Avijit Ghosal: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ‘మాటువా’ ఓట్ల కోసం తృణమూల్, బీజేపీ పాకులాట..ఎవరీ మాటువాలు..వారి ఓట్లకు ఎందుకు అంత విలువ?
వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్.. భారతీయా జనతా పార్టీ ఎన్నికల్లో నువ్వా..నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ప్రజల నుంచి మద్దతు కూడ గట్టేందుకు.. ఓట్లను కొల్ల గొట్టేందుకు ఎటువంటి అవకాశం దొరికినా వదలడం లేదు.
Avijit Ghosal: వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్.. భారతీయా జనతా పార్టీ ఎన్నికల్లో నువ్వా..నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ప్రజల నుంచి మద్దతు కూడ గట్టేందుకు.. ఓట్లను కొల్ల గొట్టేందుకు ఎటువంటి అవకాశం దొరికినా వదలడం లేదు. ఇటువంటి సమయంలో రెండు పార్టీలు ఇప్పుడు అక్కడ ‘మాటువా’ ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నాయి. వారి ఓట్లను సంపాదించడానికి రెండు ప్రార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అసలు మాటువాలు అంటే ఎవరు? ఇందుకోసం రాజకీయ పక్షాలు వారి ఓట్ల కోసం ఇంతగా పరితపిస్తున్నారు? ఒకసారి తెలుసుకుందాం.
హిందువుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా..
‘మాటువా’ అనే తెగ ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ జిల్లాలో ఉన్నత కుల హిందువుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడింది. అక్కడి గోపాల్ గంజ్ ప్రాంతంలో హరిచంద్ ఠాకూర్ అనే ఆయన ఈ తెగను 1812 సంవత్సరంలో మార్చి 11 న ఏర్పాటు చేశారు. బెంగాల్ ప్రాంతంలోని ఉన్నత కులం అయినా వైష్ణవ కులానికి చెందిన జమిందార్ హరిచంద్. హరి నామస్మరణ పీడిత ప్రజల విముక్తికి దారి చూపిస్తుందని నమ్మిన హరిచంద్ అక్కడి ప్రజలకు తన ప్రవచనాలు చెబుతూ ఉండేవారు. అయితే, అక్కడి హిందూ మతంలో ఉన్నత కులంగా మెలుగుతున్న వైష్ణవులకు ఈయన ఇలా చేయడం నచ్చలేదు. దీంతో వారు హరిచంద్ అనుచరులను ‘మాటో’ అని అగౌరవంగా పిలవడం మొదలు పెట్టారు. దీంతో ఈ పదాన్ని హరిచంద్ తన అనుచరులకు లేబుల్ గా ఎంచుకున్నాడు. క్రమేపీ ఆ పదం ‘మాటువా’ గా స్థిరపడిపోయింది.
హరిచంద్ తరువాత 1878లో ఆయన కుమారుడు గురుచంద్ మాటువాల బాధ్యత తీసుకున్నారు. అయన హయాంలో ‘మాటువా’ తెగ విపరీతంగా వృద్ధి చెందింది. సంప్రదాయ హిందూయిజం..వైష్ణవిజం లోని కొన్ని మంచి విషయాలను తీసుకుని.. వాటికి తమదైన కొత్త అంశాలను జోడించి మాటువా లకు కొత్త దశను నిర్దేశించారు గురుచంద్. వీరు విగ్రహారాధన.. సంప్రదాయ హిందూ పూజలను నమ్మరు. దేవుడు ఎక్కడో లేదనీ, మానవ హృదయంలోనే ఉన్నాడనీ విశ్వసిస్తారు. “ఆకలితో బాధపడుతున్న వ్యక్తి మతాన్ని ఎలా ఆచరించగలడు?” అని ప్రశ్నించే వారు గురుచంద్.
ఇలా మాటువా తెగ తమదైన ప్రత్యేక పంథాలో.. నమ్మకాలతో వృద్ధి చెందింది. వీరికి ప్రత్యేకమైన జెండా, ఎజెండా ఏర్పాటు చేసుకున్నారు. వీరి జెండా ఎరుపు, తెలుపు రంగులతో ఉంటుంది.. ఎరుపు రుతుస్రావాన్ని.. తెలుపు శాంతిని సూచిస్తుంది. కుటుంబ వ్యవస్థను మాతువా తెగ వారు నమ్ముతారు. కుటుంబం కంటే ముందే వివాహం ఉండాలని గురుచంద్ చెప్పారు.
ప్రభావం ఎంత?
టీవీ 9 ఎలక్షన్ ఇంటిలిజెన్స్ అండ్ రీసెర్చ్ వింగ్ లెక్కల ప్రకారం.. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మాటువా తెగ వారు నాలుగు జిల్లాలోని 39 నియోజకవర్గాల్లో విషరించి ఉన్నారు. స్థానిక జనాభాలో దాదాపు 20 శాతం మాటువ తెగ వారు ఉన్నారు. నదియా జిల్లాలో 10 నియోజకవర్గాల్లో, నార్త్ 24 పరాగణాల జిల్లాలో 9 నియోజకవర్గాల్లో, సౌత్ 24 పరగణ జిల్లాలో 12 నియోజకవర్గాలు, ఈస్ట్ బురుద్వాన్ జిల్లాలో 8 నియోజకవర్గాల్లోనూ మాటువా లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు.
అందుకే తృణమూల్ కాంగ్రెస్, బీజీపీ రెండు పార్టీలు ఈ మాటువ తెగ వారి ఓట్ల కోసం పాకులాడుతున్నాయి. అందుకోసం కసరత్తులు చేస్తున్నాయి.
రాజకీయంగా ‘మాటువా’ల ప్రస్థానం ఇదీ..
రాజకీయంగా మాటువాలు చాలా దశాబ్దాలుగా యాక్టివ్ గా ఉన్నారు. 1937 సంవత్సరంలోనే గురుచంద్ ఠాకూర్ మనవడు ప్రమాతా రంజాన్ బెంగాల్ ప్రోవినికల్ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే రాజకీయంగా అందరూ ఒక్కతాటిపై ఉంటేనే తమ తెగను రక్షించుకునేందుకు వీలు ఉంటుందని వీరు భావించారు. దీంతో అన్ని పార్టీలు వీరివైపు దృష్టి సారించాయి.
అన్నిచోట్లా జరిగినట్టే.. రాజకీయంగా ఒక్కటి అవుదామనుకున్న ఈ తెగలో రాజకీయంగానే చిచ్చు మొదలైంది. గురుచంద్ మనవడు పీ ఆర్ ఠాగూర్ హయాంలో వీరు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. తరువాత పాకిస్థాన్ వ్యవస్థాపక పితామహులలో ఒకరైన జోగేంద్ర నాథ్ మొండాల్, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ వంటి వారితో మరో రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. కాంగ్రెస్ వైపు తిరిగిన పి ఆర్ ఠాకూర్ నేతృత్వంలోని బృందం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మకాం మార్చాలని కోరుకున్నారు, అయితే, జోగేంద్రనాథ్ మొండల్ దిగువ కులాలకు భారతదేశంలో భవిష్యత్తు ఉండదు అందుకని తాము తూర్పు పాకిస్తాన్‌లోనే ఉండాలని అన్నారు. ఆ తరువాత మొండాల్ స్వయంగా పాకిస్తాన్‌లో క్యాబినెట్ మంత్రిగా మారారు.
అయితే, 1956-57 వచ్చేసరికి లక్షలాది మంది రైతులు తూర్పు పాకిస్తాన్ నుండి పశ్చిమ బెంగాల్‌లోకి వెళ్లడం ప్రారంభించారు. దీంతో విభజన రాజకీయాల ప్రభావం మాటువాస్ ఐక్యతపై ప్రభావం చూపింది. అలా వలస వచ్చిన మాటువాలు శరణార్థులుగా ఎన్నో కష్టాలు పడ్డారు.
ఇప్పుడు మాటువాలు వెస్ట్ బెంగాల్ లో చాలా ప్రాంతాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు వారి ఓట్ల కోసం ప్రాకులాడుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో వారు ఏ పార్టీకి జై కొడతారనేది ఆసక్తికరంగా మారింది.