Modi vs Mamata : రణరంగాన్ని తలపించిన బెంగాల్‌ ఎన్నికలు, ఓటేసే పండగ వేళ.. నల్ల గుర్తు కన్నా ఎర్రటి నెత్తురు మరకలే..

West Bengal poll violence : బెంగాల్‌ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఓటేసే పండగ నాడు..

  • Venkata Narayana
  • Publish Date - 9:18 pm, Sat, 10 April 21
Modi vs Mamata : రణరంగాన్ని తలపించిన బెంగాల్‌ ఎన్నికలు, ఓటేసే పండగ వేళ.. నల్ల గుర్తు కన్నా ఎర్రటి నెత్తురు మరకలే..
144 Section In Bengaluru

West Bengal poll violence : బెంగాల్‌ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఓటేసే పండగ నాడు బెంగాలీలు నల్లగుర్తు కన్నా ఎర్రటి మరకలే ఎక్కువగా చూశారు. బీజేపీ – టీఎంసీ మధ్య సాగుతున్న మసాలా డైలాగ్‌వార్‌.. ఎలక్షన్‌ హీట్‌ను పెంచేసింది. కుచ్‌బీహార్‌ జిల్లాలో జరిగిన CRPF కాల్పల్లో ఐదుగురు చనిపోవడం సంచలనగా మారింది. ఇది కేంద్ర బలగాల హత్య అని మమత ఆరోపిస్తే, ఓటమి ఖాయమనే దీదీ ఇలా మాట్లాడుతున్నారంటూ మోదీ కౌంటర్‌ ఇచ్చారు. అటు మాటలు- ఇటు హింసతో బెంగాల్‌ అట్టుడుకుతోంది. బెంగాల్‌లోని ప్రతీజిల్లాలో గొడవలు. గల్లీగల్లీలో హింస, కేంద్రబలగాల ఫైరింగ్‌లు, ప్రజల చావులు ఓట్ల వేళ నిత్యకృత్యాలయ్యాయి.

కుచ్‌ బిహార్‌ ఘటన కేంద్రబలగాలు చేసిన హత్యగా దీదీ అభివర్ణించారు. ఈ ఘటనపై CID చేత సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామాకు మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. “సీతాల్‌ కుచి ఘటనకు నిరసనగా బెంగాల్‌ ప్రజలు నిరసన వ్యక్తం చేయాలి.. ఆ ఘటనకు బాధ్యతకు వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలి.. ప్రజలంతా నల్లబ్యాడ్జీలు ధరించి రేపు రోజంతా ఈ డిమాండ్‌ను వినిపించాలి” అని ఆమె తీవ్రస్వరంతో పిలుపునిచ్చారు.

ఇక, కుచ్‌బీహార్‌ కాల్పుల ఘటనలో ఐదుగురు మృతిచెందడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతున్న జవాన్లపై దీదీకి కోపమెందుకని ప్రశ్నించారాయన. “కుచ్‌ బీహార్‌లో జరిగిన ఘటన చాలా బాధాకరం. చనిపోయిన వాళ్ల కుటుంబాలకు నా సానుభూతి. బీజేపీ వైపు ప్రజలు మళ్లడంతో దీదీకి, ఆమె గూండాలకు కలవరం కలుగుతోంది” అని మోదీ అన్నారు. “బెంగాల్‌ ప్రజల అధికారాన్ని కాపాడుతున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దీదీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పంచాయతీ ఎన్నికల్లా దీదీ గూండాలు ఓట్లు వేసుకోలేకపోతున్నారు. అందుకోసమే దీదీ కోపంగా ఉన్నారు.” అని మోదీ ఎద్దేవా చేశారు.

కాగా, బెంగాల్‌ ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. స్థానిక అధికారుల నుంచి నివేదిక కోరింది. హింస చెలరేగిన చోట ఎన్నికలను వాయిదా వేశారు. మొత్తంగా బెంగాల్‌లో 4 విడత ఎన్నికల్లో 20 మంది చనిపోయారు. ఇందులో 13 మంది తృణమూల్‌ కార్యకర్తలని దీదీ అంటున్నారు. కేంద్ర బలగాల తీరును మమత తప్పుబడుతున్నారు. బెంగాల్‌లో నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. మరో నాలుగు విడత పోలింగ్ మిగిలి ఉంది. ఒకవైపు- అధినాయకుల ప్రసంగాలు కాక పుట్టిస్తున్నాయి. బీజేపీ-తృణమూల్‌ నువ్వానేనా అన్నట్లు ఘర్షణలకు దిగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రబలగాలపై సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేయడం, దర్యాప్తునకు ఆదేశించడంతో- బెంగాల్‌ ఎన్నికల హింస ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Read also : Corona vaccine : శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కష్టాలు, ప్రజల్లో ఉత్సుకత నెలకొన్న సమయంలో కొత్త ఇబ్బందులు