West Bengal election 2021: జార్ఖండ్ ముక్తి మోర్చా కీలక నిర్ణయం.. బెంగాల్ ఎన్నికల్లో మమతాకు మద్దతిస్తున్నట్లు ప్రకటన
JMM - TMC: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాష్ట్రంలో హోరాహోరి ప్రచారం కొనసాగుతుంది. నేతల మాటల తూటాలతో బెంగాల్‌లో..

West Bengal : JMM – TMC: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాష్ట్రంలో హోరాహోరి ప్రచారం కొనసాగుతుంది. నేతల మాటల తూటాలతో బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో జేఎంఎం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వనున్నట్లు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. అయితే బీజేపీని ఓడించడానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కు మద్దతు ఇస్తామని హేమంత్ సోరెన్ స్పష్టంచేశారు. బెంగాల్‌లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడం లేదని.. బీజేపీని ఓడించేందుకు మమతకు మద్దతిస్తామని సోరెన్ పేర్కొన్నారు.
అయితే అంతకుముందు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. మత శక్తులను ఓడించేందుకు తనతోపాటు రావాలని జేఎంఎం అగ్రనాయకుడు షిబు సోరెన్‌ను కోరారు. దీంతోపాటు ఈ ఎన్నికల్లో తన కోసం ప్రచారం చేయాలంటూ హేమంత్ సోరెన్ ను సైతం అభ్యర్థించారు. ఈ మేరకు హేమంత్ సోరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నప్పటికీ హేమంత్.. బెంగాల్‌లో మమతాకు మద్దతు తెలుపడం విశేషం. ఇదిలాఉంటే.. మమతాకు ఇప్పటికే పలు పార్టీల అధినేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు మద్దతిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలిదశ పోలింగ్ జరగనుంది. కాగా.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. బీజేపీ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా శుక్రవారం 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, టీఎంసీ మధ్య పోటాపోటీ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ కూడా వామపక్షాలతో జతకట్టి సత్తాచాటేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Also Read:




