పంచ్ డైలాగులు పేలుతున్నాయ్. యాక్షన్ థ్రిల్లర్ సెంటిమెంట్ సిన్మాని తలపిస్తోంది పుష్ప ఎపిసోడ్. క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో ఎవరి ఊహకీ అందడంలేదు. హీరోలైతే మాత్రం.. బాధ్యతగా ఉండొద్దా అంటోంది ప్రభుత్వం. సెలబ్రిటీలు సిన్మాకు వెళ్లడమే నేరమా అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇది ముమ్మాటికీ కక్షసాధింపేనంటున్నాయ్ విపక్షాలు. ఎవరివాదన వారిదే.. కానీ ప్రజల దృష్టిలో తప్పెవరిది?..
ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదోగానీ.. ఒక్క దుర్ఘటన ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధాన్నే సృష్టించింది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లను పండుగలా నిర్వహించే సినీ పరిశ్రమలో కార్చిచ్చులా రాజుకుంటోంది పుష్ప వివాదం. నాటోన్లీ టాలీవుడ్.. బాలీవుడ్ దాకా ఇప్పుడు అల్లు అర్జున్‌పై కేసు గురించే చర్చ. అరెస్టయ్యారు, రిమాండ్ అయ్యారు. బెయిలొచ్చినా ఓ రాత్రంతా జైల్లో ఉన్నారు. మ్యాటర్ ఇంతటితో క్లోజ్ అవుతుందనుకుంటే ఇప్పట్లో మంటలు చల్లారేలా కనిపించడంలేదు.
డిసెంబర్4. చిక్కడపల్లి సంధ్య థియేటర్. పుష్ప టూ ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇసుకేస్తే రాలనంత జనసందోహం. హీరోని చూసేందుకు పోటెత్తారు అభిమానులు. కానీ అభిమానం ఓ నిండు ప్రాణం తీస్తుందని, మరొకరిని ప్రాణాపాయస్థితిలోకి నెట్టేస్తుందని ఊహించలేదెవరూ. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తొమ్మిదేళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ మూడువారాలుగా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్సపొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో ఏ11గా అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు రెండువారాల రిమాండ్ విధించినా.. హైకోర్టు బెయిల్ మంజూరుచేయడంతో రిలీజయ్యారు అల్లు అర్జున్. కానీ ఫార్మాలిటీస్ ఆలస్యం కావటంతో ఓ రాత్రంతా ఆయన చంచలగూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై సెలబ్రిటీలంతా స్పందించారు. జైలునుంచి ఇంటికి చేరగానే అల్లు ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టారు. బాలీవుడ్ తారలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌ని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్, బీజేపీ అల్లు అర్జున్ అరెస్ట్‌ని తప్పుపట్టాయి. నేషనల్ అవార్డ్ విన్నర్‌ని ఓ క్రిమినల్‌లా అరెస్ట్ చేశారని విమర్శించాయి. మహిళ మృతిపై విచారం వ్యక్తంచేస్తూనే ఆ తొక్కిసలాటకు తాను కారణం కాదన్నారు అల్లు అర్జున్. మృతురాలి కుటుంబానికి 25లక్షల పరిహారం ప్రకటించారు. అల్లు అర్జున్‌ని సినీ ఇండస్ట్రీతో పాటు విపక్షాల సంఘీభావంతో.. అసెంబ్లీలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేసింది. అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో స్పందించారు సీఎం రేవంత్‌రెడ్డి.
అల్లు అర్జున్ అరెస్ట్ తొందరపాటు చర్యని బీజేపీ, బీఆర్‌ఎస్ తప్పుపడితే.. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ చర్యని సమర్థించింది మజ్లిస్‌పార్టీ. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. తొక్కిసలాట ఘటన చివరికి సిన్మా ఇండస్ట్రీపై చర్చగా మారిపోయింది. సినీ ఇండస్ట్రీకి మినహాయింపు విషయంలో ఇక కచ్చితంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. అల్లు అర్జున్‌కి సినీ ప్రముఖులంతా మద్దతు పలకటంతో సర్కారు కూడా తొక్కిసలాట ఘటనని సీరియస్‌గా తీసుకుంది.
ఓరాత్రంతా జైల్లో గడిపివచ్చాక ఆచితూచి స్పందించారు అల్లు అర్జున్. జరిగిన ఘటన దురదృష్టకరమని, తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే తనపై అసెంబ్లీలో చర్చ జరిగిందో మరోసారి మీడియాముందుకొచ్చారు పుష్పరాజ్. తన క్యారెక్టర్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. తానెలాంటి రోడ్‌షోలు చేయలేదని, తొక్కిసలాట జరిగినట్లు కూడా తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ వివరణ తమను నిందించేలా ఉండటంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. అనుమతి లేకున్నా అల్లు అర్జున్ థియేటర్‌కొచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని సీసీ ఫుటేజ్, ఇతర వీడియోలను బయటపెట్టారు. అల్లు అర్జున్ టీంతో పాటు థియేటర్ సిబ్బంది సహకరించలేదని కేసులో కొత్త ట్విస్టులు తెరపైకొచ్చాయి. డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ వచ్చినప్పుడు బయట, లోపల ఏం జరిగిందో మినిట్ టు మినిట్.. పిన్ టు పిన్ వీడియో ఎవిడెన్స్ రిలీజ్ చేశారు పోలీసులు. రాత్రి 9.15 నుంచి అర్ధరాత్రి 12గంటల 5 నిమిషాలదాకా అక్కడేం జరిగిందో.. రీల్ టూ రీల్ పుష్ప త్రీ చూపించారు.
థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్‌కే పరిమితంకాలేదు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చుట్టుకుంది. ఆయన అరెస్ట్ తప్పన్నవారు కూడా ఇలా జరిగుండాల్సి కాదని భావిస్తున్నారు. ప్రభుత్వంతో ఘర్షణ వైఖరితో పరిశ్రమ నష్టపోతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇండస్ట్రీకి ఎప్పుడూ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఎదురుకాలేదు. ఏ వివాదమైనా పరిశ్రమ మొత్తానికి వర్తించేలా ఉండేది. కానీ ఇప్పుడు ఓ హీరోపై మొదలైన వివాదం ఇండస్ట్రీకి చుట్టుకుంటోంది. సెలబ్రిటీలు చట్టానికి అతీతులు కారంటోంది ప్రభుత్వం. హీరోలకన్నా తమకు సామాన్యుల ప్రాణాలే ముఖ్యమంటోంది.
తొక్కిసలాటలో మహిళ మృతికి హీరో కారణమైతే.. ఆ లెక్కన ప్రభుత్వ పెద్దలపై కూడా కేసులు పెట్టాలంటోంది బీఆర్‌ఎస్. ప్రభుత్వ విధానాలతో ఆత్మహత్యలు చేసుకున్న వారి చావులకు సర్కారే బాధ్యత వహించాంటోంది. ఇక బీజేపీ నాయకత్వమైతే అల్లు అర్జున్ అరెస్ట్‌ని జాతీయస్థాయిలో వ్యతిరేకిస్తోంది. సెలబ్రిటీలే ముఖ్యమా.. సామాన్యుల ప్రాణాలకు విలువలేదా అన్న చర్చతో మ్యాటర్ మరో టర్న్ తీసుకుంటోంది. జస్టిస్ ఫర్ రేవతి అనే స్లోగన్ సౌండ్ పెరుగుతోంది. ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో కామన్‌మేన్ వర్సెస్ సెలబ్రిటీస్ వాదనని తెరపైకి తెచ్చారు ప్రభుత్వ పెద్దలు. దీంతో బీఆర్‌ఎస్ ఈ విషయంలో కాస్త స్వరం తగ్గించినా.. బీజేపీ మాత్రం తగ్గేదేలేదంటోంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని నిందిస్తోంది తెలంగాణ బీజేపీ. ఇద్దరు కేంద్రమంత్రులూ అల్లు అర్జున్ అరెస్ట్‌ని తీవ్రంగా తప్పుబడుతుంటే.. ఏపీలో ఆ పార్టీ నాయకత్వం భిన్నంగా స్పందిస్తోంది. మిగతావారిని అరెస్ట్ చేయకుండా ఒక్క హీరోనే అరెస్ట్ చేస్తే అది తప్పేనన్నారు ఏపీబీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాత్రం అసెంబ్లీలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు.
తొక్కిసలాట ఘటనలో హీరో ప్రమేయం దగ్గరే ఆగడం లేదు చర్చ. అసలా సిన్మా కంటెంట్ ఏంటన్నదానిపైనా మొదలైంది రచ్చ. అడ్డదారులు తొక్కే స్మగ్లర్‌ని కథానాయకుడిగా చూపించే సిన్మాకి జాతీయ అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమంటున్నారు ప్రభుత్వ పెద్దలు. నైజాంలో సిన్మాలు ఆడకపోతే ఇండస్ట్రీకి బతుకే లేదని తీవ్రస్థాయిలో స్పందించారు. కోట్లకు పడగలెత్తే సిన్మా హీరోలు ఏనాడైనా ఏ ఊరినైనా దత్తత తీసుకున్నారా అన్న ప్రశ్న వస్తోంది అధికారపార్టీ నుంచి.
మొదట పుష్ప వర్సెస్ రేవంత్. నిన్నేమో సెలబ్రిటీ వర్సెస్ కామన్‌మేన్. ఇప్పుడు సినీపరిశ్రమ వర్సెస్ ప్రజాప్రభుత్వంగా మారిపోయింది వివాదం. సెలబ్రిటీల స్టేటస్సే ముఖ్యమా.. సామాన్యుల ప్రాణాలకు విలువలేదా అన్న ప్రశ్నతో అసలీ ఘటనలో తప్పెవరిదన్న చర్చ గ్రౌండ్‌లెవల్‌కి వెళ్లిపోయింది. విషయం సున్నితంగా మారటంతో ఇంటిపై కొందరు దాడికి ప్రయత్నించినా.. అంత సీరియస్‌గా రియాక్ట్ కాలేదు అల్లు ఫ్యామిలీ. తొక్కిసలాట ఘటనని నిరసిస్తూ విద్యార్థిసంఘాలు దాడికి దిగినా.. అంతా సంయమనం పాటించాలని అప్పీల్ చేశారు అల్లు అరవింద్.
ఎంత లేదన్నా.. ఎవరు కాదన్నా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయరంగు పులుముకుంటోంది. దీంతో సమస్య మరింత జటిలం కాకుండా చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాలిస్తోంది. కార్చిచ్చుని చల్లార్చే ప్రయత్నాలైతే మొదలయ్యాయి.
రాజకీయం చేస్తున్నదెవరు? వివాదం చల్లారకుండా చూస్తున్నదెవరు? పుష్ప తగ్గుండాల్సిందని ప్రభుత్వం భావిస్తోందా? సర్కారు కన్నెర్రతో ఇండస్ట్రీ కలవరపడుతోందా? ఇండస్ట్రీ ఏం చేయబోతోంది? పుష్పరాజ్ కేసు ఏ మలుపు తిరగబోతోంది?
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రొటీన్ డైలాగే అయినా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం. తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ విషయంలో చట్టం తుదినిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ ఎపిసోడ్ సినీ పరిశ్రమలో తుఫాన్ సృష్టించింది. ఇక బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతించకూడదని తెలంగాణ సర్కారు సీరియస్ డెసిషన్ తీసుకునేదాకా వచ్చింది. ఏపీపైనా ఇది ప్రభావం చూపేలా ఉంది.
లాభాలొస్తే జనానికేమన్నా ఇస్తారా. టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచుకునేందుకు పర్మిషన్ ఎందుకివ్వాలనే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ వ్యవహారంలో సీఎం స్పందనతో.. ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగాలని కోరుకుంటున్నారు పరిశ్రమ పెద్దలు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించింది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్.
పెద్ద బ్యానర్లు, బడా హీరోల సిన్మాలపై ఇండస్ట్రీలో మొదట్నించీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చిన్న సిన్మాలకు కూడా స్క్రీన్స్ దొరకాలనే వాదన మొదట్నించీ ఉంది. అల్లు అర్జున్ కేసుతో అవన్నీ మళ్లీ చర్చకొస్తున్నాయి. తెలంగాణలో పరిణామాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ అవుతుందనే చర్చ.. వివాదానికి ఇంకాస్త ఆజ్యంపోస్తోంది. పవన్‌కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండటంతో రాష్ట్రానికి సినీ పరిశ్రమని స్వాగతిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.
తాను సీఎంగా ఉండగా ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని, టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదని చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. దీంతో సంక్రాంతికి రిలీజ్ కానున్న తెలుగు సినిమాల నిర్మాతల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. పండగ సీజన్‌లో కలెక్షన్లపై ఆశలు పెట్టుకున్న ప్రొడ్యూసర్లు డైలమాలో పడ్డారు. తెలంగాణలో కుదరకపోయినా ఏపీలోనైనా కవర్ చేసుకుందామంటే ఆ పప్పులు ఉడకవన్నట్లే స్పందిస్తున్నారు అక్కడి అధికారపార్టీ నేతలు..
రాజకీయం తలదూర్చింది. సమాజానికి ఈ సిన్మా ఏమిచ్చిందని ప్రశ్నించేదాకా వచ్చింది. ఇండస్ట్రీకి కూడా ఇది పరీక్షాసమయంలా ఉంది. ఎవరిమీదా తమకు వ్యక్తిగతంగా కోపం ఉండదంటోంది ప్రభుత్వం. సామాన్య ప్రజల భద్రత, సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని చెబుతోంది. మరోవైపు జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తంచేస్తున్న అల్లు అర్జున్.. ఈ కేసునుంచి ఎలా బయటపడతారన్న చర్చ జోరందుకుంది. రేవతి మృతి కేసులో ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్. బన్నీ బెయిల్‌ని రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు హైదరాబాద్ పోలీసులు. హైకోర్ట్ కండీషన్లను పట్టించుకోకుండా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టారని.. ఇది బెయిల్ నిబంధనలకు విరుద్ధమన్నది పోలీసుల వాదనగా కనిపిస్తోంది.
ఇంత కష్టపడి నిర్మించుకున్న ఇమేజ్ ఒక్క ఘటనతో డ్యామేజ్ అవుతోందన్న బాధ అల్లు కుటుంబానిది. సినీపరిశ్రమ ముఖ్యమే. కానీ ప్రజలు అంతకంటే ముఖ్యమన్నది ప్రభుత్వ వాదన. అనుకోకుండా ఓ ఘటన జరిగిపోయింది. ఈ వివాదం ఇంతటితో సమసిపోతే బాగుంటుందని కోరుకుంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. బాధిత కుటుంబానికి 50లక్షల చెక్కుని అందించారు పుష్పటూ నిర్మాతలు. ఆ కుటుంబానికి జీవితకాలం భరోసా ఉండే ఏర్పాటు చేస్తామంటోంది అల్లు ఫ్యామిలీ. తప్పెవరిదని నిందిస్తూ కూర్చునేకంటే.. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడితేనే బాగుంటుందని ఫీలవుతున్నాడు కామన్‌మ్యాన్ కూడా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి