Yesudas: ఆయనది అయిదు పుష్కరాల స్వరం.. అయినా తరగని మాధుర్యం.. జేసుదాసు తొలి పాటకు ఆరవై ఏళ్లు

ఆయన గళంలో అంతు పట్టని మార్మికత. ఎవరికీ అందని ప్రత్యేకత. దైవదత్తమైన ఆ స్వరం భక్తి సంగీతానికి భావోద్వేగపు పరిమళాలను అద్దింది. లలిత సంగీతాన్ని సుధారసం చేసింది... సంప్రదాయ సంగీతాన్ని వాగ్గేయకారుల సరసన నిలిపింది.

Yesudas: ఆయనది అయిదు పుష్కరాల స్వరం.. అయినా తరగని మాధుర్యం.. జేసుదాసు తొలి పాటకు ఆరవై ఏళ్లు
Jesudas
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 15, 2021 | 10:30 AM

ఆయన గళంలో అంతు పట్టని మార్మికత. ఎవరికీ అందని ప్రత్యేకత. దైవదత్తమైన ఆ స్వరం భక్తి సంగీతానికి భావోద్వేగపు పరిమళాలను అద్దింది. లలిత సంగీతాన్ని సుధారసం చేసింది… సంప్రదాయ సంగీతాన్ని వాగ్గేయకారుల సరసన నిలిపింది. పాశ్చాత్య సంగీతానికి సరికొత్త సింగారింపు తెచ్చింది. ఆరు దశాబ్దాలుగా ఆ స్వర రాగ గంగ ప్రవహిస్తూనే వుంది. అవును నిజంగానే ఆ స్వర మధురిమకు అరవై ఏళ్లు. 1961, నవంబర్‌ 14న జేసుదాసు తొలి పాట రికార్డు అయింది. అది మొదలు ఇప్పటి వరకు కొన్న వేల పాటలు మనకు వీనుల విందు చేస్తున్నాయి. చేస్తూనే ఉంటాయి.

జేసుదాసు.. ఎందుకో ఈ పేరు వినగానే శ్రుతి లయలు మురిసిపోతాయి. స్వరజతులు సరాగాలు పోతాయి… వాయిద్యాలు ఆ గళంతో పోటీ పడగలమో లేదోనని సందేహపడతాయి.. రాగం తీసే కోయిల కూడా ఆ కంఠం విని చప్పున పాటడం ఆపేస్తుంది…అటు సినీ సంగీతాన్ని …ఇటు కర్ణాటక సంగీతాన్ని అసమాన రీతిలో మేళవించిన సంగీత స్రష్ట ఆయన! మనందరికి ఆత్మీయ గాయకుడైన జేసుదాసు పూర్తి పేరు కట్టశేరి జోసెఫ్‌ జేసుదాసు.. దాసేటన్‌ అని ప్రేమపూరిత వాత్సల్యంతో అందరూ పిల్చుకునే జేసుదాసు బాల్యం కష్టాలను భరించడం ఎలాగో నేర్పింది.. యవ్వనం అవమానాలను హరాయిండం ఎలాగో చెప్పింది .. అవహేళనలను దిగమింగుకోవడాన్ని నేర్పింది… పాటే ప్రాణంగా భావించిన ఆయనకు ఆరంభంలో తిరస్కారాలు ఎదురయ్యాయి… అన్నింటినీ తట్టుకున్నారాయన!

కొచ్చిలోని ఓ సనాతన క్యాథలిక్‌ కుటుంబంలో 1940, జనవరి పదిన పుట్టారు జేసుదాసు.. తండ్రి జోసెఫ్‌ మంచి గాయకుడు.. రంగస్థల నటుడు.. అంతకు మించి కళారాధకుడు.. కానీ ఆయన కళను నమ్ముకున్నాడే తప్ప అమ్ముకోలేదు.. సరస్వతి కటాక్షానికేం బోలెడంత వుంది.. లక్ష్మీ కటాక్షమే కరువైంది.. డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో చిన్నప్పుడే జేసుదాసు తెలుసుకున్నాడు.. అయినా సంగీతాన్ని ఎప్పుడూ వదులుకోలేదు.. సంగీత సరస్వతిని ఏనాడూ తిట్టుకోలేదు.. ఆ కళను అమితంగా ప్రేమించాడు. నాన్న ప్రభావమో ఏమో.. వారసత్వంగా అబ్బిన కళో తెలియదు కానీ.. జేసుదాసు చిన్నప్పట్నుంచే పాటపై మనసు పారేసుకున్నాడు.. ఆయనకు తొలి గురువు తండ్రే.. ఆయన తర్ఫీదులో గాత్రానికి మెరుగులు దిద్దుకున్నాడు.. చిన్నప్పుడు పాటల పోటీల్లో జేసుదాసే ఫస్ట్‌.. జేసుదాసు పాల్గొంటున్నాడంటే మిగతా వారు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందంతే. స్కూల్‌ అయిపోయింది.. ప్రీ యూనివర్సిటీ స్టడీస్‌ కూడా అయిపోయాయి. చదువు కంటే సంగీతంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు జేసుదాసు..

Jesudasu 2

Jesudasu 2

రాష్ట్ర స్థాయిలో జరిగిన కర్ణాటక గాత్ర సంగీతంలో జేసుదాసు ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచాడు.. అప్పుడాయన వయసు పదిహేడేళ్లే.. కొడుకు ఇష్టా ఇష్టాలను గమనించిన జోసెఫ్‌ జేసుదాసును తిరుపుణిత్తారయనిలోని సంగీత కళాశాలలో చేర్పించారు. క్రైస్తవుడేమిటి.? సంగీతం నేర్చుకోవడమేమిటి? అని చెవులు కొరుక్కున్నారు. జేసుదాసు ఇవేవీ పట్టించుకోలేదు. తన లక్ష్యసాధనలోనే పూర్తి సమయం వెచ్చించారు… కసి..పట్టుదల ఆయణ్ణు కాలేజి ఫస్ట్‌ని చేశాయి…ఆ తర్వాత స్వాతి తిరునాల్‌ మ్యూజిక్‌ కాలేజీలో చేరి శెమ్మంగుడి శ్రీనివాస్‌ అయ్యర్‌ దగ్గర పాఠాలు నేర్చుకున్నారు… ఆ తర్వాత త్రివేండ్రంలోని సంగీత అకాడమీలో చేరారు..ఈ మధ్యలో చెంబై వైద్యనాథ భాగవతార్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు.. జేసుదాసు స్వర మాధుర్యానికి..గాత్ర వైవిధ్యానికి భాగవతార్‌ ముచ్చటపడ్డారు.. కొంతకాలానికే జేసుదాసు ఆయనకు ప్రియ శిష్యుడయ్యారు.

Jesudasu 3

Jesudasu 3

ఆ గంధర్వగాయకుడికి కాలం మరిన్ని విషమపరీక్షలను పెట్టింది… సంగీత అకాడమీలో చేరిన తర్వాత తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.. వెంటనే ఇంటికొచ్చేశారు… పూట గడవడానికి కూడా డబ్బుల్లేని దుర్భర పరిస్థితి… ఇంటిని నెట్టుకురావడానికి చిన్నా చితక పనులు చేశారు.. ఆ సంపాదనతో తండ్రికి వైద్యం చేయించారు… అయినా ఫలితం దక్కలేదు.. ఆస్పత్రిలోనే తండ్రి కన్నమూశారు.. ఎనిమిది వందల రూపాయలు కడితే కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వీల్లేదంది ఆస్పత్రి యాజమాన్యం.. ఇంట్లో వున్న వస్తువును తాకట్టు పెట్టి తండ్రి భౌతికకాయాన్ని ఇంటికి తెచ్చుకోవాల్సి వచ్చింది. తండ్రి మరణించడంతో ఇంటికి తనే పెద్దదిక్కయ్యారు. సంగీత అకాడమీలో సంగీతం అభ్యసించాలన్న ఆలోచనను బలవంతంగా మనసులోంచి తుడిపేసుకున్నారు.. ఎంత కష్టపడ్డా కడుపు నిండా తిండిదొరికేది కాదు.. సాయం కోసం ఒకరిని చేయిచాచి అడిగే మనస్తత్వం కాదు జేసుదాసుది! ఆత్మాభిమానం అడ్డుపడేది…గాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.. వెంటనే మద్రాసుకు బయలుదేరారు..మద్రాసులో అయితే అడుగు పెట్టారు కానీ ఎటు పోవాలో…ఎవరిని అడగాలో తెలియని అయోమయస్థితి.. జేబులో వున్నవి పదహారు రూపాయలే! అవకాశాల కోసం సంగీత దర్శకుల గడపలన్నీ ఎక్కారు… కొందరు చూద్దాం చేద్దాం అనేవారు.. మరికొందరు నీ గొంత బాగోలేదని మొహం మీదే చెప్పేవారు…డబ్బుల్లేక మంచినీళ్లతో కడుపు నింపుకున్న స్థితిని కూడా జేసుదాసు అనుభవించారు. కాసిన్ని డబ్బుల కోసం స్టేజీ పాటలు పాడారు..

Jesudasu 1

Jesudasu 1

ఎంత ప్రయత్నించినా అవకాశాలు వస్తేగా! పేరు మార్చుకుంటే అవకాశాలొస్తాయేమో.. ప్రయత్నించమన్నారు స్నేహితులు.. ఈ సలహాను జేసుదాసు పెద్దగా పట్టించుకోలేదు.. కారణం.. చిన్నప్పుడు తండ్రి అన్న మాటలు వెంటాడుతుండటమే! మనిషికి పేరు ముఖ్యమే… కానీ అది మనిషికంటే గొప్పదేం కాదు… వ్యక్తి అభివృద్ధికి పేరేప్పుడూ అడ్డంకి కాదు… మంచి పేరు పెట్టుకున్నవాళ్లంతా మంచిగా వుంటారన్న గ్యారంటీ లేదు.. ప్రతిభను నమ్ముకో.. నమ్మకం పెంచుకో.. లక్ష్యాన్ని చేరువ చేసేవి ఇవే! ఈ హితోక్తి జేసుదాసు మనసులో బలంగా నాటుకుపోయింది.. ఇప్పుడు జేసుదాసు పేరే సంగీతానికి పర్యాయపదమైంది. కష్టపడ్డారు.. తీవ్రంగా కష్టపడ్డారు.. తనకు తాను పరీక్షలు పెట్టుకున్నారు.. ప్రతీ సంగీత దర్శకుడి దగ్గర తన స్వరాన్ని వినిపించారు.. అదే సమయంలో మలయాళ చిత్ర దర్శకుడు కె.ఎన్‌.ఆంథోనీ కాల్‌పాడుక్కల్‌ అనే సినిమా తీస్తున్నారు.. దానికి ఎం.బి.శ్రీనివాసన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఆ సినిమాలో ఓ పాటను ఓ గాయకుడితో పాడించాలనుకున్నారు.. కానీ అతడు ..ఇది నాకంటే జేసుదాసే బాగా పాడతాడు అని చెప్పి.. వాళ్లను ఒప్పించి ఆ అవకాశాన్ని జేసుదాసుకు ఇప్పించాడు.. అలా 1961, నవంబర్‌ 14న జేసుదాసు తొలి పాట రికార్డు అయింది. మాధుర్యంతో కూడిన వైవిధ్యభరితమైన జేసుదాసు కంఠం విని సంగీత దర్శకులు ఆశ్చర్యపోయారు.. ఇంత మంచి స్వరాన్ని కాదనుకున్నందుకు తమకు తాము నిందించుకున్నారు. జేసుదాసు స్వరం మలయాళికి ఇష్టంగా మారింది.

అలనాటి సూపర్‌స్టార్‌ ప్రేమ్‌నజీర్‌ దగ్గర్నుంచి ఇప్పటి సూపర్‌స్టార్లు మమ్ముట్టి..మోహన్‌లాల్‌ మీదుగా వర్ధమాన నటుల వరకు ఆయన గాత్రదానం కొనసాగుతూ వస్తోంది. ఆ స్వరంలో రవ్వంతైనా మార్పు వుంటేగా! అదే మాధుర్యం.. అదే గాంధర్వ స్వరం..మలయాళం నుంచి తమిళంలోకి.. అక్కడ్నుంచి తెలుగులోకి జేసుదాసు స్వరం ప్రవహించింది.. పందొమ్మిది వందలా అరవై అయిదులో వచ్చిన బంగారు తిమ్మరాజు సినిమాతో జేసుదాసు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. ఏడో దశకంలో జేసుదాసు తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. మేరిమాత అనే డబ్బింగ్‌ సినిమాలో ఆయన పాడిన పాట జన హృదయాల్లో చొచ్చుకుపోయింది. ఆ తర్వాత ప్రేమపక్షులు.. శ్రీకృష్ణసత్య.. వంటి సినిమాల్లో పాడినా.. జేసుదాసును తెలుగులో మరింత దగ్గర చేసింది మాత్రం అంతులేనికథలోని దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాటే! ఇళయరాజా తొలి తెలుగు చిత్రం భద్రకాళిలో జేసుదాసు పాడిన పాట చిన్ని చిన్ని కన్నయ్య ఇప్పటికీ ఎక్కడోచోట వినిపిస్తూనే వుంటుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎన్నో అపూర్వమైన పాటలను తెలుగువారికి అందించారాయన.

Jesudasu

Jesudasu

1984లో వచ్చిన మేఘసందేశంలో ఆయన పాడిన పాటలు జాతీయ స్థాయిలో బహుమతిని తెచ్చిపెట్టాయి. జేసుదాసు గళాన్ని కృష్ణంరాజు.. మోహన్‌బాబులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు.. ముఖ్యంగా మోహన్‌బాబు సినిమాల్లో జేసుదాసు పాట తప్పనిసరి అయింది.. మోహన్‌బాబుకు జేసుదాసు పాడిన పాటలన్నీ సూపర్‌హిట్టయ్యాయి.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి.. అక్కినేని నుంచి మొదలు పెడితే.. కృష్ణ.. శోభన్‌బాబు.. చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేశ్‌.. నాగార్జున.. చంద్రమోహన్‌.. మురళీమోహన్ వంటి నటులకు కూడా జేసుదాసు ప్లేబ్యాక్‌ పాడారు.

భక్తి గీతాలను ఎంత భావస్ఫోరకంగా పాడగలరో.. విషాద గీతాలను కూడా అంతే వైవిధ్యంగా ఆలపించగలరు.. అదే జేసుదాసు స్పెషాలిటి! కొత్త మిలీనియమ్‌లో కూడా జేసుదాసు అవిశ్రాంతగా పాటలు పాడారు.. 2006లో ఎవిఎం స్టూడియోలో ఒకే రోజు దక్షిణ భారత భాషల్లో పదహారు పాటలు పాడి చరిత్ర సృష్టించారు. కశ్మీరీ..అస్సామీ..కొంకణి తప్ప అన్ని భారతీయ భాషల్లోనూ జేసుదాసు స్వరం పల్లవించింది.. ఇంగ్లీష్‌..ఫ్రెంచ్‌..లాటిల్‌.. రష్యన్‌.. అరబిక్‌… మలయ భాషల్లో ఆయన స్వరం మధురిమలను అద్దింది. షష్టిపూర్తి చేసుకున్న జేసుదాసు స్వరానికి జేజేలు..ఆ గొంతులోంచి ఇంకా చాలా చాలా పాటలు జాలువారాలని కోరుకుంటున్నాం. Read Also… World’s oldest Cake: వందల ఏళ్లనాటి కేకు.. ఇంకా తాజాగానే ఇంగ్లండ్‌లో తవ్వకాల్లో గుర్తించిన అధికారులు.. (వీడియో)

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు