
ప్రముఖ బాలీవుడ్ నటుడు, కామెడీ కింగ్ కపిల్ శర్మ తన కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఎప్పుడూ బొద్దుగా కనిపించే ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు స్లిమ్ గా మారిపోయాడు. బాగా బరువు తగ్గి పోయి మరింత స్టైలిష్ గా మారిపోయాడు. కపిల్ 63 రోజుల్లో ఏకంగా 11 కిలోల బరువు తగ్గాడట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ వెయిట్ లాస్ కోసం అతను గంటల తరబడి జిమ్ లో గడపలేదు. నోరు కట్టేసుకోలేదు. ఫరా ఖాన్, కంగనా రనౌత్, సోను సూద్ వంటి బాలీవుడ్ స్టార్లకు ట్రైనింగ్ ఇచ్చే ఫిట్‌నెస్ ట్రైనర్ యోగేష్ భటేజా, కపిల్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించారు. బరువు తగ్గడానికి కఠినమైన వర్కౌట్లు, కఠోరమైన డైట్ అవసరం లేదని యోగేష్ స్పష్టం చేశారు. ‘చాలామంది జిమ్‌కు వెళ్లిన మొదటి రోజే అతిగా శ్రమించి, వర్కౌట్లు, వ్యాయామాలు చాలా కష్టమని భావించి మధ్యలోనే ఆపేస్తారు. సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. కపిల్ విషయంలో మేం ఒక ప్రత్యేకమైన, సులభమైన పద్ధతిని అనుసరించాం. అదే ’21-21-21′ రూల్’. ఈ నియమాలకు అనుగుణంగా కపిల్ తన అలవాట్లను మార్చుకుని అదనపు బరువును తగ్గించుకున్నాడు’అని యోగేష్ చెప్పుకొచ్చారు.
కపిల్ బిజీ షెడ్యూల్ దృష్ట్యా నేను ఇంట్లోనే అతనికి శిక్షణ ఇచ్చాను. రెసిస్టెన్స్ బ్యాండ్‌లు యోగా మ్యాట్‌లు వంటి సాధారణ సాధనాలనే కపిల్ కూడా ఉపయోగించాడు. ఆ తరువాత మెల్లిగా జిమ్ ఎక్విప్ మెంట్స్ ను కూడా అతని ఫిట్‌నెస్ ప్రయాణంలో చేర్చాం. ఈ వెయిట్ లాస్ జర్నీలో మొదటి రోజు కథ చాలా ఆసక్తికరంగా గడిచింది. నేను అతనిని స్ట్రెచ్ చేయమని అడిగాను. దీంతో కపిల్ బాగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అసలు విషయమైంది. బిజీ షెడ్యూల్ దృష్ట్యా కపిల్ టైమ్ కు తినడు. నిద్ర కూడా సరిగాపోడు. ఇదే అతని అధిక బరువుకు కారణమైంది’
‘ కపిల్ కు మొదట కొన్ని సింపుల్ వ్యాయామలు సూచించాను. ఆ తర్వాత ఆహారంలో కొన్ని మార్పులు చెప్పాను. చేపలు ఎక్కువగా తినమని సలహా ఇచ్చాను. ఇది శరీరానికి ప్రోటీన్ అందించడమే కాకుండా, కేలరీలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. అలాగే వివిధ కూరగాయలను కూడా సజెస్ట్ చేశాను. ఈ నియమాల కారణంగానే కపిల్ బరువు తగ్గాడు. అభిమానులు కూడా కపిల్ న్యూ లుక్ ను చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు’ అని చెప్పుకొచ్చాడు ఫిట్ నెస్ ట్రైనర్.