హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు హీరో అల్లు అర్జున్ ఇప్పటికే పలు సందర్భాల్లో అన్నారు. ఆయన కోరిక ‘సైరా నరసింహారెడ్డి’తో తీరబోతున్నట్లు తెలుస్తోంది. చిరు కథానాయకుడిగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో మెగా వారసురాలు నిహారిక ఓ పాత్రలో మెరవబోతున్నారు. బన్నీ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
‘సైరా’లో నయనతార, తమన్నా కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయాలని చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి