prashant kishor on modi: ప్రధాని మోదీ ప్రజాదరణ కలిగిన నేత.. అయినా బెంగాల్ పీఠం మమతాదేః ప్రశాంత్ కిశోర్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ కలిగిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు.
prashant kishor on modi popularity: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ కలిగిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు. రాజకీయ యవనికపై ప్రత్యర్థులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దని, తానుకూడా తక్కువగా అంచనా వేయనని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఎవరితో అయితే రాజకీయ వైరం ఉంటుందో, వారి శక్తిని ఎక్కువగా అంచనా వేసే రంగంలోకి దిగడం మంచిదన్నారు.
ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఈ మధ్య వైరల్ అయిన ఆడియో టేప్ గురించి స్పందించిన ఆయన.. ఆడియో టేపుల్లో ఉన్నట్లు తాను వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. ఆ ఆడియోలో లీక్ కావడం అంటూ ఏమీ లేదని, అదంతా బహిరంగమే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లను దాటలేదని మరోసారి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు.
అలాగే కేంద్ర బలగాలపై సీఎం మమత చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా తప్పులు జరుగుతున్నాయని మాత్రమే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని పీకే చెప్పుకొచ్చారు. కోచ్‌బిహార్‌లో కేంద్ర బలగాలు కాల్పులకు దిగడంతోనే ఐదుగురు మృత్యువాతపడ్డారు. అంతేకానీ సీఎం మమత ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేని స్పష్టం చేశారు. ఒకవేళ ఓటు వేసే క్రమంలో మహిళల్ని అడ్డుకుంటే, కేంద్ర బలగాలను ఘోరావ్ చేయాలని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లి సందర్శించడం ముఖ్యమంత్రిగా మమత హక్కు అని స్పష్టం చేశారు. 2014 లో పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారని, మరుసటి రోజే ప్రధాని మోదీ వారిని కలిశారని ప్రశాంత్ కిశోర్ గుర్తు చేశారు. కానీ అప్పుడు ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మాత్రం ఘటనా స్థలానికి వెళ్లకుండా సీఎం మమతను అడ్డుకుంటున్నారని పీకే ఆక్షేపించారు. పేద ప్రజలతో సీఎం మమత సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా మంచి నేత అని, అయితే సీఎం మాత్రం మమతాయేనని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
Read Also… Sharad Pawar: పక్షం రోజుల్లో శరద్ పవార్ కు రెండో సర్జరీ.. ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే..