Naseeruddin Shah: గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా.. ఇప్పుడు మరో యాక్టర్ నసీరుద్ధీన్ షా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ షా న్యూమోనియాతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయనకు ఆరోగ్యం మరింత క్లీణించడంతో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం నసీరుద్దీన్ ఆరోగ్యం బాగుందని.. చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. గత రెండు రోజులుగా నసీరుద్దీన్ న్యూమోనియాతో బాధుపడుతున్నారని ఆయన భార్య రత్న పాథక్ అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా చెప్పారు.
నసీరుద్దీన్ 1975లో శ్యామ్ బెనెగన్ తెరకెక్కించిన నిశాంత్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్పార్ష్, కల్ట్, జానే భీ దో యారో, మసూమ్, మిర్చి మసాలా, ఇష్కియా, డర్టీ పిక్చర్, జిందగీ నా మిలేగి డోబారా వంటి చిత్రాల్లో నటించారు. దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించిన నసీరుద్దీన్ మూడు జాతీయ అవార్డులను అందుకున్నాడు. అంతేకాకుండా.. మోట్లీ ప్రొడక్షన్స్ అనే థియేటర్ గ్రూప్ ను కూడా రూపొందించాడు నసీరుద్దీన్. ఈయన చివరి సారిగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన బాందీష్ బందిపోట్లు వెబ్ సిరీస్ లో నటించాడు.