస్‌లు ఎందుకు ఖాళీ చేశారో చెప్పాలని కోరారు. ఆర్జీవీ చేసే చీటింగ్ వల్లే అన్ని చోట్లా తన దుకాణం ఎత్తేశారని ఆరోపించారు. తప్పు చేయలేదని ప్రూవ్ అయితే..దేనికైనా సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. ‘ఆర్జీబీ చేత మోసపోయిన వారంతా నన్ను కలుస్తున్నారు. కోర్ట్‌లో ఇష్యూ ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. ఆర్జీవీ తీసిని సినిమాలను ఆపాలని నిర్మాతలందరినీ కోరుతున్నాను’ అంటూ ముగించారు.