ముస్లిం మహిళలపై హింసకు సంబంధించిన కథతో తెరకెక్కిన ‘ హమారే బారా ‘ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ముస్లిం మహిళలను చెడుగా చూపించారని, ఇస్లాం మతాన్ని కించపరిచారంటూ చాలా చోట్ల మైనారిటీ వర్గాలు ఆందోళన కు దిగుతున్నాయి. ఇప్పటికే బాంబే హైకోర్టు హమారే బారా సినిమా విడుదలపై స్టే విధించింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ జాబితాలో చేరింది. మారే బారా విడుదలపై నిషేధం విధించింది. కర్ణాటక సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1964లోని సెక్షన్ 15 (1) మరియు 15 (5) ప్రకారం, రాష్ట్రంలో ఈ సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ సినిమా ప్రదర్శించడం వల్ల మత సామరస్యానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో సినిమాపై నిషేధం విధించారు. కొన్ని మైనారిటీ వర్గాలు సినిమాను విడుదల చేయవద్దని కోరినట్లు కూడా సమాచారం.కమల్ చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాలో అన్నూ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ కొన్ని వారాల క్రితం విడుదలైంది. దీని తర్వాత సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అజహర్ బాంబే హైకోర్టు మెట్లెక్కారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. జూన్ 14 వరకు విడుదలను నిషేధిస్తూ.. పిటిషన్ విచారణను కోర్టు జూన్ 10కి వాయిదా వేసింది. సినిమాలో ఇస్లాం గురించి ప్రతికూల డైలాగులు ఉన్నాయని, ఇస్లాంను చెడుగా చిత్రీకరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. CBFC ఇప్పటికే కొన్ని డైలాగ్‌లకు కట్‌లను సూచిస్తూ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఎఫ్‌సీ కోర్టులో వాంగ్మూలం కూడా దాఖలు చేసింది.
మరోవైపు ‘ హమారే బారా ‘ చిత్ర బృందం తమ సినిమాలో ఏ మతాన్ని చెడుగా చూపించలేదంటోంది. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అన్నూ కపూర్ మాట్లాడుతూ.. ‘దయచేసి ఒక్కసారి సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది’ అని అన్నారు. అలాగే ఈ సినిమా తీసిన చిత్ర బృందానికి హత్య బెదిరింపులు వస్తున్నాయని చిత్ర బృందం వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల న్ని చిత్రాలను నిషేధించాయి. అదే సమయంలో మరికొన్ని చిత్రాలకు పన్ను మినహాయింపులు ఇచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిషేధాన్ని కోర్టులో సవాలు చేసిన చిత్ర బృందాలు విజయం సాధించాయి. మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ నిషేధానికి వ్యతిరేకంగా చిత్రబృందం కోర్టుకు వెళితే ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.